Siricilla Police: శబ్ద కాలుష్యం వెదజల్లే బైకులపై సిరిసిల్ల పోలీసులు కొరడా, 72 బైక్ సైలెన్సర్‌ల ధ్వంసం
Siricilla Police: రణ గొణ ధ్వనులతో జనాన్ని ఇబ్బంది పెట్టి బైక్ లపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కొరడా ఝుళిపించారు. పోలీస్ సైరన్ తో పాటు శబ్ద కాలుష్యాన్ని వెదజల్లే 72 బైక్ లను పట్టుకొని సైలెన్సర్లను తొలగించి రోడ్డు రోలర్ తో తొక్కించి ద్వంసం చేశారు.
Siricilla Police: వింత వినూత్న కార్యక్రమాలతో ఫ్రెండ్లీ పోలీస్ తో ముందుకు పోతున్న రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు బైకులు చేసే ధ్వని కాలుష్యంపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆద్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా పోలీస్ సైరన్ ఉపయోగించిన మూడు వాహనాలతోపాటు సైలెన్సర్ లను వినియోగిస్తున్న 72 బైక్ లను పట్టుకున్నారు.
బైక్ ల నుంచి సైలెన్సర్లను తొలగించి రోడ్డుపై వరుసక్రమంలో పెట్టి రోడ్డు రోలర్ తో తగ్గించి ద్వంసం చేశారు. పోలీస్ సైరన్ పెట్టుకున్న మూడు వాహనాలను సీజ్ చేసి వాహనం యాజమానులపై కేసు నమోదు చేశారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు..ఎస్పీ అఖిల్ మహాజన్
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని ఎస్పీ అఖిల్ మహజన్ తెలిపారు. బైక్ ల సౌండ్ లపై గత రెండు నెలల నుండి వస్తున్న ఫిర్యాదుల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.
ధ్వని కాలుష్యం సృష్టిస్తూ తిరుగుతున్న వాహనాలపై ఎవరు ఫిర్యాదు చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనదారులు ప్రవర్తించకూడదని, వాహనాల సైలెన్సర్లను చేంజ్ చేస్తూ ధ్వని కాలుష్యం సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
పోలీస్ సైరన్ చర్యలు..
నిబంధనలు విరుద్ధంగా వాహనాలకు పోలీస్ సైరన్లు బిగిస్తే వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. పోలీస్ సైరన్లు బిగించిన 10 వాహనాలపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరిగిందన్నారు. వాహనాలకు సైలెన్సర్ మార్పు చేసి శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న వారి సమాచారం సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్.ఐ 8712656441 , వేములవాడ ట్రాఫిక్ ఎస్.ఐ 8712656440 కి సమాచారం ఇవ్వాలని కోరారు.
వాహనాలు దగ్దం చేసిన నిందితుడు అరెస్టు..
సిరిసిల్ల పెద్దూర్ డబుల్ బెడ్ రూమ్ హౌసేస్ ముందు పార్క్ చేసిన నాలుగు మోటర్ సైకిల్స్ పై పెట్రోల్ పోసి దగ్దం చేసిన నిందితుడిని పోలీసులు గుర్తించారు. అదే ప్రాంతంలో నివాసం ఉండే ఆకారం బాలయ్య బైకుల దగ్దానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతన్ని అరెస్టు చేసే రిమాండ్ కు తరలించినట్లు ప్రకటించారు. రెండు గంటల వ్యవధిలోని సీసీ కెమెరాల సహాయంతో హ్యూమన్ ఇంటలిజెన్స్ ఉపయోగించి నిందితుడిని గుర్తించినట్లు తెలిపారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)