Vivah Panchami: వివాహ పంచమి ఎప్పుడు? తేదీ, కథ, ఆచార వ్యవహారాలేంటో తెలుసుకోండి?
Vivah Panchami:వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండటానికి దంపతులిద్దరూ కలిసి చేసుకునే పండుగ వివాహ పంచమి. ఈ ఏడాది వివాహ పంచమి ఎప్పుడు జరుపుకోవాలి? వివాహ పంచమి రోజు ఎలాంటి ఆచారాలు పాటించాలి? తెలుసుకుందాం.
హిందూ పండగల్లో వివాహ పంచమికి విశేష ప్రాముఖ్యత ఉంది. తమ వైవాహిక జీవితం సుఖంగా, సంతోషంగా ఉండాలని దంపతులు, నూతన వధూవరులు ఆనందంగా జరుపుకునే పండగ.వివాహ పంచమి ప్రతి ఏడాది మార్గశిర మాసం శక్లపక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. ఈ రోజునే శ్రీరాముడు సీతాదేవికి వివాహం చేసుకున్నాడని రామాయణం చెబుతోంది. ఈ రోజున నూతన వధూవరులు, దంపతులు భక్తితో పూజలు, వ్రతాలు చేస్తే దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు రావని నమ్మిక.ఈ రోజున చేసే పూజలు భార్యభర్తల మధ్య ప్రేమ, సానుకూలత, సామరస్యాన్ని పెంచుతాయని భక్తులు విశ్వసిస్తారు.
వివాహ పంచమి తిథి:
పంచాగం ప్రకారం ఈ ఏడాది మార్గశిర మాస శుక్ల పక్షంలో వివాహ పంచమి తిథి డిసెంబర్ 5వ తేదీ మధాహ్నం 12:49గంటలకు ప్రారంభమవుతుంది. తిరిగి డిసెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 12:07 నిమిషాలకు ముగుస్తుంది. కనున ఈ సారి వివాహ పంచమి పండుగలను డిసెంబర్ 6వ తేదీ అంటే శుక్రవారం జరుపుకోనున్నారు.
వివాహ పంచమి కథ:
ఒకానొక సమయంలో మహర్షి విశ్వామిత్రుడు అయోధ్య రాజు దశరథుడి వద్దకు వెళ్లి తన యజ్ఞానికి రాక్షసుల నుంచి ఆటంకాలు కలుగుతున్నాయని, కాపాడేందుకు యువరాజు రాముడిని పంపమని అడుగుతాడు. దశరథుడు అంగీరకరించి విశ్వామిత్రుడితో పాటు రాముడు, లక్ష్మణులను పంపిస్తాడు. వీరిద్దరి సహాయంతో యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తిచేసుకున్న విశ్వామిత్రుడు యువరాజులతో కలిసి మిథాల నగరానికి వెళతాడు. అక్కడ మిథిలా రాజు కుమార్తె అయినా సీతాదేవి స్వయంవరం జరుగుతుంటుంది. శివ ధనస్సును ఎత్తిన వారికి సీతాదేవీతో కళ్యాణం జరిపిస్తానని మిథిల రాజు ప్రకటిస్తాడు. అయితే శివ ధనస్సు ఎత్తేందుకో ఎందరో రాజులు ప్రయత్నించినప్పటికీ ఎవరికీ విజయం దక్కదు. చివరికి రాముడిని ప్రయత్నించమని విశ్వామిత్రుడు అడుగుతాడు. శ్రీరాముడు విల్లును సునాయాసంగా ఎత్తడమే కాకుండా రెండుగా విరిచి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. జనక మహారాజు సంతోషించి సీతను రాముడకిచ్చి కళ్యాణం జరిపిస్తాడు.పురాణాల ప్రకారం సీతారాముల వివాహం మార్గశిర మాసం శుక్లపక్షం ఐదవ రోజున జరుగుతుంది. అప్పటి నుంచి ప్రతియేటా వారి వివాహం జరిగిన రోజును వివాహ పంచమిగా జరుపుకుంటారు.
వివాహ పంచమి రోజున పాటించాల్సిన ఆచారాలు:
- ఉదయాన్నే తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాసంతో రోజును ప్రారంభించాలి.
- శ్రీరాముడు సీతాదేవిల ప్రేమను గుర్తుచేసుకుంటూ వారి చిత్రపటాలను పసుపు, కాషాయ వస్త్రాలతో అలంకరించాలి. వారికి పువ్వులు, పండ్లు, పసుపు కుంకుమ, తీర్థం సమర్పించి భక్తితో వేడుకోవాలి.
- సీతారాముల కళ్యాణ వ్రత కథను దంపతులిద్దరూ కలిసి కూర్చుని వినాలి. మంత్రాలను బిగ్గరగా చదవాలి.
- స్తానిక ఆలయంలో రాముల వారి కళ్యాణ వేడుకను కనులారా తీక్షించి ఆశీర్వాదంగా ప్రసాదాన్ని స్వీకరించాలి.
- వివాహ పంచమి రోజున భార్యభర్తలు ఇద్దరూ కలిసి దాన ధర్మాలు చేసిన సుఖసంతోషాలు లభిస్తాయి. అనాథలకు, పేదవారికి ఆహారం, బట్టలు, ఆర్థిక సహాయం చేయడం మంచిది.
- కుటుంబంలో వివాహ కార్యక్రమాలు ఉన్నవారు వివామ పంచమి రోజున కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పెళ్లి శుభలేఖలను ఇవ్వడం శుభసూచకం.