Tuesday Remedies: హనుమంతుని అనుగ్రహంతో పాటు ధనరాశులు కురవాలంటే మంగళవారం ఈ పరిహారాలు తప్పక పాటించండి
Tuesday Remedies: ఆ పవన పుత్రుడ్ని ప్రత్యేకంగా ఆచరించే మంగళవారం ఈ విషయాలు గుర్తుంచుకోండి. విజయం సాధించడం కోసం, శ్రేయస్సు, ఆర్థిక సుస్థిరత దక్కాలంటే ఈ ఆచారాలను తప్పక పాటించాలని శాస్త్రం చెబుతుంది.
హైందవ పురాణాల ప్రకారం, సూర్య భగవానుడికి ఆదివారం, శివుడికి సోమవారం కేటాయించినట్లుగానే హనుమంతుడి ఆరాధన కోసం మంగళవారం ప్రత్యేకించారు. మతపరమైన నమ్మకాల ప్రకారం, హనుమంతుడు కలియుగంలో మానవత్వాన్ని కాపాడే దేవుడు. ఆయనకు మంగళవారం ప్రత్యేక ఆరాధన చేయడం వల్ల జీవితంలో ఎదుర్కొనే కఠినమైన సమస్యలు, ఒత్తిళ్లు తగ్గి శ్రేయస్సు, విజయం వరిస్తాయి. ఈ ప్రత్యేకమైన రోజున ఆయనను ఆరాధించడం అనేది కోర్కెలు తీర్చి, ఫలదాయకమైన జీవితాన్ని అందిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మంగళవారం చేసే ప్రయత్నాలు కచ్చితంగా విజయాన్ని తెచ్చిపెడతాయట. మీరు సంతోషాన్ని కోరుకున్నా లేదా శాంతిని, శ్రేయస్సును, విజయాన్ని ఏది కోరుకున్నా సరే! మీకు అవి సొంతమవుతాయి. మరి మీ కోర్కెలు తీరేలా, ఆంజనేయుని అనుగ్రహం కలిగేలా ఆరాధించాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.
మంగళవారం చేయవలసిన పరిహారాలు
1. కెరీర్‌లో నిలదొక్కుకోవడం కోసం
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటే, మంగళవారం హనుమాన్ స్వామిని ప్రార్థించి, అతనికి తాంబూలం అందించాలి. తమలపాకులను ఇష్టపడే ఆంజనేయుడి అనుగ్రహం కలిగి కెరీర్‌లో విజయం పొందేందుకు దోహదపడుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి, మంగళవారం పూజ చేయడం సంకల్పశక్తి, దృష్టి కేంద్రీకరణను పెంచుతుంది.
2. ఎర్ర మిరపకాయలు దానం
జ్యోతిషశాస్త్రం ప్రకారం, జాతకంలో కొన్ని స్థానాల్లో ఉన్న మంగళ గ్రహం “మంగళ దోషం” ఎదురవుతుంది. ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలకు దారితీస్తుంది. దీని ప్రభావాన్ని తగ్గించడానికి, మంగళవారం ఎర్ర మిరపకాయలు దానం చేయండి. ఈ పరిహారం మంగళ గ్రహ దోషాలను సమాంతర పరచి, జీవితంలో స్థిరత్వాన్ని తీసుకురావడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు.
3. శ్రీరామ సమేతంగా ఆరాధన
హనుమాన్ స్వామి అనుగ్రహాన్ని పొందాలంటే, మంగళవారం రాముడు, సీత, లక్ష్మణులతో కలిసి హనుమాన్‌ను పూజించండి. ప్రార్థన సమయంలో “రామ రక్షా స్తోత్రం” చదవండి. ఈ ఆచారం పాటించడం వల్ల జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమై, అన్ని ప్రయత్నాలలో విజయం అందుతుంది.
4. ఎర్ర రంగు ధరించి ఎర్ర వస్తువులు దానం చేయడం
మీకు ప్రత్యేక కోరికలు ఉంటే, మంగళవారం తలంటు స్నానం చేసి, ఎర్ర బట్టలు ధరించండి. హనుమాన్ స్వామిని ఎర్ర పువ్వులు, పండ్లతో పూజించండి. దేవుడికి సింధూరం సమర్పించి, అదే సింధూరాన్ని మీ నుదుటిపై ఉపయోగించండి. ఈ ఆచారం కోరికల నెరవేర్చడంతో పాటు శుభాలను కలుగు చేస్తుంది.
5. ఆర్థిక స్థిరత్వం కోసం
ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మంగళవారం 21 సార్లు “ఓం హ్రాం హనుమతే నమః అనే ఈ మంత్రాన్ని జపించండి. ఈ శక్తివంతమైన మంత్రం ఆర్థిక సమస్యలను పరిష్కరించి, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది.
చేయకూడని పనులు:
అప్పలు ఇవ్వడం లేదా తీసుకోవడం
వాస్తు శాస్త్రం ప్రకారం, మంగళవారం డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం ప్రతికూలంగా భావిస్తారు. దీని వల్ల ఆర్థిక అస్థిరత, నిరంతర ఆర్థిక సమస్యలు వస్తాయని నమ్ముతారు.
ఈ పరిహారాలను పాటించడమే కాకుండా చేయకూడని పనులను దృష్టిలో ఉంచుకోండి. మీరు మీ జీవితంలో సానుకూలత, శాంతి, విజయాన్ని పొందవచ్చు. మంగళవారాలను హనుమాన్ ఆరాధనకు కేటాయించి విశ్వాసం, భక్తి ద్వారా మీ జీవితంలో కలిగే మార్పును గమనించండి.