Jammi chettu: దసరా రోజు పూజించే జమ్మిచెట్టు ఆచారం కోసమే కాదు.. ఆరోగ్య ఔషధం కూడా
Jammi chettu: జమ్మిచెట్టును దసరా రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ఈ మొక్కతో ఆయుర్వేద పరంగా అనేక ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. అవేంటో తెల్సుకుందాం.
దసరా రోజు ఒకరికొకరు ఇచ్చుకునే శమీ వృక్షం లేదా జమ్మి చెట్టు ఆకులను బంగారం అంటారు. సాంప్రదాయక శమీ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. రాముడు లంకకు వెళ్లేముందు ఈ మొక్కను పూజించాడు. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లేముందు ఆయుదాలను ఈ చెట్టు మీద పెట్టి శమీ వృక్షాన్ని పూజిస్తారు. అది పూర్తయ్యాక వారి ఆయుధాలను తీసుకుని యుద్దంలో గెలుస్తారు. అందుకే ఈ చెట్టును విజయదశమి నాడు పూజిస్తే అపజయాలు కలగవని నమ్ముతారు.
అయితే ఆయుర్వేదం ప్రకారం ఈ చెట్టు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చెట్టు ఆకుల నుంచి కాండం దాకా ఈ చెట్టును ఆరోగ్యం కోసం ఎలా వాడతారో తెల్సుకుందాం.
ఆయుర్వేద ఉపయోగాలు:
ఆయుర్వేదంలో శమీ చెట్టు కాండం, ఆకులు, పువ్వులు ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. వాటిని వేరు వేరు సమస్యలకు ఎలా ఉపయోగించాలో తెల్సుకోండి.
1. గొంతు నొప్పి:
శమీ చెట్టు కాండంతో డికాక్షన్ చేసుకొని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుందట. పంటి నొప్పి సమస్య నుంచి కూడా ఉపశమనం ఉంటుంది. ఇది నోటి అల్సర్లనూ తగ్గిస్తుంది. అందుకోసం ఎండిన పొడి కూడా వాడొచ్చు. దాన్ని ఒక చెంచాడు తీసుకుని 2 కప్పుల నీటిలో బాగా మరిగిస్తే డికాక్షన్ సిద్దం అవుతుంది. అంతే కాక ఎండిన కాండాన్ని చూర్ణం చేసి అనేక అనారోగ్యాలకు మందులా వాడతారు.
2. ర్యాషెస్:
జమ్మిచెట్టు ఆకులను ముద్దలాగా చేసి చర్మం మీద రాసుకుంటే ర్యాషెస్ లాంటివి ఉంటే తగ్గిపోతాయి. దురద, మంట కూడా తగ్గుతాయి. అలాగే ఈ ఆకులను మరిగించిన నీటిని స్నానం తర్వాత సమస్య ఉన్న చోట తలలో, చర్మం మీద కూడా దురద లాంటివి ఉంటే తగ్గిపోతాయి.
3. అవాంఛిత రోమాలు:
మహిళల్లో అవాంఛిత రోమాల సమస్య ఇబ్బందికరంగా ఉంటుంది. గడ్డం దగ్గర, మీసాల దగ్గర, చాతీ మీద వెంట్రుకలు పెరుగుతాయి. అలాంటప్పుడు జమ్మిచెట్టు పండు లేదా కాయను నూరి క్రమం తప్పకుండా రాసుకుంటే సమస్య తగ్గిపోతుంది.
4. గాలి శుద్ధి:
ఈ చెట్టును సహజ ప్యూరిఫయర్ అనుకోవచ్చు. ఇది గాలిలో ఉండే హానికర కాలుష్య కారకాలను గ్రహించి గాలిని శుద్ధి చేస్తుంది. ఈ మొక్కను ఇంటి బాల్కనీలోనూ పెంచుకోవచ్చు.
ఇది సాంప్రదాయంగా పూజించే మొక్క. ఇంట్లోనూ ఇది సులువుగా పెరిగేస్తుంది. దీన్ని ఇంట్లో పెంచుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముందుగా ఎక్కువగా సూర్య రశ్మి సోకే చోట పెట్టండి. నల్లమట్టి ఉంటే మొక్క తొందరగా పెరుగుతుంది.
టాపిక్