Stella Ship Seized : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్- ఎట్టకేలకు పవన్ 'సీజ్ ది షిప్' ఆదేశాలు అమలు-kakinada port pds rice illegal transport stella l panama ship seized after pawan kalyan orders ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Stella Ship Seized : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్- ఎట్టకేలకు పవన్ 'సీజ్ ది షిప్' ఆదేశాలు అమలు

Stella Ship Seized : కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్- ఎట్టకేలకు పవన్ 'సీజ్ ది షిప్' ఆదేశాలు అమలు

Bandaru Satyaprasad HT Telugu
Dec 03, 2024 04:10 PM IST

Stella Ship Seized : రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ కాకినాడ పోర్టులో పట్టుబడిన స్టెల్లా షిప్ ను సీజ్ చేసినట్లు కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణకు ఐదుగురి సభ్యులతో కమిటీ వేశామన్నారు. షిప్ లో 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు.

 కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్- ఎట్టకేలకు పవన్ 'సీజ్ ది షిప్' ఆదేశాలు అమలు
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్- ఎట్టకేలకు పవన్ 'సీజ్ ది షిప్' ఆదేశాలు అమలు

ఏపీలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ "సీజ్ ది షిప్" ఆదేశాలు ఎట్టకేలకు అమలయ్యాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల కాకినాడ పోర్టులో పర్యటించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను గుట్టురట్టు చేశారు. భారీ షిప్ లో విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యంను రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్నారు. ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ విషయంపై కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్‌ స్పందించారు.

అధికారుల వైఫల్యం

కాకినాడ పోర్టులోని స్టెల్లా షిప్‌ను సీజ్ చేసినట్లు కలెక్టర్ షాన్‌మోహన్‌ తెలిపారు. ఈ అంశంపై విచారణకు ఐదు శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్‌, కస్టమ్స్‌ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో అధికారుల వైఫల్యం ఉందన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. గోడౌన్ల నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో దర్యాప్తులో తేలుస్తామన్నారు. ఈ షిప్ లో బియ్యం ఎవరు ఎగుమతి చేస్తున్నారు, బియ్యం ఎక్కడున్నాయో పరిశీలిస్తామన్నారు.

గోదాము నుంచి కాకినాడ పోర్టులోని షిప్‌ వరకు పీడీఎస్ బియ్యం ఎలా వచ్చాయి, ఎవరు రవాణా చేశారో విచారణ చేపట్టామని కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. షిప్ లోని బియ్యం మొత్తం పీడీఎస్ బియ్యమేనా? అనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో ఓ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. షిప్ లోని ప్రతి లోడ్‌ను పరిశీలించి బియ్యం ఎక్కడి నుంచి వచ్చాయో విచారిస్తామన్నారు. బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం అసలు ఆ షిప్‌లో ఉందో లేదో నిర్ధారిస్తామన్నారు.

"కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లే కార్గో షిప్ స్టెల్లా ఎల్ పనామాలో 38,000 మెట్రిక్ టన్నుల బియ్యంతో పట్టుబడింది. ఓడలో లోడ్ చేసిన 640 మెట్రిక్ టన్నుల బియ్యం పీడీఎస్ ద్వారా సరఫరా చేసినట్లు గుర్తించాము. ఓడలో లోడ్ చేయబడిన మొత్తం 38,000 మెట్రిక్ టన్నుల బియ్యం తనిఖీ చేసి ఏ బియ్యమో నిర్థారిస్తాము. ఇది మూడు రోజుల్లో పూర్తవుతుంది"- కలెక్టర్ షాన్ మోహన్

విదేశాలకు తరలిపోతున్న పేదల బియ్యం

కాకినాడ పోర్టు నుంచి భారీగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుంది. వీటి వెనుక బడా నేతలున్నారనే విమర్శలు లేకపోలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతలు బియ్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అక్రమ రవాణాలో కూటమి నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాకినాడ పోర్టు వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించిన విషయం తెలిసిందే. బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రేషన్‌ బియ్యం మాఫియాపై మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు సైతం చర్చించారు. వేల కోట్ల విలువైన రేషన్ బియ్యం విదేశాలకు తరలించడాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని మంత్రులు నిర్ణయించారు.

Whats_app_banner

సంబంధిత కథనం