Pawan Kalyan : కాకినాడలో అధికారులు స్మగ్లింగ్‌కు అండగా ఉంటున్నారు.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్-ap deputy cm pawan kalyan sensational comments on coastal policing ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Pawan Kalyan : కాకినాడలో అధికారులు స్మగ్లింగ్‌కు అండగా ఉంటున్నారు.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్

Pawan Kalyan : కాకినాడలో అధికారులు స్మగ్లింగ్‌కు అండగా ఉంటున్నారు.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్

Basani Shiva Kumar HT Telugu
Nov 29, 2024 03:23 PM IST

Pawan Kalyan : కోస్టల్ పోలీసింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ పోర్ట్ తీరంలో కోస్టల్ పోలీసింగ్ ఏది అంటూ ప్రశ్నించారు. కాకినాడ ఎమ్మెల్యే కొండబాబుకి పవన్ చురకలు అంటించారు. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎలా అంటూ నిలదీశారు. పోర్టులో పరిస్థితులపై అసహనం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ (@JanaSenaParty)

కాకినాడ పోర్ట్ నుంచి అక్రమ రవాణా చాలా తీవ్రమైన అంశం అని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇక్కడ ఎన్నో జాతీయ సంస్థలు, పెద్ద కంపెనీలు ఉన్నాయని చెప్పారు. అక్రమ రవాణా జరిగినట్లుగా, ప్రమాదకర శక్తులు వస్తే వాటి రక్షణకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీనిని తీవ్రంగా పరిగణించాలని అధికారులను అదేశించారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులు, ఎమ్మెల్యే తీరుపట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే స్మగ్లర్లకు ఈజ్ ఆఫ్ బిజినెస్ లా ఉండకూడదన్నారు. కాకినాడలో అధికారులు స్మగ్లింగ్‌కు అండగా ఉంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాగే ఎక్కడి నుంచో తీవ్రవాదులు వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. అసలు పోర్టు అథారిటీ సభ్యులు ఏం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

కాకినాడ పోర్ట్‌లో జరుగుతున్న అక్రమ రవాణా కార్యకలాపాలపై ప్రధాని మోదీ, రాష్ట్ర హోం మంత్రి అనితకు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాయాలని పవన్ నిర్ణయించారు. ఆ లేఖలను సిద్దం చేయాలని వ్యక్తిగత కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు.

'తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే.. దేశ భద్రతకు భంగం కలుగుతుంది. అక్రమ రవాణా చేస్తున్న బోట్ ఓనర్లు, దీనికి పాల్పడుతున్న వ్యక్తులు, వెనుక ఉన్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. దీనిని నడిపిస్తున్న కింగ్ పిన్‌లను గుర్తించాలి. పోర్టు నుండి అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు బయట నుండి రావని గ్యారెంటీ ఏంటి? కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం లేదా? దీనిపైన జిల్లా ఎస్పీ వెంటనే వివరణ ఇవ్వాలి' అని పవన్ స్పష్టం చేశారు.

బాధితులకు భరోసా..

పవన్ కళ్యాణ్ రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి కాకినాడ పోర్టుకు వెళ్తున్నారు. ఈ సమయంలో పిఠాపురంలో ధర్నా చేస్తున్న వారిని చూసి ఆగారు. సచివాలయం టౌన్ ప్లానింగ్ సెక్రెటరీ ఫాతిమాపై పవన్ కళ్యాణ్‌కి బాధితులు ఫిర్యాదు చేశారు. అగ్రహారానికి చెందిన ప్రభుత్వ పట్టా భూముల్లో కొందరు నివాసం ఉంటున్నారు. వారి నుంచి డబ్బులు వసూలు చేస్తోంది అంటూ ఫాతిమాకు వ్యతిరేకంగా బాధితులు ధర్నా చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ఇటుగా వస్తున్నారని సమాచారంతో.. రోడ్డుపై ఫ్లెక్సీ పట్టుకొని బాధితులు ప్రదర్శించారు. బాధితులను చూసి కాన్వాయ్‌ను ఆపిన పవన్ కళ్యాణ్.. వివరాలను అడిగి తెలుసుకున్నారు. న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు పిఠాపురం ఇంఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్‌కి ఇవ్వాలని సూచించారు డిప్యూటీ సీఎం.

Whats_app_banner