Lucky Baskhar OTT: ఓటీటీలో దూసుకెళ్తున్న లక్కీ భాస్కర్.. సర్‌ప్రైజ్ వీడియో వదిలిన దుల్కర్ సల్మాన్
Dulquer Salmaan on Lucky Baskhar OTT: లక్కీ భాస్కర్ మూవీ దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ ఈ మూవీ దుమ్ముదులిపేస్తోంది.
దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ మూవీ థియేటర్లలోనే కాదు.. ఓటీటీలోనూ దుమ్ముదులిపోస్తోంది. అక్టోబరు 31న థియేటర్లలోకి వచ్చిన లక్కీ భాస్కర్.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లుపైనే వసూళ్లు రాబట్టింది. గత వారం ఓటీటీలోకిరాగా.. ఓటీటీలోనూ లక్కీ భాస్కర్ సత్తాచాటుతోంది. నెట్‌ప్లిక్స్‌లో నవంబరు 28 నుంచి లక్కీ భాస్కర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఎమోషన్స్‌తో మెప్పించిన డైరెక్టర్
లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్‌కి జంటగా మీనాక్షి చౌదరి నటించగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. రిలీజైన రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న లక్కీ భాస్కర్.. మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌ని మెప్పించింది. మూవీ మొత్తం బ్యాంకింగ్స్, స్టాక్ మార్కెట్ అంశాల చుట్టూనే తిరిగినా.. అవి అందరికీ పూర్తిగా అర్థం కాకపోయినా.. దర్శకుడు వెంకీ అట్లూరి ఎమోషన్స్‌ని జోడించి ప్రేక్షకుల్ని మెప్పించగలిగాడు.
ఆ రెండు భాషల్లో చెప్పలేకపోయా
ఓటీటీలో లక్కీ భాస్కర్ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుండటంతో.. హీరో దుల్కర్ సల్మాన్ ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ‘‘థియేటర్లలో లక్కీ భాస్కర్ సినిమాని మిస్ అయిన వారు.. నెట్‌ఫ్లిక్స్‌లో చూడండి. మూవీ విడులైనప్పటి నుంచి ఎంతో మంది మెసేజ్‌లు చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో మూవీ అందుబాటులో ఉంది. ఇందులో తెలుగు, తమిళం, మలయాళం భాషలకి నేనే డబ్బింగ్ చెప్పాను. కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి సమయం సరిపోలేదు. నెక్ట్స్ సినిమాలో ఐదు భాషల్లోనూ డబ్బింగ్ చెప్పడానికి ప్రయత్నిస్తాను’’ అని దుల్కర్ సల్మాన్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ రికార్డ్
నెట్‌ప్లిక్స్‌లో లక్కీ భాస్కర్ మూవీ వచ్చిన రోజుల వ్యవధిలోనే గ్లోబల్ వైడ్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. 15 దేశాల్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో మూవీ అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఈ తరహాలో మూవీని ప్రేక్షకులు చూడటం.. సోషల్ మీడియాలో స్పందించడం ఇదే తొలిసారి. లక్కీ భాస్కర్ సినిమాలోని పదునైన డైలాగ్‌లు గత ఐదు రోజుల నుంచి జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.