Virat Kohli: ఆస్ట్రేలియాతో అడిలైడ్ టెస్టులో బ్రాడ్‌మన్, సచిన్ టెండూల్కర్ రికార్డులపై కన్నేసిన విరాట్ కోహ్లీ
IND vs AUS 2nd Test: పెర్త్ టెస్టులో సెంచరీతో ఫామ్ అందుకున్న విరాట్ కోహ్లీ.. అడిలైడ్ టెస్టులోనూ భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. డే/నైట్ టెస్టుల్లో ఇప్పటికే 297 పరుగులు చేసిన కోహ్లీ.. అడిలైడ్‌లో సెంచరీ సాధిస్తే.. రెండు అరుదైన రికార్డులు సొంతంకానున్నాయి.
ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరగనున్న డే/నైట్ టెస్టులో విరాట్ కోహ్లీ అరుదైన రికార్డ్‌లపై కన్నేశాడు. పెర్త్ వేదికగా ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన తొలి టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ బాదిన విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా డిసెంబరు 6 నుంచి భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.
ఆస్ట్రేలియాపై పెర్త్ టెస్టులో 295 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా.. ఐదు టెస్టుల బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో 1-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది. దాంతో ఇదే ఊపులో అడిలైడ్ టెస్టులోనూ గెలవాలని టీమిండియా ఆశిస్తుండగా.. చాలా రోజుల తర్వాత సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ కూడా అడిలైడ్ టెస్టులో శతకం బాదాలని ఉవ్విళ్లూరుతున్నాడు.
సచిన్ రికార్డ్‌కి ఒక్క సెంచరీ దూరంలో
సుదీర్ఘ టెస్టు కెరీర్‌లో ఇప్పటి వరకు 119 మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ.. 30 సెంచరీలు నమోదు చేశాడు. దాంతో అడిలైడ్ టెస్టులో శతకం బాదితే.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు నమోదు చేసిన బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలవనున్నాడు.
ఈ ట్రోఫీలో 9 సెంచరీలు బాదిన సచిన్ టెండూల్కర్ టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ కూడా 9 సెంచరీలతో సంయుక్తంగా సచిన్‌తో కలిసి నెం.1 స్థానంలో ఉన్నాడు. దాంతో ఒక్క సెంచరీ సాధిస్తే.. 10 శతకాలతో సచిన్ రికార్డ్ బ్రేక్‌కానుంది. ఈ రికార్డ్‌లో రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్ 8 శతకాల చొప్పున ఉండగా.. మైకేల్ క్లార్క్ 7 సెంచరీలతో టాప్-5లో ఉన్నారు.
బ్రాడమన్ రికార్డ్ ముంగిట
అడిలైడ్ టెస్టులో విరాట్ కోహ్లీ సెంచరీ సాధిస్తే.. దిగ్గజ క్రికెటర్ బ్రాడ్‌మన్ రికార్డ్ సమం అవుతుంది. ఒక అంతర్జాతీయ జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డ్‌లో ప్రస్తుతం బ్రాడ్‌మన్ 11 సెంచరీలతో టాప్‌లో ఉండగా.. విరాట్ కోహ్లీ 10 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై బ్రాడ్‌మన్ 11 సెంచరీలు నమోదు చేయగా.. ఆస్ట్రేలియాపై కోహ్లీ 10 సెంచరీలు చేశాడు. ఈ రికార్డ్‌లో సచిన్ టెండూల్కర్ 9 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. శ్రీలంకపై సచిన్ 9 సెంచరీలు నమోదు చేశాడు.
మ్యాచ్ టైమింగ్స్
భారత్, ఆస్ట్రేలియా మధ్య డిసెంబరు 6 నుంచి 10 వరకు అడిలైడ్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. డే/నైట్ టెస్టు కావడంతో.. భారత కాలమాన ప్రకారం మ్యాచ్ శుక్రవారం ఉదయం 9.30 గంటలకి ప్రారంభంకానుంది.