Telangana Tourism : కిన్నెరసాని ప్రకృతి అందాలు.. అందుబాటులోకి మరిన్ని సొబగులు
Telangana Tourism : కిన్నెరసాని.. తెలంగాణలో అద్భుత పర్యాటక కేంద్రం. కిన్నెరసాని ప్రకృతి అందాలను మాటల్లో వర్ణించలేం.. అక్షరాల్లో రాయలేం. ఇక్కడికెళ్లే అహ్లాదం, ఆనందం లభిస్తాయని పర్యాటకులు చెబుతారు. అలాంటి టూరిజం స్పాట్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది.
పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రదేశం కిన్నెరసాని. ఇక్కడికి వచ్చే టూరిస్టులను మరింత ఆకర్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ పర్యాటకులతో మాట్లాడి.. అభిప్రాయాలు సేకరించారు. అధికారులతో సమీక్షించి కార్యాచరణ ప్రారంభించారు. ప్రకృతి అందాలకు మరిన్ని సొబగులు జోడిస్తున్నారు.
కిన్నెరసాని ద్వీపంలో కాటేజీ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఇటీవలే హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ సంస్థ బృందం దీనిపై పరిశీలన జరిపింది. వెదురుతో కాటేజీ నిర్మించడానికి అవకాశం ఉన్నట్లు తేల్చింది. వీటిని నిర్మిస్తే పర్యాటకుల చిరకాల కోరిక నెరవేరినట్లే. ఆనంద ద్వీపం దగ్గరకు వెళ్లాలని పర్యాటకులు ఉత్సాహపడతారు. కాటేజీలు నిర్మిస్తే అక్కడి అందాలను వీక్షించడానికి మార్గం సుగమం అవుతుంది.
కిన్నెరసాని పర్యాటక కేంద్రం ప్రధాన ద్వారానికి కొత్త కళ తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. టోల్‌గేట్ సమీపంలో వెదురుతో రెండు వంతెనలు నిర్మించాలని ప్రతిపాదించారు. ఇది కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కిన్నెరసాని సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు అనువుగా కళా వేదిక నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించారు. వెదురు కళాకృతులతో వేదిక ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నారు.
కిన్నెరసాని పర్యాటక కేంద్రంలోని షెడ్‌ను క్యాంటీన్‌గా మార్చాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీని నిర్వహణ బాధ్యతలను మహిళలకు అప్పగించాలని భావిస్తున్నారు. ఇక్కడా వెదురుతో తయారు చేసిన బల్లలకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు. కిన్నెరసాని కాలువకు రెండుపక్కలా రెయిలింగ్ ఏర్పాటు చేయనున్నారు. పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా బల్లలను వేయనున్నారు. ఇక్కడ నీటి ప్రవాహంపై విహరించేందుకు నాటు పుట్టీలు ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు.
ఈ పనులు జరిగితే పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి వచ్చినట్టు అవుతుంది. తద్వారా టూరిస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కిన్నెరసానిపై ఫోకస్ పెట్టారు. ఇక్కడ పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరమైన నిధులు, అనుమతులు తొందరగా మంజూరు అయ్యేలా తొరవ చూపిస్తున్నారు.