Greater Karimnagar : గ్రేటర్ కరీంనగర్ దిశగా అడుగులు, కొత్తపల్లి మున్సిపాలిటీతో సహా ఆరు పంచాయతీల విలీనానికి ప్రతిపాదనలు
Greater Karimnagar : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్ గా మారనుంది. కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో ఆరు పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. విలీనానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ ను ఆదేశించారు.
Greater Karimnagar : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గ్రేటర్ కార్పొరేషన్ గా మారనున్నది. కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మరో ఆరు పంచాయతీలను కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అందుకు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 18 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారిన కరీంనగర్ నగర పాలక సంస్థ మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో అడుగు ముందుకు వేస్తుంది. మున్సిపల్ కార్పొరేషన్ ను గ్రేటర్ కరీంనగర్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తుంది. కరీంనగర్ సమీపంలోని కొత్తపల్లి మున్సిపాలిటీతోపాటు మరో ఆరు గ్రామాలను కార్పొరేషన్ పరిధిలో విలీనం చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా కలెక్టర్ కు సూచించారు.
దీంతో ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలోనే గ్రేటర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నగరానికి ఆనుకొని ఉన్న కొన్ని గ్రామాలను గతంలో మినహాయించడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన క్రమంలో మంత్రి పొన్నం ఈసారి వివాదాలకు తావు లేకుండా రెండు మండలాల నుంచి గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు కోరడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
కొత్తపల్లి మున్సిపాలిటీ, ఆరు గ్రామాలు
నాలుగున్నర ఏళ్ల క్రితమే కొత్తపల్లి మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. తాజాగా గ్రేటర్ కరీంనగర్ ప్రక్రియలో భాగంగా కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా విలీనం చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మండల పరిధిలోని చింతకుంట, లక్ష్మిపూర్, మల్కాపూర్ గ్రామాలు, కరీంనగర్ రూరల్ పరిధిలోని బొమ్మకల్, దుర్శేడు, గోపాల్ పూర్ గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన వెంటనే వాటికి ఆమోదం లభించడంతో గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ గా మారడం ఖాయమనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
పది కిలోమీటర్ల వరకు విస్తరిస్తున్న నగరం
2005లో మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ గా ఎదిగిన కరీంనగర్ నగరం గడిచిన రెండు దశాబ్దాల్లో శరవేగంగా విస్తరించింది. దీంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా నగరంతో సమానంగా కలిసిపోయాయి. మౌలిక వసతులు లేక నగరాన్ని అనుకొని ఉన్న గ్రామాలు సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండటంతో గత ప్రభుత్వం 2020లో పరిసర పరిధిలోని ఎనిమిది గ్రామాలను కార్పొరేషన్ లో విలీనం చేసింది. 3.50 లక్షల ఓటర్లు, సుమారు ఐదు లక్షల జనాభా కలిగి ఉన్న నగరంగా ఎదిగిన కరీంనగర్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్ సిటీ పథకం కింద ఎంపిక కావడంతో సుమారు వేయి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టడంతో మరింత ప్రగతి సాధించింది.
అయితే గతంలో జరిగిన విలీనం సమయంలో జరిగిన కొన్ని పొరపాట్లు, హైకోర్టు సూచనలు పరిగణనలోకి తీసుకొని పెండింగ్ లో పెట్టిన గ్రామాలను కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కు పలువురు కాంగ్రెస్ నేతలు విన్నవిస్తూ వచ్చారు. అన్ని అర్హతలు ఉన్నా కూడా విలీనం చేయకపోవడంతో కనీస మౌళిక వసతులకు దూరమవుతున్నామంటూ దృష్టికి తీసుకురాగా మంత్రి పొన్నం సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నగరానికి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలను కార్పొరేషన్ లో విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ను కోరారు.
మారనున్న డివిజన్ల సంఖ్య
2015లో 50 డివిజన్లు ఉండగా.. 2020లో పలు గ్రామాల విలీనం తర్వాత డివిజన్ల సంఖ్య 60కి పెరిగింది. తాజాగా ఒక మున్సిపాలిటీ, అరు గ్రామాలను కూడా విలీనం చేయడం ద్వారా. డివిజన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలో 10 వేల వరకు ఓటర్లు ఉండగా.. బొమ్మకల్ జనాభా 12 వేల వరకు ఓటర్లు ఉన్నారు. చింతకుంట పరిధిలో 8100 మంది ఓటర్లు, మల్కాపూర్, లక్ష్మిపూర్ పరిధిలో 4036 మంది ఓటర్లు, గోపాల్ పూర్ పరిధిలో 2633 మంది ఓటర్లు, దుర్శేడు పరిధిలో 3341 మంది ఓటర్లు ఉన్నారని తేలింది.
2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో 2.72 లక్షల మంది ఓటర్లు కార్పొరేషన్ పరిధిలో ఉండగా.. ఇటీవల జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగి 3.50 లక్షల వరకు చేరింది. తాజాగా మరో 30 వేల పైచిలుకు ఓటర్లు నగర పరిధిలో చేరనుండటంతో డివిజన్ల సంఖ్య .. డివిజన్ల వారీగా ఓటర్ల జాబితా కూడా మార్పులుచేర్పులు జరిగే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుత డివిజన్ల హద్దులు కూడా మారడం ఖాయమని తెలుస్తోంది. గతంలోనే డివిజన్ల స్వరూపంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈసారైనా అధికారులు నిక్కచ్చిగా వ్యవహరించకపోతే మరోమారు అభాసుపాలు కావడం ఖాయమని తెలుస్తోంది.
స్వాగతిస్తున్న నగర ప్రజలు
మున్సిపల్ కార్పొరేషన్ నుంచి గ్రేటర్ కరీంనగర్ గా మార్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయనే ప్రచారంతో నగర ప్రజలు స్వాగతిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాడు మంత్రిగా ఉన్న ఎమ్మెస్సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే మునిసిపాలిటీ నుంచి కరీంనగర్ కార్పొరేషన్ స్థాయికి ఎదిగిందని, నేడు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో తీసుకోవడంతో గ్రేటర్ కరీంనగర్ గా మారబోతుందని కాంగ్రెస్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో నగరంతో పూర్తిగా కలిసిపోయినా కూడా బొమ్మకల్ గ్రామాన్ని విలీనం నుంచి మినహాయించడం వల్ల తీవ్ర విమర్శలు వచ్చాయని, మల్కాపూర్, చింతకుంట, లక్ష్మిపూర్ ప్రజలు కూడా విలీనానికి సిద్ధంగా ఉన్నా గతంలోనే పెండింగ్ పెట్టారని అందుకే మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చి గ్రేటర్ కరీంనగర్ ను మరింత అభివృద్ధిపరచాలని తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నామని పలువురు కార్పొరేటర్ లు అభిప్రాయపడుతున్నారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామ పంచాయితీలను మున్సిపాలిటీని కరీంనగర్లో విలీనం చేయడం మంచిదే అంటున్నారు ప్రస్తుతం నగర పాలక సంస్థ పాలకవర్గం బిఆర్ఎస్ కు చెందిన నాయకులు. ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల విలీనం తర్వాత, ఆ ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక నిధులు ఇవ్వకపోవడంతో విలీన ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని అభిప్రాయపడుతున్నారు.
ప్రధానంగా తాగు నీరు సరఫరా, రోడ్లు, మురికి కాల్వల అభివృద్ధి, విద్యుత్ సౌకర్యం కల్పించక పోవడం తో విలీనం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతుందంటున్నారు. 1985 సంవత్సరంలో నగరంలో విలీనం అయిన రాంపూర్, రాంనగర్ ప్రాంతాల్లో ఇంకా సమగ్ర అభివృద్ధి జరగలేదని ప్రస్తావిస్తు అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరుతున్నారు.
రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం