New island in Pacific Ocean : అగ్నిపర్వతం కారణంగా పుట్టుకొచ్చిన కొత్త ద్వీపం!
New island in Southwest Pacific Ocean : నైరుతి పెసిఫిక్ సముద్రంలో అగ్నిపర్వతం బద్ధలైంది. ఈ క్రమంలో కొత్తగా ఓ ద్వీపం పుట్టుకొచ్చింది.
New island in Southwest Pacific Ocean : నైరుతి పెసిఫిక్ మహాసముద్రం లోపల ఉన్న అగ్నిపర్వతం బద్ధలు కావడంతో.. కొత్తగా ఓ ద్వీపం పుట్టుకొచ్చింది! న్యూజిలాండ్, టోంగా మధ్యలో ఉన్న పెసిఫిక్ సముద్రం లోపల అగ్నిపర్వతం ఎగసిపడటంతో.. ద్వీపం ఏర్పడిందని నాసా పేర్కొంది.
నాసా ప్రకారం.. అగ్నిపర్వతం బద్ధలైన 11 గంటల తర్వాత.. ఈ ద్వీపం ప్రాణం పోసుకుంది. కొత్తగా ఏర్పడిన ద్వీపం ఆకారం వేగంగా పెరిగింది. ఈ నెల 14న.. ఈ ద్వీపం 4,000 స్క్వేర్ మీటర్లు, సముద్ర మట్టానికి 33 అడుగుల ఎత్తులో ఉందని అంచనాగట్టారు. కానీ సెప్టెంబర్ 20 వచ్చేసరికి.. ఈ ద్వీపం 24వేల స్క్వేర్ మీటర్లకు పెరిగింది.
హుంగా టాంగా ద్వీపానికి ఈశాన్యంవైపు, మోఉంగవన్ ద్వీపానికి వాయువ్యాన ఈ కొత్త ద్వీపం కేంద్రీకృతమై ఉంది. హోమ్ రీఫ్ ద్వీపం కింద మూడు టెక్టానిక్ ప్లేట్లు పరస్పరం వేగంగా ఢీకొట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
అయితే.. ఈ ద్వీపాలు ఎక్కువ కాలం ఉండవని నాసా అభిప్రాయపడింది. నీటి అడుగున్న అగ్నిపర్వతాలు బద్ధలు కావడంతో ఏర్పడే ద్వీపాలు.. కొన్నేళ్లకు మునిగిపోతాయని అంటోంది.
కాగా.. ఇలా ద్వీపం ఏర్పడటం ఇదేమీ తొలిసారి కాదు! 1852, 1857లో ఇదే ప్రాంతంలో అగ్నిపర్వతాలు బద్ధలయ్యాయి. అప్పడు కూడా ద్వీపాలు పుట్టుకొచ్చాయి. అవి ఎక్కువ కాలం ఉండలేకపోయాయి.
చివరిసారిగా 2020లో లేట్ఇకి వాల్కెనో బద్ధలైన 12 రోజులకు ఓ ద్వీపం ఏర్పడింది. అది రెండు నెలల తర్వాత కొట్టుకుపోయింది. 1995లో ఇదే అగ్నిపర్వతం బద్ధలైన తర్వాత ఏర్పడిన ఓ ద్వీపం.. గరిష్ఠంగా 25ఏళ్లు ఉండగలిగింది!
సంబంధిత కథనం