TG Phone Tapping Case : కీలక మలుపు తిరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. హరీష్ రావుపై కేసు నమోదు
TG Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో మలుపు తిరిగింది. తాజాగా మాజీమంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ హరీష్ రావుపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ట్యాపింగ్ కేసు నమోదైంది. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గడగోని చక్రధర్ గౌడ్ హరీష్ రావు, మరికొంత మందిపై ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తాను ఆర్థిక సహాయం చేస్తున్నానని, ఈ నేపథ్యంలో హరీష్ రావు బెదిరింపులకు దిగారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదులో ఆరోపణలు..
సిద్దిపేటలో తన స్వచ్ఛంద కార్యక్రమాలకు ప్రజల మద్దతు లభించిందని చక్రధర్ గౌడ్ వివరించారు. ఇది హరీష్ రావుతో రాజకీయ పోటీని సృష్టించిందని వివరించారు. ఈ నేపథ్యంలో తనపై తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు. ఘటన్‌కేసర్, సీసీఎస్, ఇతర పోలీస్ స్టేషన్లలో తనపై తప్పుడు కేసులు పెట్టారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
తనకు హరీష్ రావు నుంచి బెదిరింపు సందేశాలు వచ్చాయని చక్రధర్ గౌడ్ వివరించారు. సిద్ధిపేటలో రాజకీయ కార్యకలాపాలను ఆపాలని హెచ్చరించినట్టు స్పష్టం చేశారు. అదే సమయంలో తన ఫోన్‌ను ట్యాప్ చేశారని ఫిర్యాదులో వివరించారు. ఆగస్టు 2023లో ఆపిల్ సంస్థ నుంచి వచ్చిన ఇమెయిల్‌ను ఫిర్యాదుకు జతపరిచారు. 2023 ఎన్నికల సమయంలో తన ఫోన్, తన భార్య ఫోన్, తన సహచరుల ఫోన్‌లను ట్యాప్ చేశారని ఆరోపించారు.
సిద్దిపేటలో ఎన్నికలప్పుడు ప్రచారం చేస్తున్న సమయంలో.. తనను, తన మద్దతుదారులను బెదిరించారని ఫిర్యాదులో చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదుపై పరిశీలించిన పోలీసులు.. డిసెంబరు 1, 2024న స్వీకరించారు. ఆ తర్వాత పంజాగుట్ట ఎస్‌హెచ్‌వో శోభన్ పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
120(బీ) ఐపీసీ – నేరపూరిత కుట్ర
386 ఐపీసీ – దోపిడీ
409 ఐపీసీ – నేరపూరిత విశ్వాస ఉల్లంఘన
506 ఐపీసీ – క్రిమినల్ బెదిరింపు
66 ఐటీ చట్టం – సమాచార సాంకేతిక నేరాల చట్టం కింద కేసులు నమోదు చేశారు.
ఫిర్యాదు నేపథ్యం..
తనపై వేధింపులు, అక్రమ నిఘాపై పలుమార్లు పోలీసులను ఆశ్రయించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని చక్రధర్ గౌడ్ గౌడ్ తన ఫిర్యాదులో వివరించారు. నిఘా కార్యకలాపాలు, అక్రమ కేసులు తన ప్రతిష్టను దిగజార్చేందుకు, తన రాజకీయ జీవితానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలేనని ఆయన అభిప్రాయపడ్డారు.