Duvvada Divvela Vs Janasena : టెక్కలిలో దువ్వాడ దివ్వెల వర్సెస్ జనసేన, సోషల్ మీడియా పోస్టులపై పరస్పర కేసులు
Duvvada Divvela Vs Janasena : టెక్కలిలో సోషల్ మీడియా వార్ పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిపై జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా దివ్వెల మాధురి జనసేన నేతలపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో తనపై అనుచిత పోస్టులు పెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Duvvada Divvela Vs Janasena :శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో మరోసారి పొలిటికల్ హీట్ రాజుకుంది. పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని వారం క్రితం వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిపై జనసేన ఇన్ ఛార్జ్ కణితి కిరణ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తాజాగా తనపై జనసేన నేతలు సోషల్ మీడియాలో అభ్యంతర వ్యాఖ్యలు చేశారని దివ్వెల మాధురి...పవన్ కల్యాణ్ సహా పలువురి జనసేన నేతలపై ఫిర్యాదు చేశారు.
దువ్వాడ శ్రీనివాస్ స్నేహితురాలు దివ్వెల మాధురి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సోషల్ మీడియాలో తనపై, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు అభ్యంతర వ్యాఖ్యలు చేశారని దివ్వెల మాధురి టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం టెక్కలి సీఐ శ్రీనివాస్‌కు ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాధురి డిమాండ్ చేశారు.
పవన్ ఎలా స్పందిస్తారో - మాధురి
ఆడవాళ్లపై అనుచిత పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం అసెంబ్లీ వేదిక చెప్పిందని దివ్వెల మాధురి తెలిపారు. అందుకే తనపై సోషల్ మీడియా వేదిక అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశానన్నారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎలా స్పందిస్తారో చూస్తామన్నారు. తనపై అనుచిత పోస్టులు పెట్టిన జనసేన నేతలపై చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నట్లు తెలిపారు. చాలా జుగుప్సాకరంగా జనసేన పేరిట పోస్టులు పెట్టారని మాధురి ఆరోపించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. గతంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించలేదన్నారు.
"సీఎం, డిప్యూటీ సీఎం, హోం మినిస్టర్.. సోషల్ మీడియా పోస్టుల మీద కంప్లైంట్ ఇవ్వండి యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పోలీసులు స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి"- దివ్వెల మాధురి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై పవన్ అనుచిత వ్యాఖ్యలు చేశారని టెక్కలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. తిరుమల వెళ్లినప్పుడు కూడా తనపై దారుణంగా పోస్టులు పెట్టారన్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారని సమాచారం. వైసీపీ హయాంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో దువ్వాడ శ్రీనివాస్ ను అరెస్టు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు...పవన్ కల్యాణ్, జనసేన నేతలపై అత్యంత దారుణంగా మాట్లాడారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
సంబంధిత కథనం