Siddipet Crime: సిద్దిపేటలో విశాఖ యువకుడి చోరీలు, హైదరాబాద్‌లో పీజీ చదువుతూ జల్సాల కోసం చోరీలు
Siddipet Crime: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు, సులభంగా డబ్బు సంపాదించడం కోసం బంగారం దొంగతనం చేయాలనీ నిర్ణయించుకున్నాడు. కస్టమర్ లా ఓ బంగారు దుకాణంలోకి ప్రవేశించి, చూస్తున్నట్లు నటించి బంగారు గొలుసులను ఎత్తుకొని పారిపోయాడు. చోరీకి పాల్పడిన నిందితున్ని సిద్దిపేట పోలీసులు పట్టుకున్నారు.
Siddipet Crime: ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన వేపంచ షణ్ముఖ రెడ్డి (24) పీజీ చదువుతూ హైదరాబాద్ లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు జల్సాలకు అలవాటు పడ్డాడు. జల్సాలు చేయడానికి డబ్బులు లేనందున బంగారం దొంగతనం చేసి ఇతరులకు అమ్మి ఎక్కువ డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు.
ఈ క్రమంలో షణ్ముఖ రెడ్డి ఈ నెల 18 న హైదరాబాద్ లో ఉన్న తన స్నేహితుడి వద్ద అవసరం ఉన్నదని ద్విచక్ర వాహనం తీసుకున్నాడు. అనంతరం హైదరాబాదులో బంగారం షాప్ లో దొంగతనం చేస్తే పట్టు పడతానని భావించి,అదే మోటార్ సైకిల్ మీద హైదరాబాద్ నుండి సిద్దిపేటకు వచ్చాడు.
షాప్‌లో చూస్తున్నట్లు నటించి …
సిద్దిపేట లాల్ కమాన్ సమీపంలో ఉన్న నయీం మియా బంగారం షాపులోకి కస్టమర్ లాగా వెళ్లి బరువు ఎక్కువ ఉన్న బంగారు చైన్లు చూపించమని అడిగాడు. అక్కడ షాపు నిర్వాహకులు ఐదు బంగారు చైన్లు ఉన్న ట్రే తీసుకొని వచ్చి అతడికి చూపిస్తున్నాడు. చైన్లు చూస్తున్నట్టు నటించిన షణ్ముఖ్ వారి కళ్ళు కప్పి ట్రే తో సహా మొత్తం బంగారు చైన్లు ఎత్తుకొని పారిపోయాడు.
అనంతరం మోటార్ సైకిల్ తీసుకుని హైదరాబాద్ వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో టోల్‌గేట్ వద్ద సిబ్బందిని చూసి పోలీసులు అనుకొని బైక్ ని అతివేగంగా నడిపి కింద పడిపోయాడు. దీంతో రక్తం కారుతుండగా గమనించిన టోల్‌గేట్ సిబ్బంది ప్రధమ చికిత్స చేసి పంపించారు. అదే బైక్ తో ప్రజ్ఞాపూర్ కు వచ్చి, బైక్ పార్క్ చేసి రక్తపు మరకలున్న షర్టు విప్పి బ్యాగులో పెట్టి.. తన బ్యాగులో ఉన్న మరొక షర్టును వేసుకున్నాడు. దొంగలించిన బంగారు గొలుసులు షర్టు జేబులో వేసుకుని బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్ళాడు.
కరీంనగర్ లో అమ్ముదామని…
హైదరాబాదులో బంగారం అమ్మితే పట్టుబడతానని గ్రహించి కరీంనగర్ లో అమ్ముదామని నిర్ణయించుకొని 21 వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరారు. అనంతరం ప్రజ్ఞాపూర్ కు వచ్చి పార్కింగ్ లో ఉన్న బైక్ ని తీసుకుని కరీంనగర్ వైపు వెళ్తున్నాడు. టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, మరియు సిబ్బంది రంగీలా దాబా చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అటువైపు వెళ్తున్న యువకుడు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించాడు.
వెంటనే పోలీసులు అప్రమత్తమై అతనిని వెంబడించి పట్టుకొని విచారించారు. పోలీసుల విచారణలో నిందితుడు ఐదు బంగారు చైన్లు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని వద్ద నుండి 8 తులాల 5 బంగారు చైన్లు, మోటార్ సైకిల్, దొంగతనానికి ఉపయోగించిన షర్ట్ ను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరిలించినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపాడు. ఈ కేసులో నిందితున్ని చాకచక్యంగా పట్టుకున్న టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, మరియు సిబ్బందిని పోలీస్ కమిషనర్ అనురాధ అభినందించారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి,హిందుస్తాన్ టైమ్స్)