Nargis Fakhri Sister: బాయ్‌ఫ్రెండ్‌ను సజీవంగా తగలబెట్టిన టాప్ హీరోయిన్ చెల్లి.. జీవిత ఖైదు తప్పదా?
Nargis Fakhri Sister: బాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన నర్గీస్ ఫఖ్రి చెల్లి అయిన ఆలియా ఫఖ్రి తన బాయ్‌ఫ్రెండ్ ను సజీవంగా తగలబెట్టిన ఆరోపణలను ఎదుర్కొంటోంది. అవే నిజమైతే ఆమెకు జీవిత ఖైదు తప్పేలా కనిపించడం లేదు.
Nargis Fakhri Sister: బాలీవుడ్ లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న నటి నర్గీస్ ఫఖ్రి. ఇప్పుడు తన చెల్లి ఆలియా కారణంగా ఆమె వార్తల్లో నిలుస్తోంది. ఆలియా తన మాజీ బాయ్‌ఫ్రెండ్ ను సజీవంగా తగలబెట్టడమే దీనికి కారణం. అమెరికాలోని న్యూయార్క్ లో గత నెలలో ఈ ఘటన జరిగింది. ఓ గ్యారేజీకి ఆమె కావాలనే నిప్పు పెట్టడంతో ఆలియా మాజీ బాయ్‌ఫ్రెండ్ ఎడ్వర్డ్ జాకబ్స్, మరొకరు అనస్తేషియా ఎటీన్ చనిపోయారు.
నెల రోజుల కిందటే..
నర్గీస్ ఫఖ్రి చెల్లి అయిన ఆలియా ఫఖ్రి గత నెల 2వ తేదీనే ఈ ఘాతుకానికి పాల్పడింది. ఘటన జరిగిన సమయంలో జాకబ్స్ నిద్రలో ఉండటంతో ఆ మంటల్లో నుంచి తప్పించుకోలేకపోయాడు. మీరందరూ ఇవాళ చనిపోతారంటూ ఆలియా ఆ గ్యారేజీకి నిప్పంటించినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. నిప్పంటిన సమయంలో జాకబ్స్ స్నేహితురాలు ఎటీన్ బయటకు వచ్చి చూసి తిరిగి వెళ్లి అతన్ని కాపాడటానికి ప్రయత్నించినా.. ఇద్దరూ మృత్యువాత పడ్డారు.
ఆలియా ఫఖ్రీకి జీవిత ఖైదు?
ఈ జంట హత్యలకు పాల్పడిన ఆలియా ఫఖ్రి ఇప్పుడు జీవిత ఖైదు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. ఆమె హత్య, కావాలని నిప్పు పెట్టిందన్న అభియోగాలు నమోదు చేశారు. ఒకవేళ ఈ ఆరోపణలు నిజమైతే ఆమెకు జీవిత ఖైదు తప్పేలా లేదు. అయితే ఆలియా ఇలా ఒకరిని హత్య చేసే వ్యక్తి కాదని, ఇప్పటి వరకూ అందరికీ సాయం చేసిందని ఆమె తల్లి చెబుతోంది. ఆలియా కొన్నాళ్లుగా డ్రగ్స్ కు బానిసైందని, వాటి వల్లే ఆమె ఇలా చేసి ఉంటుందని ఆమె అభిప్రాయపడింది.
20 ఏళ్లుగా మాటల్లేవ్..
అయితే తన చెల్లి ఆలియాతో నర్గీస్ కు 20 ఏళ్లుగా మాటలు లేవని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో నర్గీస్ చెప్పేదేమీ లేదని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఇండియా టుడే రిపోర్టు తెలిపింది. రెండు దశాబ్దాలుగా అసలు ఆలియాతో నర్గీస్ కాంటాక్ట్ లో లేదని కూడా ఆ వర్గాలు తెలిపాయి. మీడియాలో వార్తల ద్వారానే తన చెల్లి ఇలాంటి దుర్మార్గానికి పాల్పడిన విషయాన్ని నర్గీస్ తెలుసుకుందట.
ఈ ఘటనపై నర్గీస్ ఇప్పటి వరకూ స్పందించలేదు. ఇప్పటి వరకూ నర్గీస్, ఆలియా తల్లి మాత్రమే దీనిపై మాట్లాడింది. "ఆమె ఓ మనిషిని చంపుతుందని నేను అనుకోవడం లేదు. ప్రతి ఒక్కరి కోసం ఆలోచించే వ్యక్తి ఆమె. అందరికీ సాయం చేసిన వ్యక్తి" అని ఆలియా తల్లి చెప్పింది. ప్రస్తుతం ఆలియాున న్యూయార్క్ సిటీలోని రైకర్స్ ఐలాండ్ లో నిర్బంధించారు. తాను ఈ హత్యలు చేయలేదని ఆలియా వాదిస్తోంది.