Harish Rao : మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు లక్ష కేసులు పెట్టించినా.. తగ్గేదే లేదు : హరీష్ రావు
Harish Rao : బీఆర్ఎస్ ముఖ్యనేత హరీష్ రావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ కేసుపై ఆయన స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే ఓర్చుకోలేక సీఎం రేవంత్ తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటానని హరీష్ రావు స్పష్టం చేశారు.
సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ట్యాపింగ్ కేసు నమోదైంది. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గడగోని చక్రధర్ గౌడ్ హరీష్ రావు, మరికొంత మందిపై ఫిర్యాదు చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తాను ఆర్థిక సహాయం చేస్తున్నానని, ఈ నేపథ్యంలో హరీష్ రావు బెదిరింపులకు దిగారని చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై హరీష్ ఘాటుగా స్పందించారు.
'మిస్టర్ రేవంత్ రెడ్డి.. అడుగడుగునా నువ్వు చేస్తున్న అన్యాయాలను నిలదీస్తున్నందుకు, నీ నిజ్వస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నీమీద ప్రశ్నలు సంధిస్తున్నందుకు భరించలేక, సహించలేక నామీద అక్రమ కేసులెన్నో బనాయిస్తున్నావు. నీకు చేతనైంది ఒక్కటే.. తప్పు చేసి దబాయించడం, తప్పుడు కేసులు బనాయించడం' అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
'రుణమాఫీ విషయంలో దేవుళ్లను సైతం దగా చేసినవు అని అన్నందుకు యాదగిరి గుట్ట పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవు. ఇచ్చిన హామీలను ఎగవేస్తున్న నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అని అన్నందుకు బేగంబజార్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు కేసు పెట్టించినవు. సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు సైబర్ క్రైం పోలీసు స్టేషన్‌లో నా మీద సంబంధం లేని కేసు పెట్టించినవు' అని మాజీమంత్రి ట్వీట్ చేశారు.
'పార్టీ కార్యక్రమంలో మాట్లాడితే కోడిగుడ్డుమీద ఈకలు పీకి, తలాతోక లేని కేసొకటి మానకొండూరులో అక్రమ కేసు పెట్టించినవు. నీ రెండు నాల్కల వైఖరిని బట్టబయలు చేసినందుకు, ప్రజాక్షేత్రంలో నిలదీసినందుకు తట్టుకోలేక ఇవాళ పంజాగుట్ట స్టేషన్ లో మరో తప్పుడు కేసు పెట్టించినవు. నువ్వు లక్ష తప్పుడు కేసులు పెట్టించినా, నేను ప్రజల పక్షాన ప్రశ్నించడం ఆపను. ప్రజా కోర్టులో, ప్రజా తీర్పుతో నీకు తగిన శిక్ష పడేంత వరకు ఆగను' అని హరీష్ స్పష్టం చేశారు.
హరీష్‌పై కేసుల వివరాలు..
120(బీ) ఐపీసీ – నేరపూరిత కుట్ర
386 ఐపీసీ – దోపిడీ
409 ఐపీసీ – నేరపూరిత విశ్వాస ఉల్లంఘన
506 ఐపీసీ – క్రిమినల్ బెదిరింపు
66 ఐటీ చట్టం – సమాచార సాంకేతిక నేరాల చట్టం