కాబోయే జీవిత భాగస్వామి గత రిలేషన్ల గురించి అడాలనుకుంటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మొదటికే మోసం వస్తుంది!
Relationship: పెళ్లికి ముందు కాబోయే జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవాలని అమ్మాయి, అబ్బాయి అనుకుంటారు. ముఖ్యంగా గతంలో ఏవైనా రిలేషన్స్ ఉన్నాయా అని తెలుసుకునేందుకు కొందరు ఆరాటపడతారు. అడిగితే ఏం జరుగుతుందో అని కంగారు పడతారు. ఆ విషయం గురించి అడగాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి.
పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి, అబ్బాయిల్లో చాలా సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా పెద్దలు కుర్చిన పెళ్లి అయితే ఒకరికొకరు పెద్దగా తెలిసి ఉండదు. కాబట్టి కాబోయే జీవిత భాగస్వామి గురించి కొన్ని డౌట్లు ఉంటాయి. ముఖ్యంగా గత రిలేషన్ల గురించి తెలుసుకోవాలని కొందరు అనుకుంటూ ఉంటారు. ఈ విషయంలో ఆరాటపడుతూ ఉంటారు. గత రిలేషన్ల గురించి కొందరు అడిగేస్తుంటారు. అయితే, ఇలాంటి సున్నితమైన విషయాలను అడగకపోవడమే మంచిది. ఒకవేళ అడగాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే వివాహం జరగడమే ప్రమాదంలో పడొచ్చు. అందుకే పెళ్లికి ముందు గత బంధాల గురించి అడగాలని నిర్ణయించుకుంటే అమ్మాయిలు, అబ్బాయిలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.
ఎందుకు అడుగుతున్నది నిజాయితీగా చెప్పాలి
అబ్బాయి అయినా, అమ్మాయి అయినా.. కాబోయే భాగస్వామి గతం గురించి మీరు అడిగే ముందే పూర్తిగా క్లారిటీ ఇవ్వాలి. అసలు ఎందుకు గత రిలేషన్ల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారనే విషయాన్ని నిజాయితీతో చెప్పాలి. కాబోయే జీవిత భాగస్వామి.. అభద్రతా భావంగా ఫీలయ్యేలా అసలు చేయకూడదు. పూర్తిగా అర్థం చేసుకునేందుకే ఈ విషయాలను అడుగుతున్నాననేలా రిక్వెస్టింగ్‍గా అడగాలి. అభ్యంతరం లేకుంటేనే ఈ విషయంపై మాట్లాడదామనేలా చెప్పాలి.
సరైన టైమ్, ప్లేస్
ఇలాంటి సున్నితమైన అంశాలు మాట్లాడేందుకు సరైన టైమ్, ప్లేస్ ఎంపిక చేసుకోవాలి. ప్రశాంతమైన సమయంలో అడగాలి. ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి విషయాలు సగంసగం తెలుసుంటే ఇంకా ప్రమాదం. ఇద్దరూ మంచి మాటల్లో ఉన్నప్పుడు గత రిలేషన్ల గురించి అర్థం చేసుకునేలా అడగొచ్చు.
నమ్మకం, గౌరవం ముఖ్యం
గత రిలేషన్ల గురించి చెప్పినా తాము ఇలాగే ముందుకు సాగుతామనే నమ్మకాన్ని కాబోయే భాగస్వామికి ఇవ్వాలి. ఇలాంటివి మాట్లాడే సమయంలో గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం. నెగెటివ్ మాటలు వద్దు. వారు చెప్పే విషయాన్ని బట్టి జడ్జ్ చేయవద్దు.
స్పష్టంగా వినండి
ఒకవేళ మీకు కాబోయే భాగస్వామి వారి గత రిలేషన్ గురించి చెప్పాలనుకుంటే మీరు స్పష్టంగా వినాలి. మాట్లాడే సమయంలో మధ్యలో ఆటంకపరచకూడదు. మొత్తం వింటే అర్థం చేసుకునేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది విన్నాక అర్థం చేసుకున్నానని అనాలి. ఇలాంటి విషయాన్ని పంచుకున్నందుకు అభినందించాలి.
హద్దులను గౌరవించాలి
ఒకవేళ గత రిలేషన్‍కు సంబంధించి ఏదైనా విషయం చెప్పకూడదని అనుకుంటే.. తప్పకుండా ఆ హద్దులను గౌరవించాలి. ప్రతీ విషయాన్ని గుచ్చిగుచ్చి అడగకూడదు. అనుమానించినట్టు ఏ మాత్రం అనిపించకూడదు. అలా అనిపిస్తే పెళ్లి ప్రమాదంలో పడి మొదటికే మోసం రావొచ్చు. అందుకే ఇలాంటి సున్నితమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. గౌరవం ఎప్పటికీ తప్పకూడదు.
మీ రిలేషన్‍ను చెప్పండి
జీవిత భాగస్వామి గత బంధాల గురించి తెలుసుకోవాలని అనుకుంటే.. ఒకవేళ మీకు ఏమైనా ఉంటే పంచుకోండి. మీరు చెబితే.. వారు కూడా మనసు విప్పే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి విషయాలను పంచుకున్న తర్వాత ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మద్దతుగా నిలవాలి. గత బంధాల ఆధారంగా ఓ నిర్ణయానికి రాకూడదు. భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలో చర్చించుకోవాలి.
సంబంధిత కథనం
టాపిక్