OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వస్తున్న మరో థ్రిల్లర్ మూవీ.. అదిరిపోయిన ట్రైలర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
OTT Thriller Movie: ఓటీటీలోకి మరో థ్రిల్లర్ మూవీ నేరుగా వచ్చేస్తోంది. ఇండియాలోనే అతిపెద్దదైన, దేశాన్ని కుదిపేసిన 2జీ స్కామ్ కేసును ఛేదించే జర్నలిస్టు చుట్టూ తిరిగే ఈ మూవీ ట్రైలర్ ను మంగళవారం (డిసెంబర్ 3) రిలీజ్ చేశారు.
OTT Thriller Movie: థ్రిల్లర్ సినిమాలకు ఓటీటీ కేరాఫ్. థియేటర్లలో కాకుండా నేరుగా చాలా థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ ఓటీటీలోకి వస్తుంటాయి. ఇప్పుడు డిస్పాచ్ (Despatch) పేరుతో మరో థ్రిల్లర్ మూవీ కూడా రాబోతోంది. బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయీ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాను ఈ మధ్యే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శించగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు.
డిస్పాచ్ ఓటీటీ రిలీజ్ డేట్
డిస్పాచ్ మూవీ డిసెంబర్ 13 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇండియాలో అతిపెద్ద స్కామ్ ను వెలికితీసి ప్రింట్ జర్నలిజాన్ని బతికించాలని చూసే ఓ సాహసోపేత జర్నలిస్టు చుట్టూ తిరిగే కథతో వస్తున్న సినిమా ఇది. డిస్పాచ్ ట్రైలర్ ను మంగళవారం (డిసెంబర్ 3) రిలీజ్ చేశారు.
ఊహించినట్లే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలోని థ్రిల్ ను ఈ మూవీ ప్రేక్షకులకు అందించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. జీ5 ఓటీటీ ఈ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయీ ఆ జర్నలిస్టుగా కనిపించనున్నాడు.
డిస్పాచ్ ట్రైలర్ ఎలా ఉందంటే?
డిస్పాచ్ మూవీ ఇండియాలోనే అతిపెద్దదైన జీడీఆర్ 2జీ స్కామ్ ను వెలికి తీసే జర్నలిస్టు చుట్టూ తిరిగే కథగా రూపొందింది. డిస్పాచ్ అనే పత్రికలో మనోజ్ ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పని చేస్తుంటాడు. ఓ హత్య, చోరీకి సంబంధించి అతడు ఆరా తీసే ఫోన్ కాల్ తోనే ట్రైలర్ ప్రారంభించారు. ఆ తర్వాత రూ.8 వేల కోట్ల విలువైన స్కామ్ ను వెలికి తీసే పనిలో ఆ జర్నలిస్టు ఉంటాడు. ఈ క్రమంలో అతనికి ఎన్నో బెదిరింపులు ఎదురవుతాయి. వాటిని తట్టుకొని అతడు ఆ స్కామ్ ను వెలికి తీస్తాడా లేదా అన్నదే డిస్పాచ్ మూవీ కథ.
2004 నుంచి 2014 మధ్య దేశంలో ఉన్న యూపీఏ సర్కారు హయాంలో వెలుగులోకి వచ్చిన 2జీ స్కామ్ దేశాన్ని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. కొందరు టెలికాం ఆపరేటర్లకే 2జీ స్పెక్ట్రమ్ ను కట్టబెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఎంతో మంది రాజకీయ ప్రముఖులు కూడా జైళ్లకు వెళ్లారు. అలాంటి స్కామ్ పై ఇప్పుడు డిస్పాచ్ పేరుతో మూవీ వస్తుండటం ఆసక్తి రేపుతోంది.
అలా సిద్ధమయ్యాను: మనోజ్
డిస్పాచ్ మూవీలో ఆ జర్నలిస్టు పాత్ర కోసం తాను ఎలా సిద్ధమయ్యానో మనోజ్ బాజ్‌పాయీ వివరించాడు. "ముంబై, ఢిల్లీల్లోని ఎంతోమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు నాకు చాలా మంచి స్నేహితులుగా ఉన్నారు. వాళ్లు చేసే పని ఎలాంటిదో తెలుసుకోవడానికి నేను ఎన్నో ఏళ్లుగా వాళ్లను కలుస్తున్నాను.
రోజువారీ జీవితంలో వాళ్లు పడే సంఘర్షణను కూడా నేను చూశాను" అని మనోజ్ చెప్పాడు. ఈ మూవీ షూటింగ్ సమయంలోనే మనోజ్ తన మోకాలికి గాయం చేసుకున్నాడు. ఇప్పటికీ దాని నుంచి అతడు పూర్తిగా కోలుకోలేదు. ఈ డిస్పాచ్ మూవీ జీ5 ఓటీటీలో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.