Sri rama navami 2024: ఒంటిమిట్ట ఆలయం విశిష్టత ఏంటి? ఇక్కడ జరిగే సీతారాముల కళ్యాణం ప్రాధాన్యత ఏంటి?
Sri rama navami 2024: శ్రీరామనవమి వేడుకలు ఒంటిమిట్టలో చాలా కన్నుల పండుగగా జరుగుతాయి. వెండి వెలుగులో సీతారాముల వారి కళ్యాణం ఎందుకు చేస్తారనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Sri rama navami 2024: త్రేతాయుగంలో శ్రీమహా విష్ణువు మానవరూపంలో ఈ భూమండలంపై అవతరించిన అవతారం రామావతారం. ఈ రామావతారం ధర్మానికి, న్యాయానికి ప్రతీక. మానవుడు తన జీవితములో ఎలా నడచుకోవాలో చెప్పేటటువంటిది శ్రీరామచరిత్ర అని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రీరాముడి ప్రసిద్ధ ఆలయాలు
అఖండ భారతదేశంలో రాములవారికి ఆలయము లేని గ్రామము ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ప్రతీ ఊరులో రామాలయం ఉండటం శ్రీరాముని ఖ్యాతికి నిదర్శశనము అని చిలకమర్తి తెలిపారు. ఎన్ని రామాలయాలు ఉన్నప్పటికీ రాములవారికి సంబంధించినటువంటి కొన్ని క్షేత్రాలు అత్యంత పవిత్రమైనవని చిలకమర్తి తెలిపారు. అలాంటి పవిత్ర క్షేత్రాలలో అయోధ్యలోని రామమందిరము, తమిళనాడులోని రామేశ్వరం, మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్ రామక్షేత్రము, మహారాష్ట్రలోని నాసిక్ (పర్ణశాల క్షేత్రము) అలాగే కర్ణాటకలోని పంబానది ఒడ్డున హంపి క్షేత్రం ఉంది.
తెలంగాణాలో భద్రాచలం, పర్ణశాల క్షేతము ఎంతటి ప్రాధాన్యత ఉన్నవో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట క్షేత్రము కూడా రాములవారికి సంబంధించినటువంటి క్షేత్రాలలో విశిష్టత కలిగినటువంటి క్షేత్రమని చిలకమర్తి తెలిపారు.
ఒంటిమిట్ట విశిష్టత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాకు 22 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం కలదు. ఇది తపోధనులకు, యజ్ఞ యాగాదులకు త్రేతాయుగంలో ప్రసిద్ధి పొందిన భూమి. ఇక్కడి దైవం కోదండరాముడు. విశాల ప్రాంగణంలో మూడువైపులా ఎత్తైనగోపురాలతో అత్యంత సుందరంగా కనిపిస్తుంది.
ఆలయ గాలిగోపురం నుంచి లోపలికి ప్రవేశించగానే విశాల ప్రాంగణం, 32 స్తంభాల మండపం మనకు దర్శనమిస్తాయి. ఈ ఆలయంలోని గోపురంపైనున్న శిల్పాలు, మండపంలోని స్తంభాలు అన్నీ చోళుల శిల్పకళావైభవాన్ని గుర్తుకు తెస్తాయి. మంటపంలోని స్తంభాలపై రామాయణ, మహాభారతకథలు చెక్కబడి ఉన్నాయని చిలకమర్తి తెలిపారు.
సీతారామకల్యాణం జరిగిన తర్వాత శృంగి, మృకండు మహర్షుల ప్రార్ధనమేరకు దుష్టశిక్షణ, శిష్టరక్షణకై, యజ్ఞ యాగాదిసంరక్షణకై శ్రీరామచంద్రుడు పిడిబాకు, అమ్ములపాది, కోదండమును ధరించి ఈ ప్రాంతానికి వచ్చినట్లు కథనం. ఆ తరువాత ఒకేరాతిపై సీతాలక్ష్మణ సహితంగా శ్రీరాముని విగ్రహాన్ని మహర్షులు చెక్కించారేగాని ప్రతిష్టించినట్లుగా కనబడదు. జాంబవంతుడు ఈ ప్రాంతాన్ని దర్శించినపుడు ఆయన కలలో ఆ విగ్రహం కనిపించగా, అతడు దానిని అన్వేషించి ఇక్కడ ప్రతిష్టించినట్లు ఐతిహ్యం. అందువల్ల దీనికి జాంబవంత ప్రతిష్ట అనే పేరొచ్చిందని చిలకమర్తి తెలిపారు.
సీతారామలక్ష్మణ విగ్రహాలు ఏకశిలలో ఉన్నందువల్ల దీనికి ఏకశిలానగరమనే పేరు వచ్చి ఉండవచ్చు. అదే కాల క్రమేణ ఒంటిమిట్ట అనుపేరుగా ప్రసిద్ధిచెందిన అద్భుతమైన పుణ్య స్థలి. సీతాదేవి దాహం తీర్చటానికి ఇక్కడ రామలక్ష్మణులు శరసంధానం చేసి పాతాళగంగను పైకి తెచ్చారట. ఆ బాణపు దెబ్బవల్ల ఏర్పడిన బావులను రామతీర్థం, లక్ష్మణ తీర్ధంగా నేటికి వ్యవహరిస్తారనిచిలకమర్తి తెలిపారు.
ఇక్కడ ఆలయంలో సీతారాములతో ఆంజనేయుడు దర్శనమివ్వడు. దేవాలయ ముఖద్వారానికి ఎదురుగుండా సంజీవరాయస్వామి భక్తులను కరుణిస్తాడు. ఆంధ్రావాల్మీకిగా ప్రసిద్ధిపొందిన వావిలికొలను సుబ్బారావుగారు ఈ ఆలయ నిర్మాణానికి అవిరళ కృషిచేయడమేకాక టెంకాయచిప్ప చేత పట్టి భిక్షాటన చేసి వచ్చిన సొమ్ముతో స్వామికి ఆభరణాలు కూడా ఏర్పరచారు.
ఒకసారి ఇమాంబేగ్ అను ముస్లిం అధికారి ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ స్వామి పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడట. అప్పుడు వారు చిత్తశుద్ధితో పిలిస్తే తప్పక పలుకుతాడనగా ఆయన ఆ రామచంద్రుని మూడుసార్లు పిలువగా “ఓయ్” అని పలికిన శబ్దం వినిపించిందట. దాంతో ఆయన స్వామిభక్తునిగా మారిపోయాడు. అక్కడి ప్రజల నీటి అవసరాలను తీర్చటానికి ఒకబావిని త్రవ్వించాడు. అదే నేటికి ఇమాంగ్‌బేగ్ బావి పేరుతో ప్రసిద్ధి పొందింది. ఆయనేకాక ఓబన్న స్వామి కృపకు పాత్రుడైనాడు. ఆయన పేర ఓబన్నస్తంభం అని నిర్మించబడింది. అక్కడి బోయరాజులయిన ఒంటడు మిట్టడు అనేవారు అక్కడి రామతీర్ధ నీటితో బాటసారుల దప్పిక తీర్చేవారు. శిథిలమైన ఆ గుడిని కంపరాయల సహాయంతో వారు పునరుద్ధరించారు. ఒంటిమిట్ట ఆలయంతో ఇలా ఎన్నో కథలు ముడిపడిఉన్నాయని చిలకమర్తి తెలిపారు.
వెండి వెన్నెల వెలుగులో సీతారాముల కళ్యాణం
భద్రాచలంలో శ్రీరామ నవమిఉత్సవాలు వైభవంగా జరిగేవి. అక్కడ చైత్ర శుద్ధ నవమి నాడు సీతారాముల కల్యాణం వైభవోపేతంగా జరిగేది. కాని ఇప్పుడు ఆంధ్రదేశంలోని ఒంటిమిట్టలో రామనవమి ఉత్సవాలు జరుపుతున్నారు. నవ్యాంధ్ర ఏర్పడిన తరువాత ఈ ప్రాంతం ఆంధ్ర భద్రాచలంగా పేరుపొందింది. 16వ శతాబ్దిలో ఈ ఆలయాన్ని దర్శించిన ఫ్రెంచి యాత్రికుడు భారతదేశంలోని పెద్దగోపురాలలో రామాలయగోపురం ఒకటి అన్నారు.
ఇక్కడ చైత్రశుద్ధ నవమి నుండి చైత్ర బహుళ విదియ దాకా తొమ్మిదిరోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కోదండరాముని కల్యాణం కన్నుల పండువగా జరుపుతారు. ఇక్కడైతే నవమి రోజున కాకుండా చైత్రపున్నమి వెలుగులలో ఈ కళ్యాణం జరుగుతుంది. పెళ్లికి ముందు సకలగుణ సంపన్నుడైన శ్రీరాముడిని, లోకోత్తర సౌందర్యవతి సీతమ్మను అందంగా అలంకరించి ఎదురుకోలుకు సన్నాహం చేస్తారు.
తూర్పు పడమరలలో అలంకరించిన పల్లకీలలో ఎదురెదురు మండపాలలో సీతారాములను కొలువు దీర్చి ఈ ఎదురుకోలు ఉత్సవాన్ని జరపడం ఇక్కడి ఆనవాయితీ. ఆ తరువాత ఆలయానికి సమీపాన ఉన్న మిథిలా ఆవరణంలో పున్నమి వెన్నెల వెలుగులలో అంగరంగ వైభవంగా కల్యాణం జరుపుతారు. ఇలా రాత్రిపూట కల్యాణం జరపటానికి పురాణాల్లో ఒక కథ ఉన్నది.
ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం కథ
విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల కల్యాణాన్ని సాగరుడు పగటి పూట నిర్వహించాడు. అప్పుడు లక్ష్మీదేవి సోదరుడు చంద్రుడు సోదరి కల్యాణాన్ని తాను చూడలేకపోతున్నానన్న బాధను మహా విష్ణువుతో పంచుకున్నాడు. అప్పుడు విష్ణువు నీ కోరిక త్రేతాయుగంలో రామావతారంలో తప్పక తీరుతుందని వరమిచ్చాడు. ఆ కారణంగా ఒంటిమిట్టలోని కోదండరాముని కల్యాణం నవమి రోజున కాకుండా పున్నమి రోజున వెండి వెన్నెలలో జరిపి మరునాడు రథోత్సవాన్ని జరుపుతారు.
ఈ ఉత్సవాలను చూచి తరించటానికి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ జరుగుతోంది. నీ నామస్మరణమే పాపహరణము నీ చరణములే కాపాడునన్ను నిన్ను చూసిన కన్నుల చూపులే ధన్యము నా మనసున నిలిచి మమ్ము కరుణచూడు ఓ రామా! ఒంటిమిట్ట కోదండరామా! భక్తులకు కొంగుబంగారమైన కోదండరాముడు సీతా లక్ష్మణసమేతుడై భక్తులను రక్షిస్తాడని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.