Ayodhya ram temple: శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఆరోజే ఎందుకు చేస్తున్నారంటే?-why january 22nd is selected ayodhya ram mandir pran pratishtha ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ayodhya Ram Temple: శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఆరోజే ఎందుకు చేస్తున్నారంటే?

Ayodhya ram temple: శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ ఆరోజే ఎందుకు చేస్తున్నారంటే?

HT Telugu Desk HT Telugu
Jan 12, 2024 12:17 PM IST

Ayodhya ram temple: రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ జనవరి 22 న జరగనుంది. అయితే ఆ రోజే ఎందుకు ఎంచుకున్నారనే విషయం ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర శర్మ తెలిపారు.

రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆరోజే ఎందుకు?
రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ ఆరోజే ఎందుకు? (PTI)

Ayodhya ram temple: యావత్ దేశం ఎదురుచూస్తున్న ఒకే ఒక్క క్షణం అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ. ఎన్నో ఏళ్లుగా ఈ సమయం కోసం వేచి ఉన్నారు. అందరి కలలు నెరవేరుస్తూ జనవరి 22 న అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. అయితే జనవరి 22నే ఎందుకు ఎంచుకున్నారు, ఆరోజుకి ఉన్న ప్రాధన్యత ఏంటనేది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

జనవరి 22 ఎందుకు ఎంచుకున్నారు?

22 జనవరి 2024 అయోధ్యలో అఖిజిత్‌తో కూడియున్నటువంటి మేషలగ్నంలో 12.00-12.30 సమయంలో ఉత్తరాయణకాలం.. విశేషించి పుష్యమాస శుక్ల పక్ష ద్వాదశి రోజు సోమవారం మృగశిరా నక్షత్రములో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం చాలా శుభప్రదమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఈ ముహూర్త బలాల ప్రకారం లగ్నంలో గురుడు, ద్వితీయంలో చంద్రుడు ఉచ్చ క్షేత్రంలో ఉండటం, లాభంలో శని స్వక్షేత్రంలో ఉండటం, అలాగే భాగ్యములో బుధ, శుక్ర, కుజులు అనుకూలంగా ఉండటం ఇది చాలా దివ్యమైన ముహూర్తంగా చెప్పవచ్చు. ఈ ముహూర్త ప్రభావంచేత కొన్ని తరాలపాటు ఈ ఆలయం దేదీప్యమానంగా విరాజిల్లుతోందని లగ్నంలో గురుని ప్రభావం వలన భక్తుల కోరికలు నెరవేరతాయని పంచాంగకర్త చిలకమర్తి తెలిపారు. అయోధ్యలో శ్రీరాముని అలయ ప్రతిష్ట జరగటం అది చూసేటటువంటి భాగ్యం కలగడం ప్రస్తుత తరంలో ఉన్నటువంటి వారికి కలిగిన గొప్ప అదృష్టం. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని వీక్షించిన వారి జన్మ చరితార్థం అవుతుందని చిలకమర్తి చెప్పుకొచ్చారు. అందరూ ఈ తరుణాన్ని వీక్షించాలని కోరారు.

అందరి ఆకాంక్ష నెరవేరేది ఆరోజే

జగదభిరాముడు.. రఘుకులసోముడు.. పురుషోత్తముడు… శ్రీరామ చంద్రుడు జన్మస్థలంలోనే భవ్యమందిరంలో దివ్య దర్శన భాగ్యం ఇవ్వబోతున్నాడు. భక్తకోటి శతాబ్దాల చిరకాలస్వప్నం సాకారం కాబోతుంది. రామ జన్మభూమి పరిరక్షణోద్యమంలో బలిదానమైన భక్తుల త్యాగం... కోట్లాదిమంది అసాధారణమైన కృషికి ఫలితం రాబోతుంది. అయోధ్యలో రామమందిర ఉద్దాటన ఎప్పుడా అని ఎదురుచూస్తున్న హైందవజాతి ఆకాంక్ష నెరవేరబోతోంది. హైందవజాతికి 2024 జనవరి 22 సువర్దాక్షరాలతో లిఖించే రోజు.

అయోధ్య రామమందిర దర్శనం కోసం ఎదురు చూస్తున్న కోట్లాదిమంది హిందువులకు ఇది శుభవార్త. రామాలయ ప్రారంభోత్సవం, ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దశాబ్దాల సమస్య తీరిపోయి అయోధ్యలో దివ్యమైన రామమందిర నిర్మాణం శరవేగంగా జరిగింది. దీంతో ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని యూపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేస్తోంది.

జగజ్జేయమానంగా జరగనున్న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిధిగా హాజరవుతున్నారు. దేశంలోని ఎందరో ధర్మాచార్యులు, పీఠాధీశ్వరులు, సాధుసంతులు, ఆధ్యాత్మిక, ధార్మికవేత్తలు 8వేల మందికి పైగా ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మరో ఏడు ఆలయాలు దర్శించుకోవచ్చు

అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరాన్ని సందర్శించే భక్తులు 70 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జన్మభూమి కాంప్లెక్స్‌లో మరో 7 ఆలయాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనాలని శ్రీరామ జన్మభూమి తీర్ధక్షేత ట్రస్ట్‌ పోస్టు ద్వారా అందరికీ అహ్వానాలు పంపుతున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. వీరితో పాటు పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు ఇప్పటికే అందాయి.

శ్రీరాముడి చిన్ననాటి స్వరూపం రామ్‌ లల్లాను ఐదేళ్ల బాలుడి రూపంలో ఆలయంలో కూర్చోబెడతారు. ఇందుకోసం కర్దాటక, రాజస్థాన్ నుంచి తీసుకొచ్చిన శిలలతో మూడు విగ్రహాలను తయారుచేశారు. ఈ విగ్రహాలు దాదాపుగా సిద్ధమయ్యాయి. ఈ ఆలయంలో గర్భగుడితో పాటు ఐదు మండపాలు ఉంటాయి.

ఇక జనవరి 22న అయోధ్యలోని నూతన రామాలయంలో శ్రీరాముడు కొలువుదీరనున్న సందర్భంగా ఆరోజు నుంచి 20 మంది కొత్త అర్చకులు ఆలయంలో రోజువారీ పూజలను నిర్వహించనున్నారు. ఈ నేపధ్యంలో తీర్ధ క్షేత్ర ట్రస్ట్‌ ప్రస్తుతం 20 మంది కొత్త అర్చకులకు శిక్షణ ఇస్తోంది. శ్రీరామ జన్మభూమి అలయంలో శ్రీరామునికి సేవ చేసే ఖాగ్యం కలగనుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel