Mahashivaratri: శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు.. తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో ఆలయాల కిటకిట-shiva temples are crowded with devotees on the day of shivaratri ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mahashivaratri: శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు.. తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో ఆలయాల కిటకిట

Mahashivaratri: శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు.. తెలుగు రాష్ట్రాల్లో భక్తులతో ఆలయాల కిటకిట

Sarath chandra.B HT Telugu
Mar 08, 2024 09:44 AM IST

Mahashivaratri: తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి శివయ్య దర్శనం కోసం ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వరంగల్‌లో వెయ్యి స్తంభాల ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు.

వెయ్యి స్తంభాల గుడిలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వెయ్యి స్తంభాల గుడిలో శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Mahashivaratri: తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా (Mahashivaratri) శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నదీ తీరాల్లో ఉన్న శివాలయాల్లో స్వామి దర్శనం కోసం వేకువ జామునే పుణ్య స్నానాల కోసం భక్తులు తరలి వచ్చారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు.

కేంద్ర ప్రభుత్వ నిధులతో పునర్నిర్మించిన చారిత్రక వెయ్యి స్తంభాల ఆలయాన్ని కిషన్‌ రెడ్డి దంపతులు పూజలు నిర్వహించారు. 2006 లో మొదలైన ఆలయ పునర్నిర్మాణ పనులు సుదీర్ఘ కాలం తర్వాత కొలిక్కి వచ్చాయి. పునర్నిర్మించిన వెయ్యి స్తంభాల ఆలయంనేటి నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. చారిత్రక నేపథ్యంలో ఉన్న వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయం, కల్యాణ మండపాలు పర్యాటకులు, భక్తుల్ని అలరించనున్నాయి.

శుక్రవారం మహాశివరాత్రి రోజు వెయ్యిస్తంభాల ఆలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. వరంగల్ ఎంపీ దయాకర్,నాయిని రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ వెంకటేశ్వరరావు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ శర్మ, రీజినల్ డైరెక్టర్ పాఠక్, స్తపతి శివకుమార్‌లతో కలిసి మండపాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. పునరుద్దరణ పనులు  ప్రారంభించిన మండపాన్ని పునరుద్దరించడానికి 19ఏళ్ల సమయం పట్టిందని, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. 

కాకతీయుల కాలంలో అనేక రకాల నిర్మాణాలు చేశారని, ఎలాంటి సాంకేతికత లేని రోజుల్లో శిలలతో అద్భుతాల నిర్మాణాలు చేపట్టారని చెప్పారు. దేశంలో అనేక ప్రాచీన కట్టడాలను ధ్వంసం అవుతున్నాయని చెప్పారు. సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 

ప్రాచీన కట్టడాల పరిరక్షణకు కఠినమైన చట్టాలు ఇప్పటికే ఉన్నాయని సాంకేతిక అవరోధాలను అధిగమించి వెయ్యి స్తంబాల మండపాన్ని పునరుద్ధరించినట్టు చెప్పారు. కాకతీయల కాలంలో వెయ్యి స్తంభాల మండపం నిర్మాణానికి 75ఏళ్లు పట్టిందన్నారు. ధ్వంసమైన ప్రతి కట్టడాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు

భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే క్రమంలోనే భారతీయ నిర్మాణాలపై దాడులు చేశారని కిషన్ రెడ్డి చెప్పారు. దేశంలో దేవాలయాలను పథకం ప్రకారం ధ్వంసం చేసుకుంటూ పోయారన్నారు. ముస్లిం రాజుల హయంలోనే ఇలాంటి దాడులు జరిగాయన్నారు. 

సామాజిక ఆర్ధిక, సాంస్కృతిక కేంద్రంగా కొనసాగిన ఆలయాలను దేశమంతట ధ్వంసం చేసుకుంటూ పోయారన్నారు. అన్ని రకాల పూజా కార్యక్రమాలు వెయ్యి స్తంభాల మండపంలోనే జరిగేవన్నారు. తమిళనాడు నుంచి వచ్చిన స్తపతి శివకుమార్ బృందం ఎన్నో శ్రమలను ఎదుర్కొని పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు కిషన్ రెడ్డి వివరించారు.  మండపం పునరుద్దరణలో పాల్గొన్న సిబ్బంది, ఆర్కియాలజీ, సాంస్కృతిక శాఖల అధికారుల్ని కిషన్ రెడ్డి సన్మానించారు. 

భక్తులతో కిటకిట…

మహాశివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువ జామున నుంచే పోటెత్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి 12 గంటలకు స్వామివారి కల్యాణం నిర్వహించారు. విజయవాడ భ్రమరాంభ మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు పాత శివాలయంలో శివరాత్రి దర్శనాల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి వారి దర్శనానికి ముందు కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసే వారితో దుర్గా ఘాట్ కిటకిటలాడింది.

శైవ క్షేత్రాలన్నీ శివ భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కనకదుర్గమ్మవారి సమీపంలోని భవాని జల శివాలయంలో భక్తులు పోటెత్తారు.

తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రి (Indrakeeladri)పై శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం, వన్ టౌన్ పాత శివాలయంలో భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కృష్ణా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గుంటూరులోని అమరావతిలో అమరలింగేశ్వరుడి దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. కృష్ణాతీరంలో కొలువైన శైవక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

విజయవాడ యనమలకుదురు శివాలయంలో తెల్లవారుజాము నుంచి గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. మహాశివరాత్రి సందర్భంగా యనమలకుదురు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గ్రామంలోకి ద్విచక్ర వాహనాలు మినహా ఎటువంటి వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు.

శ్రీశైలంలో ఘనంగా వేడుకలు…

శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivratri Brahmotsavalu) వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం అర్థరాత్రి నుంచి శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామి అమ్మవార్ల దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. దైవ దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది.

శివనామస్మరణతో శ్రీశైలం ఆలయం మారుమ్రోగుతోంది. భక్తులతో కిక్కిరిసిన ఆలయ క్యూలైన్లు.. శివస్వాములతో ప్రత్యేక క్యూలైన్లు నిండిపోయాయి. భక్తులు వేకువ జామున నుంచి పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామి అమ్మవార్లు నందివాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం నందివాహనంపై స్వామిఅమ్మవార్ల ఆలయ ప్రదక్షిణ, స్వామిఅమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి పదిగంటలకు ఆలయంలో నవనందుల పాగాళంకరణ అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణం నిర్వహించనున్నారు.

9న రథోత్సవం, తెప్పోత్సవం కార్యక్రమాలు జరగనున్నాయి. 10న ధ్వజావరోహణం.. 11న అశ్వ వాహన సేవ, పుష్పోత్సవం, శయనోత్సవం కార్యక్రమాలతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ క్షేత్రాల్లో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

తెలంగాణలో వేములవాడలో శివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. కోడె మొక్కులు సమర్పించుకునే భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది.