Saturday Fasting: శనివారం ఉపవాసం, వేంకటేశ్వరుని అనుగ్రహం, హనుమంతుని ఆశీర్వాదం ఈ మూడింటికీ ఉన్న సంబంధం ఏంటి?
Saturday Fasting: శనివారం ఉపవాసం ఉండటం వల్ల కలిగే లాభాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. ఉపవాసం ఉండి వేంకటేశ్వరుని మాత్రమే పూజించాలా.. ఆ రోజుకి ఇంకేం ప్రత్యేకతలున్నాయో తెలుసుకోండి.
పండుగ రోజుల్లో, ప్రత్యేక పూజల సమయాల్లో ఉపవాసం ఉండటమనేది హిందూ ఆచారాలలో ముఖ్యమైనది. పండుగలను బట్టి, వారి వారి ఇష్ట దైవాలను బట్టి వారంలో ఒకట్రెండు రోజులు ఉపవాసం ఉంటుంటారు. ఇలా చేయడం వారికి దైవానుగ్రహం కలిగి శుభఫలితాలు అందుతాయని నమ్ముతారు. ఈ క్రమంలోనే శనివారం ఉపవాసం ఉండే వారి అభీష్టమేంటి.. వారిపై వేంకటేశ్వరుడి అనుగ్రహం ఎందుకుంటుంది. వారికి హనుమంతుని ఆశీర్వాదం లభించడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి.
ఉపవాసం: పెద్దలు చెప్పినట్లుగా ఉపవాసమంటే ఉపే-వాసం (ఉపే అంటే సమీపే) అని అర్థం. దేవుడికి దగ్గర మనస్సును ఉంచుతూ ఆధ్మాత్మిక చింతనలో గడపడం. కఠిక ఉపవాసాన్ని కూడా హిందూ శాస్త్రంలోనూ ఆమోదించలేదు. కనీసం ఉపవాసం ఉండాలనుకున్న పూట రెండు గ్లాసుల మజ్జిగైనా తాగాలని చెప్తుంటారు. మరి శనివారం ఉపవాసం ఉండటం వెనుక ఆంతర్యమేంటంటే..
ప్రతి ఒక్కరి జీవితంలో శని ప్రభావం ఉంటుందని హిందువులు బాగా నమ్ముతారు. శని పేరు తలిస్తేనే కష్టాలు వస్తాయని భయపడుతుంటారు. వాస్తవానికి శని భౌతిక ఒత్తిడులకు తలవంచకుండా తల ఎత్తుకు తిరిగే సామర్థ్యాన్ని కలిగిస్తాడు. మనల్ని యోగపరంగా ముందుకు తీసుకువెళ్లి కర్మయోగులుగా మారే అవకాశం కల్పిస్తాడు. ఫలితంగా శని బారిన పడిన వారు దృఢ స్వభావులుగా మారతారు. కష్టాల నుంచి గట్టెక్కి మనల్ని మనం తీర్చిదిద్దుకునేలా మారాలంటే.. శని అనుగ్రహం పొందాలి.
శని భగవానుని ఎలా ప్రసన్నం చేసుకోవాలంటే..
జీవితంలో నిత్యం ఎదుర్కొంటున్న ప్రతికూలతలను, దురదృష్టాలను నివారించడాలని వేడుకుంటూ శనివారం ఉపవాసం పాటించడం చాలా ప్రయోజనకరంగా కనిపిస్తుంది. అంతేకాకుండా శనివారం రోజు హనుమంతుని ఆరాధించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గుతుంది. మినుములు, ఉప్పు, మిరియాలతో చేసిన వడలను హనుమంతునికి నైవేద్యంగా సమర్పించి, మరికొన్నింటిని ఇంకొందరికి పంచడం వల్ల కాస్త ఉపశమనం ఉంటుంది.
వేంకటేశ్వరుడి అనుగ్రహం:
శనివారం ఉపవాసం ఉండటం వల్ల శని దోషం మాత్రమే తొలగిపోకుండా వేంకటేశ్వరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం.. శనివారం రోజు వేంకటేశ్వర స్వామిని పూజించిన వారికి శని బాధలుండవట. ఈ వరాన్ని సాక్షాత్ శనిదేవుడే శ్రీనివాసుడికి ఇచ్చాడట. అందుకే ఏలినాటి శని, అర్దాష్టమ శని వంటివి నడుస్తున్నప్పుడు నియమ నిష్టలతో ఏడుకొండల శ్రీనివాసుని పూజిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అంతేకాకుండా కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వరుడికి కూడా శనివారమంటే మహా ప్రీతి.
మొదటి నుంచి వేంకటేశ్వరుడి లీలలన్నీ శనివారమే జరుగుతుండటం మనం గమనించవచ్చు. తనకు ఆలయం నిర్మించమని తొండమాన్ చక్రవర్తిని ఆదేశించింది శనివారమే. శ్రీనివాసుడు తొలిసారిగా శనివారమే ఆలయంలోకి ప్రవేశం చేశారు. అంతేకాదు శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహమాడింది. సృష్టికి మూలంగా భావించే ఓంకారం ప్రభవించిన రోజు, శ్రీనివాసునికి ఎంతో ఇష్టమైన చక్రతాళ్వార్ పుట్టిన రోజు శనివారమే. సాక్షాత్ శ్రీనివాసుడే శనివారానికి అంత ప్రాధాన్యతనిచ్చాడు కాబట్టి శనివారం ఉపవాసముండి భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు.