Naivedhyam: ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే మీ కోరికలు నెరవేరతాయో తెలుసా?-which fruits is offering for which god to good results which naivedhyam is best for which god ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Naivedhyam: ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే మీ కోరికలు నెరవేరతాయో తెలుసా?

Naivedhyam: ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే మీ కోరికలు నెరవేరతాయో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Aug 24, 2024 11:26 AM IST

Naivedhyam: పూజ చేసేటప్పుడు భగవంతుడికి నైవేద్యం సమర్పించకుండా ఉంటే అది అసంపూర్ణంగా ముగుస్తుంది. తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలంటే..

ఏ దేవుడికి ఏ నైవేద్యం ఇష్టం
ఏ దేవుడికి ఏ నైవేద్యం ఇష్టం (pexels)

Naivedhyam: ప్రతిరోజూ పూజ చేసేటప్పుడు మనం దేవుడికి పూలు, నైవేద్యంగా పండ్లు సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్మకం. అరటి పండు, నారింజ పండ్లు, యాపిల్ వంటివి నైవేద్యంగా పెడతారు. అయితే ఏ దేవుడికి ఎలాంటి పండ్లు నైవేద్యంగా పెడితే శుభ ఫలితం కలుగుతుందో తెలుసా?

ఆటంకాలు తొలగిపోవాలంటే

మొదలు పెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు. అలాగే అరటి పండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల సమస్య కార్యసిద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం. నిలిచిపోయిన పనులు పునః ప్రారంభం కావాలని కోరుకుంటూ దేవుడికి నారింజ పండ్లు పెడతారు.

అప్పుల బాధలు తొలగిపోవాలంటే

అరటి పండు గుజ్జుగా చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు. యాపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే సకల దరిద్రాలు తొలగిపోతాయని అంటారు. మామిడి పండు దేవుడికి ప్రసాదంగా పెడితే సంపద పెరిగే అవకాశం ఉంటుంది.

వివాహం కావాలని

వివాహంలో ఆటంకాలు ఎదురవుతున్నా, పెళ్లి అనుకుంటే ఏదైనా అశుభం జరిగినా కూడా ఈ పండ్లు దేవుడికి నైవేద్యంగా పెట్టి చూడండి. సపోటా పండ్లు దేవుడికి నైవేద్యంగా పెడితే వివాహం సకాలంలో జరుగుతుంది విశ్వసిస్తారు.

ఆరోగ్యం కోసం

శని దేవుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా సమార్పిస్తే మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మకం. అనారోగ్యంతో సతమవుతూ ఉంటే దేవుడికి అంజీర్ పండ్లు నైవేద్యంగా పెట్టాలి. ద్రాక్ష పండ్లు నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు లభిస్తాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది.

శత్రువుల మీద విజయం కోసం

శత్రువులు, పగవారి మీద విజయం సాధించాలని కోరుకుంటున్నారా? అయితే భగవంతుడికి పనస పండు నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు.

ఏ దేవుడికి ఏ నైవేద్యం అంటే ఇష్టమో తెలుసా?

బొజ్జ గణపయ్యకి కుడుములు అంటే మహా ప్రీతి. పురాణాల ప్రకారం మోదకం తిన్న వారికి కళలు, రచనల మీద ఆధిపత్యం ఉంటుందట.

పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు అని అందరికీ తెలుసు. భక్తి శ్రద్ధలతో చేసే కొద్ది నైవేద్యంతో కూడా సంతృప్తి చెందే దేవుడు శివుడు. పాలు లేదా పాలతో చేసిన ఏదైనా స్వీట్ నీలకంఠుడుకు చాలా ఇష్టం. శివునికి సమర్పించే అత్యంత ప్రసిద్ది చెందిన ప్రసాదం భాంగ్. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార అనే పంచామృతాలతో ఆయన్ని పూజిస్తారు. వీటిని సమపాళ్లలో కలిసి శివుడికి సమర్పిస్తారు.

సంపదనిచ్చే అదృష్ట దేవత లక్ష్మీదేవి. బియ్యంతో చేసే ఏ ప్రసాదం అయినా అమ్మవారికి నచ్చుతుంది. ఎక్కువగా ఖీర్ అమ్మవారికి సమర్పిస్తారు.

నవరాత్రులు వచ్చాయంటే దుర్గాదేవిని తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో అలంకరించి విశేష ప్రసాదాలు సమర్పిస్తారు. పాయసం లేదా ఖీర్ ని దుర్గాదేవికి ఎక్కువగా సమర్పిస్తారు. స్వచ్చమైన నెయ్యి, చక్కెర, పండ్లు, పాలు, స్వీట్లు, అరటి పండు, తేనె, బెల్లం, కొబ్బరి కాయ, నువ్వులు ఇలా ఒక్కొక్కటి తొమ్మిది రోజులు నైవేద్యంగా పెడతారు.

శ్రీమహా విష్ణువుకి పసుపు రంగు ఆహార ఉత్పత్తులు అంటే ఇష్టం. ఆయన్ని ప్రసన్నం చేసుకునేందుకు బెల్లం కలిపిన పెసరపప్పుతో చేసే కిచిడీ నైవేద్యంగా పెట్టవచ్చు. విష్ణువు దశావతారాలలో కృష్ణుడు, శ్రీరాముడిగా అవతరించాడు. కృష్ణుడికి తెల్లటి వెన్నని కొద్దిగా పంచదార కలిగి నైవేద్యంగా పెట్టవచ్చు.

ఆజన్మ బ్రహ్మచారి ఆటంకాలని తొలగిస్తూ భక్తుల్ని రక్షించే భగవంతుడిగా పూజింపబడే హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం ఎర్రపప్పు. వీటిని బెల్లంతో కలిపి స్వామి వారికి సమర్పించవచ్చు.

శని, రాహు, కేతువులకి నలుపు రంగు అంటే చాలా ఇష్టం. వీరి దేహం కూడా నలుపు రంగులోనే ఉంటుంది. అందుకే వీరికి నల్ల నువ్వులు, నల్ల పప్పులు సమర్పించవచ్చు. శని దేవుడికి నివేదించే ప్రసాదం కోసం తయారీకి ఆవాల నూనె ఉపయోగిస్తారు.

జ్ఞానానికి ప్రతీక సరస్వతీ దేవి. ఆమెని ప్రసన్నం చేసుకునేందుకు కిచిడి తరచుగా సమర్పిస్తారు. అలాగే బూందీ సరస్వతీ దేవిని పెట్టె మరొక నైవేద్యం.

సంపద అధిదేవుడు కుబేరుడు. ఆయన్ని ప్రసనం చేసుకునేందుకు పసుపు రంగు లడ్డూలు పెట్టవచ్చు.