Lord hanuman: హనుమంతుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?-interesting and unknown facts about lord hanuman ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Hanuman: హనుమంతుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Lord hanuman: హనుమంతుడి గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

Gunti Soundarya HT Telugu
Jan 18, 2024 07:00 PM IST

Lord hanuman: హనుమంతుడి జెండా అంటే నారింజ రంగు, భక్తులు మాలధారం సమయంలో వేసుకునే దుస్తులు అదే రంగువి వినియోగిస్తారు. అసలు హనుమంతుడికి ఆ రంగుకి ఉన్న అనుబంధం ఎంతో తెలుసా?

శ్రీరాముడి పరమ భక్తుడు హనుమంతుడు
శ్రీరాముడి పరమ భక్తుడు హనుమంతుడు (pixabay)

Lord hanuman: బలం, ధైర్యాన్ని ఇచ్చేందుకు అందరూ తప్పని సరిగా తలుచుకునే పేరు ఒకటే హనుమంతుడు. ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కోరిన కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం. శ్రీరాముని పరమ భక్తుడు ఆంజనేయుడు. హిందూ పురాణాలలో హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్తారు. ఆజన్మ బ్రహ్మచారి.

సంస్కృతంలో ‘హను’ అంటే “దవడ”, ‘మాన్’ అంటే “వికృతి” అని అర్థం హనుమాన్ చిన్నతనంలో జరిగిన ఓ చిన్న సంఘటన వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది. ఆంజనేయుడు తన చిన్నతనంలో భగభగ మండుతున్న సూర్యుడిని చూసి పండిన మామిడి పండు అనుకుని దాన్ని పట్టుకుని తినాలని అనుకున్నాడు. ఆ సమయంలో అతన్ని ఆపేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టడం వల్ల హనుమంతుడి మూతి వికృతంగా మారిపోయింది.

చిరంజీవి

హిందూ గ్రంథాల ప్రకారం ఎనిమిది మంది చిరంజీవులు ఉన్నారని చెప్తారు. అంటే మరణం లేని వాళ్ళు అని అర్థం. వారిలో హనుమంతుడు కూడా ఒకడు. పురాణాల ప్రకారం కలియుగం చివరి వరకు కూడా రాముడి పేరు జపిస్తూ భూమిపై నివసిస్తూ ఉంటాడని అంటారు.

మీకు తెలుసా హనుమంతుడికి ఒక శాపం ఉంది. హనుమంతుడు చిన్నతనంలో తన చేష్టలతో రుషులని ఇబ్బంది పెట్టేవాడు. ధ్యానంలో ఉన్న ఋషిని ఆటపట్టించడం వల్ల ఆగ్రహానికి గురైన మునివర్యులు అంజనేయుడిని శపించారు. దైవిక శక్తులు మరిచిపోయేలా శాపానికి గురయ్యాడు. సీతా మాత కోసం అన్వేషించే సమయంలో జాంబవంతుడి వల్ల మళ్ళీ హనుమంతుడు తన శక్తి సామర్థ్యాలని గుర్తు చేసుకున్నాడు.

సీతాదేవి ఇచ్చిన బహుమతి తిరస్కరించిన హనుమాన్

శ్రీరాముడికి పరమ భక్తుడు హనుమంతుడు. ఒకనాడు సీతా దేవి హనుమంతుడికి అందమైన ముత్యాల హారాన్ని బహుమతిగా ఇచ్చింది. అందులో రాముడి పేరు లేని దేనిని తాను అంగీకరించబోనని చెప్పి ఆంజనేయుడు ఆ బహుమతి తీసుకునేందుకు నిరాకరించాడు. తన భక్తిని నిరూపించుకోవడం కోసం ఆంజనేయుడు తన గుండెల్లో కొలువై ఉన్న సీతారాములని చూపించాడు.

నారింజ రంగు ఎందుకు?

హనుమంతుడు అనగానే నారింజ రంగు జెండా కనిపిస్తుంది. విగ్రహాలు కూడా నారింజ రంగులోనే కనిపిస్తాయి. అలా ఎందుకు కనిపిస్తాయనే విషయం గురించి ఎవరికీ తెలియకపోవచ్చు. ఒకరోజు సీతాదేవి తన నుదిటి మీద కుంకుమ పెట్టుకోవడాన్ని హనుమంతుడు గమనించాడు. అలా ఎందుకు పెట్టుకుంటారని దాని ప్రాముఖ్యత ఏమిటని అడిగి తెలుసుకున్నాడు. అలా పెట్టుకోవడం శ్రీరాముడు దీర్ఘాయువుని సూచిస్తుందని సీతాదేవి చెప్పిందట. ఇక అప్పటి నుంచి హనుమంతుడు తన ప్రగాఢ భక్తిని ప్రదర్శించేందుకు తన శరీరం మొత్తం సింధూరంతో నింపేసుకున్నాడు.

హనుమంతుడికి కొడుకు

హనుమంతుడు ఆజన్మ బ్రహ్మచారి అంటారు. అంటే పెళ్ళికి దూరంగా ఉన్నాడు. కానీ హనుమంతుడికి కొడుకు ఉన్నాడనే విషయం తెలుసా? లంకని దహనం చేసిన తర్వాత హనుమంతుడి చెమట బిందువు మకరధ్వజ అనే శక్తివంతమైన చేప నోటిలో పడింది. హనుమంతుడు బ్రహ్మచారి అయినప్పటికీ ఈ చేప హనుమంతుని కుమారుడికి జన్మనిచ్చింది.

అప్సరస కొడుకు

హనుమంతుడి తల్లి అంజన ఇంద్రుడి ఆస్థానంలో ఉండే అప్సరస. ఒకనాడు ఆమె శాపానికి గురైంది. భూమిపై వానర రూపంలో జన్మించింది. శివుని అవతారానికి జన్మనిస్తేనే ఆమె శాపం తొలగిపోతుందట. అలా ఆమె వానర యువరాణిగా జన్మించి కేసరిని వివాహం చేసుకుంది. ఆమెకి ఆంజనేయుడు పుట్టాడు. అందుకే హనుమంతుడిని అంజనీ పుత్రుడు అని అంటారు.

ఆకారాలు మార్చుకోగల శక్తిమంతుడు

హనుమంతుడు తన ఆకారాలు మార్చుకోగల సమర్థుడు. లంకలో హనుమంతుడు సీతాదేవి కోసం వెతుకుతున్న సమయంలో పిల్లి పరిమాణం అంత చిన్నగా మారగలిగాడు. ఒక్కోసారి పర్వత పరిమాణం అంత ఎత్తులోకి రూపాంతరం చెందాడు.

WhatsApp channel