Manipur violence: మణిపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి: 10 మంది మిలిటెంట్లు హతం-manipur violence 10 militants die in attack on manipur crpf camp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Manipur Violence: మణిపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి: 10 మంది మిలిటెంట్లు హతం

Manipur violence: మణిపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి: 10 మంది మిలిటెంట్లు హతం

Sudarshan V HT Telugu
Nov 12, 2024 03:33 PM IST

Manipur: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో తీవ్రస్థాయిలో హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా, సీఆర్పీఎఫ్ క్యాంపుపై సాయుధ మిలిటెంట్లు దాడి చేశారు. భద్రతాదళాల ఎదురుకాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు హతమయ్యారు.

మణిపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి: 10 మంది మిలిటెంట్లు హతం
మణిపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి: 10 మంది మిలిటెంట్లు హతం

Manipur violence: మణిపూర్ లోని జిరిబమ్ జిల్లాలో సోమవారం సీఆర్పీఎఫ్ క్యాంపుపై సుమారు 40 మందితో కూడిన సాయుధ మిలిటెంట్ల బృందం దాడి చేసింది. వారి దాడిని తిప్పికొట్టిన పారామిలిటరీ సిబ్బంది, రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం.. 10 మంది ఉగ్రవాదులను కాల్చి చంపింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో జకురాధోర్ లోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) పోస్టుతో పాటు, ఆ పోస్ట్ సమీపంలోని బొరోబెకెరా పోలీస్ స్టేషన్ పై సాయుధ మిలిటెంట్లు దాడి చేశారని మణిపూర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు సహా సంయుక్త భద్రతా దళాలు దీటుగా బదులిచ్చాయి. ఎదురు కాల్పుల అనంతరం 10 మృతదేహాలను స్వాధీనం చేసుకోగా, ఉగ్రవాదులు తీసుకెళ్లిన మరో ఉగ్రవాది ఈ దాడిలో మరణించినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.

కానిస్టేబుల్ కు గాయాలు

ఈ దాడిలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సంజీవ్ కుమార్ కు బుల్లెట్ గాయాలయ్యాయని, అతన్ని అస్సాంలోని సిల్చార్ మెడికల్ కాలేజీకి తరలించామని, ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని సీఆర్పీఎఫ్ తెలిపింది. సుమారు 40-45 నిమిషాల పాటు ఎదురుకాల్పులు జరిగాయని, ఆ తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపింది. కాల్పుల అనంతరం ఈ ప్రాంతంలో జరిపిన సోదాల్లో 10 మంది సాయుధ ఉగ్రవాదుల మృతదేహాలతో పాటు మూడు ఏకే-47 రైఫిల్స్, నాలుగు ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఒక ఆర్పీజీ, పంప్-యాక్షన్ గన్, బీపీ హెల్మెట్లు, మ్యాగజైన్లు సహా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అట్టుడుకుతున్న మణిపూర్

సెప్టెంబర్ 7న గిరిజన, మీతీ మిలిటెంట్ గ్రూపులకు చెందిన నలుగురు మిలిటెంట్లు హతమైన తర్వాత ఈ ప్రాంతంలో ఒక్కరోజులో మిలిటెంట్లు చనిపోవడం ఇదే అత్యధికం. మణిపూర్ రాష్ట్రం (manipur violence) లో చెలరేగిన హింసాకాండ చట్టబద్ధ పాలనను బలహీనపరిచింది. రెండు వర్గాల మధ్య జాతి ఘర్షణగా మొదలైన హింస నెమ్మదిగా మొత్తం రాష్ట్రాన్ని చుట్టుముట్టింది. మరణించిన మిలిటెంట్ల గుర్తింపు లేదా జాతిని మణిపూర్ పోలీసులు వెల్లడించలేదు. మరణించిన 11 మంది తమ గ్రామ రక్షణ వాలంటీర్లు అని గ్రామాలను రక్షించే హ్మార్ గిరిజనులతో కూడిన దళం హ్మార్ విలేజ్ వాలంటీర్స్ (హెచ్వీవీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆ 11 మంది "కుకి-జో గ్రామ వాలంటీర్లు" అని కుకి-జో కౌన్సిల్ ధృవీకరించింది.

ఒకేసారి రెండు శిబిరాలపై..

‘‘మధ్యాహ్నం 3 గంటల సమయంలో రెండు శిబిరాలపై ఏకకాలంలో దాడి జరిగింది. ఉగ్రవాదుల వద్ద ఆర్పీజీలు, ఏకే 47 తుపాకులు ఉన్నాయి. అలాంటి ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిమిషాల వ్యవధిలోనే ఓ జవానుకు తీవ్రగాయాలైనట్లు సమాచారం అందింది. బలగాలు దీటుగా బదులివ్వడంతో 10 మంది మిలిటెంట్లు హతమయ్యారు. వారిలో చాలా మంది అడవికి పారిపోయారు’’ అని ఓ పోలీసు అధికారి తెలిపారు. దాడికి వచ్చిన వారిలో సుమారు 30-40 మంది సాయుధ మిలిటెంట్లు ఉండొచ్చని తెలిపారు. "బోరోబెక్రా పోలీస్ స్టేషన్ ఆవరణలో చాలా మంది మెయిటీలు అంతర్గతంగా నిర్వాసితులు (IDP) నివసిస్తున్నారు. మిలిటెంట్లు మెయిటీ ఐడిపిలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది’’ అన్నారు.

Whats_app_banner