Governor In Warangal: ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలన్న గవర్నర్-tg governor says adivasis and tribals should be at the forefront of the all fields ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Governor In Warangal: ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలన్న గవర్నర్

Governor In Warangal: ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలన్న గవర్నర్

HT Telugu Desk HT Telugu
Aug 28, 2024 08:42 AM IST

Governor In Warangal: అడవిని నమ్ముకుని జీవించే ఆదివాసీలు, గిరిజనులు అన్ని రంగాల్లో ముందుండాలని, వారి అభ్యున్నతికి అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సూచించారు.మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్​ జిష్ణుదేవ్​ వర్మ మంగళవారం ములుగు జిల్లాలో పర్యటించారు.

ఓరుగల్లు పర్యటనలో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ
ఓరుగల్లు పర్యటనలో తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ

Governor In Warangal: ఓరుగల్లు పర్యటనలో భాగంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ మంగళవారం యాదాద్రి దర్శనం అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లా ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ కు చేరుకోగా.. రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు , జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర, ఎస్పీ డాక్టర్ పి.శబరీష్ తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యాలతో మహిళలు, చిన్నారులు గవర్నర్ కు వెల్ కం చెప్పారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో గవర్నర్​ జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్వో లు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్​ ఇచ్చారు.

ప్రభుత్వ పథకాలు భేష్​

తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని రాష్ట్ర గవర్నర్​ జిష్ణు దేవ్​ వర్మ ప్రశంసించారు. పేదల అభ్యున్నతికి, గిరిజనులు, ఆదివాసీల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. ముఖ్యంగా విద్యా, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగించాలన్నారు.

ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అడవి బిడ్డల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని, వారి కోసం జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కంటైనర్​ హాస్పిటల్​ ఏర్పాటు చేయడంలో కృషి చేసిన మంత్రి సీతక్క ను ప్రత్యేకంగా అభినందించారు. ఆదివాసీ, గిరిజన గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని కోరారు.

మేడారానికి జాతీయ గుర్తింపు కోసం కృషి చేయాలి

అంతకుముందు మంత్రి సీతక్క మాట్లాడుతూ తొలిసారి జిల్లా పర్యటనకు గవర్నర్ రావడం పట్ల జిల్లా ప్రజల తరుఫున కృతజ్ఞతలు తెలిపారు. ములుగు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తర్ణం ఉందని, 30 శాతం మంది ఆదివాసీలు, గిరిజన ప్రజలు ఈ జిల్లాలోనే ఉన్నారన్నారు. ఇక్కడి ప్రజలంతా ఐకమత్యంతో నివసిస్తారని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక గా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని చెప్పారు. ఆసియా ఖండంలో అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర మేడారం మహాజాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి అత్యంత వైభవంగా జరుగుతుందని, ఆ జాతరను జాతీయ పండుగగా గుర్తించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క గవర్నర్​ ను కోరారు.

మాత, శిశుమరణాలు తగ్గాయి…

రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితంగా జిల్లాలో మాత, శిశు మరణాల రేటు తగ్గింనది జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. మంత్రి ప్రత్యేక చొరవతో గోదావరి ముంపు ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమ్మక్క, సారలమ్మ ట్రైబల్​ యూనివర్సిటీ లో అడ్మిషన్స్ ప్రారంభం అయ్యాయని తెలిపారు.

జిల్లాలో అడవులు సంరక్షణకు తగిన చర్యలు తీసుకొంటున్నామని, క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పుకొచ్చారు. ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ముందుకు పోతున్నామని వివరించారు.

గవర్నర్​ టూర్​ లో భాగంగా ములుగు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇన్​టాక్​ కన్వీనర్​ ప్రొఫెసర్​ పాండురంగారావు రామప్ప దేవాలయ నిర్మాణం, సాండ్​ బాక్స్​ టెక్నాలజీ గురించి గవర్నర్​ కు వివరించారు.

గవర్నర్​ టూర్​ లో కానిస్టేబుల్​కు పాముకాటు

రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనలో భాగంగా దాదాపు 800 మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వెంకటాపూర్​ మండలంలోని అడవుల్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్​ ను పాము కాటు వేయడం కలకలం రేపింది. వెంకటాపూర్ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్ పోలీస్ కానిస్టేబుల్ గుండ్ల ప్రశాంత్ కు డ్యూటీ వేయగా.. అక్కడ విధుల్లో ఉన్న ప్రశాంత్​ ను విష పాము కాటు వేసింది. దీంతో కొద్ది సేపటికే ఆయన అస్వస్థతకు గురి కాగా, వెంటనే ములుగు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం అక్కడ ప్రాథమిక వైద్యం అందించిన అనంతరం మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి పంపించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ జిల్లా ప్రతినిధి)

Whats_app_banner