Yasin Malik: ‘‘సాయుధ మార్గం వదిలేశా.. నేను ఇప్పుడు గాంధేయవాదిని’’ - యాసిన్ మాలిక్
Yasin Malik: తన లక్ష్యం సాధించడానికి మొదట్లో సాయుధ మార్గం అవలంబించానని, ఇప్పుడు ఆ మార్గాన్ని వీడి గాంధేయ విధానంలో లక్ష్య సాధన కోసం ప్రయత్నిస్తున్నానని కశ్మీర్ వేర్పాటు వాద నేత యాసిన్ మాలిక్ వెల్లడించారు. నలుగురు భారత వైమానిక దళ సిబ్బందిని హతమార్చిన కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడు.
Yasin Malik: తాను ఇప్పుడు ఆయుధాలు త్యజించి, గాంధేయ మార్గంలో పోరాటం చేస్తున్నానని కశ్మీర్ వేర్పాటు వాద నేత, జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్-యాసిన్ (JKLF-Y) చైర్మన్ యాసిన్ మాలిక్ వెల్లడించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ట్రిబ్యునల్ కు సమర్పించిన అఫిడవిట్ లో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. 1994లోనే సాయుధ పోరాటాన్ని విరమించుకున్నానని, బదులుగా, గాంధేయ ప్రతిఘటన మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపారు. జేకేఎల్ఎఫ్-వైపై నిషేధాన్ని యూఏపీఏ ట్రిబ్యునల్ సమీక్షించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967 ప్రకారం జేకేఎల్ ఎఫ్ -వైని 'చట్టవ్యతిరేక సంఘం'గా పేర్కొంటూ యూఏపీఏ ట్రిబ్యునల్ గత నెలలో జారీ చేసి గురువారం గెజిట్ లో ప్రచురించింది.
శాంతియుత పరిష్కారం కోసం..
కశ్మీర్ (jammu and kashmir) సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని కోరుతూ 1994 నుంచి కేంద్రంలోని రాజకీయ, ప్రభుత్వ ఉన్నతాధికారులు తనతో సంప్రదింపులు జరుపుతున్నారని యాసిన్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. 1990లో శ్రీనగర్ లోని రావల్ పోరా ప్రాంతంలో నలుగురు భారత వైమానిక దళ సిబ్బందిని హతమార్చిన కేసులో జేకేఎల్ ఎఫ్ -వై వ్యవస్థాపకుడు యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడు.
టెర్రర్ ఫైనాన్సింగ్
ఉగ్ర సంస్థలకు ఆర్థిక సాయం అందించిన టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో 2022 మేలో యాసిన్ మాలిక్ కు కఠిన జీవిత ఖైదు విధించారు. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేసింది. కాగా, యూఏపీఏ ట్రిబ్యునల్ కు యాసిన్ ఇచ్చిన రిప్లై కమ్ అఫిడవిట్ లో 90వ దశకం ప్రారంభంలో అర్థవంతమైన చర్చల ద్వారా కశ్మీర్ వివాదాన్ని పరిష్కరిస్తామని వివిధ ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని, కాల్పుల విరమణను ప్రారంభించిన తర్వాత, తనపై, జెకెఎల్ఎఫ్-వై సభ్యులపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చారని యాసిన్ మాలిక్ పేర్కొన్నారు.
యాసిన్ మాలిక్ కు మరణశిక్ష విధించాలన్న ఎన్ఐఏ కోర్టు
యాసిన్ మాలిక్ కు టెర్రర్ ఫండింగ్ కేసులో మరణశిక్ష విధించాలని కోరుతూ జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మే 26, 2023న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ కేసును తాను వ్యక్తిగతంగా వాదించాలనుకుంటున్నానని యాసిన్ మాలిక్ (Yasin Malik) కోర్టుకు తెలిపారు. తనకు నచ్చిన న్యాయవాదిని నియమించుకోవచ్చని జస్టిస్ సురేశ్ కుమార్ కైత్, జస్టిస్ గిరీష్ కత్పాలియాల ధర్మాసనం ఇచ్చిన సూచనను ఆయన తోసిపుచ్చారు.