DGP Ravi Gupta on Elections : ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు, విధుల్లో 73 వేలకు పైగా పోలీస్ బలగాలు: డీజీపీ రవి గుప్తా-hyderabad dgp ravi gupta says 83 thousand police force in election duties 186 crore cash liquor gold drugs seized ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Dgp Ravi Gupta On Elections : ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు, విధుల్లో 73 వేలకు పైగా పోలీస్ బలగాలు: డీజీపీ రవి గుప్తా

DGP Ravi Gupta on Elections : ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు, విధుల్లో 73 వేలకు పైగా పోలీస్ బలగాలు: డీజీపీ రవి గుప్తా

Bandaru Satyaprasad HT Telugu
May 11, 2024 10:04 PM IST

DGP Ravi Gupta on Elections : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవి గుప్తా తెలిపారు. 73 వేలకు పైగా తెలంగాణ, ఇతర రాష్ట్ర పోలీసు సిబ్బందితో ఎన్నికల భద్రతను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

డీజీపీ రవి గుప్తా
డీజీపీ రవి గుప్తా

DGP Ravi Gupta on Elections : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు డీజీపీ రవి గుప్తా తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడం పోలీసుల ప్రాథమిక విధి అన్నారు. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలుక 13వ తేదీన జరగనున్న ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించే లక్ష్యంతో విస్తృతమై పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేశామని డీజీపీ అన్నారు.

పటిష్ట భద్రతా ఏర్పాట్లు

ఎన్నికల ప్రక్రియ పవిత్రను కాపాడేందుకు, పోలింగ్ సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఇందులో 73,414 సివిల్ పోలీసులు, 500 తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ విభాగాలు, 164 సెంట్రల్ ఆర్మ్ డ్ పోలీస్ ఫోర్స్ పోలీసులు, తమిళనాడుకు చెందిన మూడు స్పెషల్ ఆర్మ్ డ్ కంపెనీలు, 2088 ఇతర శాఖల సిబ్బంది, 7000 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన హోంగార్డులను వినియోగిస్తున్నామని డీజీపీ రవి గుప్తా తెలిపారు. ఎన్నికల సంఘం కోడ్ కు కట్టుబడి తెలంగాణ పోలీసులు భద్రతా తనిఖీ కేంద్రాల నెట్ వర్క్ ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఈ నెట్ వర్క్ లో 482 ఫిక్స్ డ్ స్టాటిక్ టీమ్ లు, 462 స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్, 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్ పోస్టులు, 173 ఇంటర్ జిల్లా చెక్ పోస్టులు ఉన్నాయన్నారు. డబ్బు, మద్యం లేదా ఇతర అక్రమ పదార్థాల రవాణా ప్రయత్నాలను అడ్డుకోవడానికి మొబైల్ పోలీసు విభాగాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2024 మార్చి 16న ఎన్నికల కోడ్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర పోలీసులు రూ.186.14 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన వస్తువులు జప్తు చేశారన్నారు.

డీజీపీ ఆఫీసులో కంట్రోల్ రూమ్

తెలంగాణ ఎక్సైజ్ చట్టం, మాదక ద్రవ్యాల చట్టం, ఐపీసీ, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద నేరాలకు సంబంధించి మొత్తం 8863 ఎఫ్ఐఆర్ లను నమోదు చేశారని డీజీపీ వివరించారు. రౌడీలను, ఎన్నికలలో నేరాలకు పాల్పడే వారిని గుర్తించి 34,526 మందిని చట్టపరమైన నిబంధనలకు కట్టుబడి ఉండేలా బైండోవర్ చేశామని తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియకు ఎవరు, ఎలాంటి అంతరాయం కల్గించినా సహించేది లేదన్నారు. వివాదాస్పదమైన వారందరికీ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారన్నారు. డీజీపీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని మే 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తామని డీజీపీ తెలిపారు. చివరి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ స్ట్రాంగ్ రూమ్ లో సురక్షితంగా ఉంచే వరకు కంట్రోల్ రూమ్ నిరంతరం పనిచేస్తుందన్నారు.

మార్చి 16 నుంచి మే 10 వరకు తనిఖీల్లో సీజ్ చేసిన వాటి విలువ

  • నగదు - రూ.93 కోట్ల 94 లక్షలు
  • మద్యం - రూ.10 కోట్ల 7 లక్షలు
  • డ్రగ్స్ -రూ.7 కోట్ల 86 లక్షలు
  • బంగారం , వెండి వస్తువులు - రూ.62 కోట్ల 77 లక్షలు
  • తాయిలాలు - రూ.11 కోట్ల 48 లక్షలు
  • మొత్తం -రూ.186.14 కోట్లు

WhatsApp channel

సంబంధిత కథనం