Raajadhani Files TV Premiere: పోలింగ్‍కు ఒక్క రోజు ముందు టీవీ ఛానెల్‍లో రాజధాని ఫైల్స్ సినిమా.. టెలికాస్ట్ టైమ్ ఇదే
Raajadhani Files TV Premiere Date, Time: రాజధాని ఫైల్స్ సినిమా టీవీ ఛానెల్‍లోకి వచ్చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‍లో పోలింగ్‍కు ఒక్క రోజు ముందు ఈ మూవీ టెలికాస్ట్ అవుతోంది. ఈ సినిమా టీవీ ప్రీమియర్ టైమ్ ఇదే.
Raajadhani Files Telecast: పొలిటికల్ డ్రామా మూవీ ‘రాజధాని ఫైల్స్’ చాలా ఆసక్తిని రేపింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు చేసిన ఉద్యమం కథాంశంగా ఈ చిత్రం తెరకెక్కింది. అయితే, ఈ మూవీలో ప్రాంతాల పేర్లను మార్చి చూపించారు మేకర్స్. ఫిబ్రవరి 15వ తేదీన రాజధాని ఫైల్స్ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు.. ఈ చిత్రం టీవీ ఛానెల్‍లో ప్రసారమయ్యేందుకు సిద్ధమైంది.
టెలికాస్ట్ డేట్, టైమ్ ఇదే
రాజధాని ఫైల్స్ సినిమా రేపు (మే 12)ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈటీవీ ఛానెల్‍లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఈటీవీ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‍లో అసెంబ్లీ, లోక్‍సభ ఎన్నికల పోలింగ్ మే 13వ తేదీన జరగనుంది. అయితే, ఇందుకు ఒక్క రోజు ముందు మే 12న ఈటీవీలో పొలిటికల్ మూవీ అయిన రాజధాని ఫైల్స్ టెలికాస్ట్ కానుండడం ఆసక్తికరంగా మారింది.
రాజధాని ఫైల్స్ మూవీలో పుష్పరాజ్ అఖిలన్, వీణ, సీనియర్ నటుడు వినోద్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. వాణి విశ్వనాథ్, పవన్, షణ్ముఖ్, అజయరత్నం, అమృత చౌదరి, విశాల్ కీలకపాత్రలు చేశారు. ఈ మూవీని తెలుగు వన్ ప్రొడక్షన్స్ పతాకంపై కే.రవిశంకర్ నిర్మించారు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందించారు.
ఇటీవలే యూట్యూబ్‍లో..
రాజధాని ఫైల్స్ సినిమా ఇటీవలే యూట్యూబ్‍లో అందుబాటులోకి వచ్చింది. ఏ ఓటీటీలోకి రాకుండా ఈ మూవీ యూట్యూబ్‍లో అడుగుపెట్టింది.
కోర్టులో పిటిషన్
ఫిబ్రవరి 15వ తేదీన రిలీజైన రాజధాని ఫైల్స్ సినిమాపై ఏపీ హైకోర్టులో పిటిషన్లు నమోదయ్యాయి. ఈ మూవీ ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ చిత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డితో పాటు మరికొందరు నేతలను అభ్యంతరకరంగా చూపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ మూవీపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. అయితే, ఒక్కరోజు తర్వాత ఆ స్టేను తొలగించింది. ప్రదర్శన చేసేందుకు అనుమతి ఇచ్చింది.
రాజధాని ఫైల్స్ స్టోరీ లైన్ ఇదే
అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న పోరాటాన్ని రాజధాని ఫైల్స్ మూవీలో చూపించారు మేకర్స్. అయితే, ప్రాంతాలు, నాయకుల పేర్లను మార్చి పాత్రలను తెరకెక్కించారు. అరుణప్రదేశ్ రాష్ట్రం రాజధానిగా ఉన్న అయిరావతిని (పేరు మార్పు) అధికారంలోకి వచ్చే పార్టీ మార్చడం.. ఆ ప్రాంతాన్నే కొనసాగించాలని రైతులు పోరాటం చేయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. రైతుల పోరాటాన్ని అణచివేసేందుకు కొత్త ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలను చేసిందనే విషయాన్ని కూడా మేకర్స్ తెరకెక్కించారు.
ఎన్నికలు ఉన్న ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను సినిమాలు కూడా హీటెక్కించాయి. ఏపీ రాజకీయాల్లో యథార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ.. వ్యూహం, సిద్ధం చిత్రాలను తీసుకొచ్చారు. యాత్ర 2 చిత్రం కూడా పొలిటికల్ మూవీగా వచ్చింది. రాజధాని ఫైల్స్ మూవీ కూడా రిలీజ్ అయింది. ఈవారంలోనే మే 10న రిలీజైన ప్రతినిధి 2 సినిమా కూడా పొలిటికల్ థ్రిల్లరే. ఈ మూవీలో నారా రోహిత్ హీరోగా నటించారు.