Raajadhani Files Trailer: ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వచ్చేసింది.. అమరావతి క్యాపిటల్ అంశంపై..-raajadhani files trailer released backdrop of amaravathi capital issue ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raajadhani Files Trailer: ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వచ్చేసింది.. అమరావతి క్యాపిటల్ అంశంపై..

Raajadhani Files Trailer: ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వచ్చేసింది.. అమరావతి క్యాపిటల్ అంశంపై..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2024 05:33 PM IST

Raajadhani Files Trailer: రాజధాని ఫైల్స్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. అమరావతి రాజధానిగా ఉండాలంటూ రైతులు చేస్తున్న పోరాటం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కినట్టు అర్థమవుతోంది. ట్రైలర్ ఎలా ఉందంటే..

Raajadhani Files Trailer: ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వచ్చేసింది
Raajadhani Files Trailer: ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ వచ్చేసింది

Raajadhani Files Trailer: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సినిమాలు హాట్‍టాపిక్‍గా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర ప్రధాన అంశంగా రూపొందిన ‘యాత్ర 2’ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలోకి రానుంది. ఏపీ రాజకీయాలపై వివాదాస్పద దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం చిత్రం విడుదలకు కోర్టు అభ్యంతరం తెలిపింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌పై మరో మూవీ వస్తోంది. ఏపీ రాజధాని అమరావతి అంశంపై ‘రాజధాని ఫైల్స్’ చిత్రం రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 5) రిలీజ్ అయింది.

ఆంధ్రప్రదేశ్ పేరును ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్లో మేకర్స్ నేరుగా ప్రస్తావించలేదు. అలాగే, రాజకీయ పార్టీల పేర్లను కూడా మార్చి చూపించారు. ఏపీకి మూడు రాజధానులను ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించగా.. ఇందులో నాలుగు రాజధానులు అంటూ మార్పు చేశారు. అయితే, ఇవి ఇలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపైనే ‘రాజధాని ఫైల్స్’ రూపొందిందని ట్రైలర్‌లో అర్థమైపోతోంది. అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటం, ఆవేదన, పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు భాను. ఈ చిత్రంలో కొన్ని పాత్రలు కూడా ప్రస్తుత రాజకీయ నాయకులను పోలినట్టు ఉన్నాయి. ఈ మూవీలో అఖిలన్, వీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతోనే వారు తెరంగేట్రం చేస్తున్నారు.

రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని చూపించే షాట్‍తో ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ మొదలైంది. “మన పంటకు నీరు ఎంత అవసరమో.. రాష్ట్రానికి రాజధాని అవసరం” అంటూ వినోద్ కుమార్ చెప్పే డైలాగ్ ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటూ ఎక్కువ రాజధానులను ప్రభుత్వం ప్రతిపాదించే సీన్ కూడా ఉంది. ఆ తర్వాత అమరావతే రాజధానిగా ఉండాలని రైతులు చేసే పోరాటాన్ని ట్రైలర్లో చూపించారు మేకర్స్.

“140 కోట్ల జనాభా ఉన్న మన దేశానికి ఒక్క రాజధాని. ఆరు కోట్ల ప్రజలు ఉన్న రాష్ట్రానికి నాలుగు రాజధానులా. ఇది రాజ్యాంగబద్ధమా.. వ్యక్తిగత ద్వేషమా” అంటూ అసెంబ్లీలో అఖిలన్ డైలాగ్ చెబుతారు. అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్ర ఈ ట్రైలర్లో ఉంది. వారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేసిన చర్యలను కూడా మేకర్స్ చూపించారు. సమస్యకు పరిష్కారం దొరికే వరకు పోరాడుతూనే ఉంటామని రైతులు తెగేసి చెప్పడం.. “దేశానికే అన్నం పెట్టిన అన్నపూర్ణ అరుణప్రదేశ్.. భవతీ భిక్షాందేహీ అంటూ కనిపించిన అందరినీ అప్పుడు అడుక్కునే స్థాయికి దిగజారిపోయింది” అనే డైలాగ్‍తో రాజధాని ఫైల్స్ ట్రైలర్ ముగిసింది.

మణిశర్మ మ్యూజిక్..

రాజధాని ఫైల్స్ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ మ్యూజిక్ ఇచ్చారు. ఈ ట్రైలర్లో బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‍గా ఉంది. కంఠమనేని రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వినోద్ కుమార్, వాణి విశ్వనాథ్, పవన్, విశాల్, మధు, అజయ్‍రత్నం, షన్ముఖ, అమృత చౌదరి ఈ మూవీలో కీలకపాత్రలు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని నిర్ణయించిన గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అక్కడి రైతుల నుంచి వేలాది ఎకరాలను సమీకరించింది. అయితే, 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి మూడు రాజధానులను నిర్ణయించింది. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు కూడా రాజధానులుగా నిశ్చయించింది. దీంతో అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్నారు. సుమారు మరో మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Whats_app_banner