Yatra 2 Trailer: యాత్ర 2 ట్రైలర్ రిలీజ్.. ఆసక్తికరంగా..
Yatra 2 Trailer Released: యాత్ర 2 సినిమా ట్రైలర్ వచ్చేసింది. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాదయాత్ర సహా మరిన్ని ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.
Yatra 2 Trailer Released: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి గతంలో చేసిన ఓదార్పు యాత్ర, పాదయాత్రల ఆధారంగా ‘యాత్ర 2’ చిత్రం వస్తోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతం జరిగిన పరిణామాలు ఈ చిత్రంలో కీలకంగా ఉండనున్నాయి. వైఎస్ఆర్ చేసిన పాదయాత్ర ఆధారంగా 2019లో వచ్చిన ‘యాత్ర’ చిత్రానికి ఇప్పుడు ఈ ‘యాత్ర 2’ సీక్వెల్‍గా వస్తోంది. ఈ మూవీలో వైఎస్ జగన్ పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు. వైఎస్ఆర్ పాత్రను మలయాళ స్టార్ మమ్మూట్టి చేశారు. యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ నేడు (ఫిబ్రవరి 3) వచ్చింది.
చెవులు వినిపించని తన కూతురి గురించి ఓ తల్లి.. వైఎస్ఆర్ (మమ్మూట్టి)కు చెప్పే ఎమోనషల్ సీన్‍తో ‘యాత్ర 2’ ట్రైలర్ మొదలైంది. ఆ తర్వాత వైఎస్ఆర్ మరణానంతర పరిణామాలు ఉన్నాయి. వైఎస్ జగన్ (జీవా) కన్నీరు పెట్టుకోవడం, ఓదార్పు యాత్ర చేపట్టడం లాంటి సన్నివేశాలు ఉన్నాయి. జగన్ యాత్రను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేసిందనేలా ఈ ట్రైలర్‌లో మేకర్స్ చూపించారు. “జగన్ రెడ్డి కడపోడు సర్. శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాక.. వాళ్లు నాశనం అయిపోతారని తెలిసినా.. శత్రువుకు తలవంచరు” అని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‍కు ఓ నేత చెబుతున్నట్టుగా డైలాగ్ ఉంది.
ఆ ఫేమస్ డైలాగ్‍తో..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (మహేశ్ మంజ్రేకర్) పాత్ర కూడా యాత్ర 2 ట్రైలర్లో ఉంది. “ ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికి రావయ్యా. అవసరాలను బట్టి ముందుకు పోవాలి” అని ఆ పాత్ర చెప్పే డైలాగ్ ఉంది. “ఎన్నికలు అయిపోయాక జనాలను మోసం చేసి నా క్రెడిబులిటీ పోగొట్టుకోలేను అన్నా.. ఆ క్రెడిబులిటీ లేని రోజు.. మా నాయన లేడు.. నేనూ లేను” అని జగన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం, 2019 ఎన్నికల ముందు పాదయాత్రను కూడా మేకర్స్ చూపించారు. “నేను విన్నాను.. నేను విన్నాను” అనే ఫేమస్ డైలాగ్‍తో యాత్ర-2 ట్రైలర్ ముగిసింది.
వైఎస్ఆర్ మరణానంతర పరిస్థితులు, వైఎస్ జగన్ చేసిన ఓదార్పు యాత్ర, ఆయనను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు, జగన్ జైలుకు వెళ్లి విడుదలవడం, ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లి సుదీర్ఘ పాదయాత్ర చేయడం లాంటి విషయాలు యాత్ర-2 ట్రైలర్‌లో ప్రధానంగా ఉన్నాయి. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం కూడా మూవీకి తగ్గట్టుగా ఉంది.
యాత్ర 2 చిత్రానికి మహీ వి రాఘవ్ దర్శకత్వం వహించారు. యాత్రలాగే రాజకీయ అంశాలతో పాటు ఎమోషనల్‍గా ఈ మూవీని తెరకెక్కించినట్టు ట్రైలర్‌తో అర్థమవుతోంది. ఈ మూవీకి సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. వీ సెల్యూలాయిడ్, త్రీ ఆయమ్ లీవ్స్ పతాకాలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శివ మేకల నిర్మాతగా వ్యవహరించారు.
ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో మరో ఐదు రోజుల్లో అంటే ఫిబ్రవరి 8న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానుంది.
యాత్ర 2 సినిమాలో వైఎస్ భారతిగా కేతికా నారాయణన్, చంద్రబాబు పాత్రలో మహేశ్ మంజ్రేకర్, సోనియా గాంధీ పాత్రలో సుసానే బెన్నెట్ నటించారు.