Yatra 2: వైఎస్ జగన్ బర్త్ డే స్పెషల్‌గా యాత్ర 2 పోస్టర్.. అదిరిపోయే డైలాగ్‌తో రిలీజ్
YS Jagan Birthday Yatra 2 Poster: ఏపీ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గురువారం యాత్ర 2 నుంచి రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. పోస్టర్‌పై ఆయన చెప్పే డైలాగ్ పవర్‌ఫుల్‌గా ఉండి అదిరోపోయేలా ఉంది.
Yatra 2 YS Jagan Mohan Reddy Poster: సినిమాల్లో బయోపిక్‌లకు విపరీతమైన క్రేజ్ ఉంటుందని ఇదివరకు విడుదలైన చిత్రాల ద్వారా తెలిసిందే. అలాంటిది ప్రముఖ రాజకీయవేత్తలకు సంబంధించిన బయోపిక్స్ అయితే మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే 2019లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా వచ్చి మంచి హిట్ కొట్టింది యాత్ర మూవీ.
ఇప్పుడు యాత్రకు సీక్వెల్‌గా యాత్ర 2 మూవీ రానుంది. త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలతో కలిసి శివ మేక నిర్మిస్తున్న యాత్ర 2 చిత్రాన్ని మహి వి రాఘవ్ తెరకెక్కించారు. సీఎం కాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆధారంగా యాత్ర తెరకెక్కితే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర 2ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తండ్రి వైఎస్సార్ మరణం, తర్వాత నాయకునిగా జగన్ ఎదిగిన తీరుతోపాటు 2009 నుంచి 2019వరకు ఏపీలో జరిగిన రాజకీయ సంఘటనలు ఉండనున్నట్లు సమాచారం.
యాత్ర 2లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించగా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగా తమిళ నటుడు జీవా చేస్తున్నాడు. అలాగే ఇందులో చంద్రబాబు నాయుడు పాత్రలో పాపులర్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పటికే యాత్ర 2 నుంచి వచ్చిన పోస్టర్స్‌కి మంచి క్రేజ్ వచ్చింది. తాజాగా యాత్ర 2 రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు.
డిసెంబర్ 21 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాత్ర 2 నుంచి ఆయన లుక్ చూపిస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అటువైపు కుర్చీలో మమ్ముట్టి కూర్చుని ఉంటే ఇటువైపు జగన్ కూర్చుని ఉన్నారు. "నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ, ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. నేను వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కొడుకుని" అంటూ పోస్టర్‌పై అదిరిపోయే డైలాగ్ చూపించారు.
యాత్ర 2 మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. ఇదివరకు 2019లో యాత్ర రిలీజ్ చేసిన డేట్‌కే యాత్ర 2ను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న యాత్ర 2 సినిమాకు దసరా, కల్కి 2898 ఏడీ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.