AP Assembly Elections 2024 : ఏప్రిల్ లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఏప్రిల్ 16 రిఫరెన్స్ డేట్- ఈసీ కీలక ఆదేశాలు?
AP Assembly Elections 2024 : ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏప్రిల్ 16 జనరల్ ఎలక్షన్స్ రిఫరెన్స్ తేదీ పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని దిల్లీ సీఈఓ అక్కడి అధికారులను ఆదేశించారు. దీంతో ఏప్రిల్ లోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
AP Assembly Elections 2024 : ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఏపీలో పర్యటించి ఎన్నికల ఏర్పాట్లపై ఆరా తీసింది. తాజాగా అధికారులకు ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‍లోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి మొదటి వారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఏప్రిల్‍లో ఎన్నికలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఏప్రిల్ 16న ఎన్నికలు నిర్వహించాలని రిఫరెన్స్ డేట్‍గా ఈసీ నిర్ణయించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణకు ఈసీ రాష్ట్రాలను సమాయత్తం చేస్తుంది. ఈ మేరకు లోక్‍సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తుంది. ఏప్రిల్ 16న ఎన్నిక తేదీగా భావించి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు దిల్లీ ఎన్నికల ప్రధానాధికారి ఆ రాష్ట్ర అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ లోనే ఎన్నికలంటూ దేశవ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్‍లోనే తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. లోక్‍సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఏప్రిల్ లో నిర్వహిస్తారని సమాచారం. ఇప్పటికే ఎన్నికల తేదీలపై రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి. ఎన్నికల సంసిద్ధత కోసం ఆ తేదీ ఇచ్చినట్లు ఈసీ వివరణ ఇచ్చింది.
ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ సమీక్ష
ఏపీలో ఎన్నికల సన్నద్ధతపై సీఎస్ జవహర్ రెడ్డి నిన్న సమీక్ష నిర్వహించారు. జనవరి 31వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధులతో సంబంధం ఉన్న అధికారులు, సిబ్బంది బదిలీలపై సీఎస్ సమీక్ష చేశారు. అధికారుల బదిలీలపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటి వరకు వివిధ శాఖలకు చెందిన దాదాపు 2 వేల మందిని బదిలీ చేసినట్టు ప్రభుత్వం ఈసీకి తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, సిబ్బంది ఖాళీలు ఇతర అంశాలపై సీఎస్ జవహర్ రెడ్డి ఈ సమీక్ష చర్చించారు. సీఎస్‌తో సమీక్షలో ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, పోలీసు ఉన్నతాధికారులు, అదనపు సీఈఓలు పాల్గొన్నారు.ఈ సమావేశంలో సీఈవో ముఖేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ...ఎన్నికల విధులతో సంబంధం ఉండి ఒకే ప్రాంతంలో మూడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న అధికారులు, సిబ్బందిని బదిలీ చేయాలన్నారు. ఇప్పటికే కొన్ని శాఖల్లో బదిలీలు జరిగాయని తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో, పోలీస్ శాఖల్లో బదిలీ చేయాల్సిన వారిని గుర్తించారన్నారు. మరో మూడు రోజుల్లో వారిని బదిలీ చేయాల్సిందిగా ఆయా శాఖల అధికారులకు సీఈఓ మీనా ఆదేశిచారు.
ఏపీ ఓటర్ల జాబితా విడుదల
ఏపీ ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. తుది జాబితాపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం అదేశాల ప్రకారం తుది ఓటర్ల జాబితా విడుదల చేశామన్నారు. రాష్ట్రంలో 4.08 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. గతేడాది అక్టోబర్ 27న జారీ చేసిన డ్రాఫ్ట్ జాబితా తర్వాత 5.8 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. యువ ఓటర్లు 5 లక్షల మేర పెరిగారన్నారు. రేపటి నుంచి కాలేజీలు, యూనివర్సిటీల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం ప్రయత్నిస్తామన్నారు. ఏపీలో జీరో, జంక్ ఓటర్లు ఉన్నారని, వాటిని 98 శాతం మేర సరిచేశామని మీనా తెలిపారు. కొన్ని అంశాల్లో సాంకేతిక కారణాల వల్ల పూర్తి స్థాయిలో సవరణ చేయలేదన్నారు. 10 కంటే ఎక్కువ ఓటర్లు కలిగిన 1.51 లక్షల ఇళ్లను తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 2 శాతం మేర సరిదిద్దాలన్నారు. జీరో, జంక్ ఓటర్ల సంఖ్య గతంలోనూ ఉందన్నారు.