CM Jagan In Assembly | మూడు రాజధానులపై మాది అదే మాట.. అయినా కోర్టులు అలా ఎలా డిక్టేట్ చేస్తాయి?
రాజ్యంగం ప్రకారం చట్టం చేసే అధికారం శాసన వ్యవస్థకే ఉందని సీఎం జగన్ అన్నారు. పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని.. హైకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలన్నారు. లేకపోతే.. సిస్టమ్ కుప్పకూలి పోయే ప్రమాదం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
మూడు రాజధానుల అంశంపై ఏపీ అసెంబ్లీలో ఇవాళ చర్చ జరిగింది. వికేంద్రీకరణపై కోర్టు చెప్పిన తీర్పు సైతం ప్రస్తావనకు వచ్చింది. దీనిపై ముఖ్యమంత్రి సీఎం జగన్ మాట్లాడారు. చట్టాలు చేసే.. అధికారం శాసన వ్యవస్థకే ఉందని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణపై శాసన వ్యవస్థకు ఎలాంటి అధికారం లేదని కోర్టు చెప్పిందని.., రాజధానిపై కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏదీ లేదని న్యాయస్థానం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వమేమో.. రాజధానిపై తుది నిర్ణయం రాష్ట్రానిదేనని.. అఫిడవిట్ చేసిందని సీఎం జగన్ పేర్కొన్నారు.
శాసన వ్యవస్థ చట్టాన్ని చేయాలా? వద్దా? అనేది కోర్టులు నిర్ణయించలేవని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రకారం.. చట్టం చేసే అధికారం ఒక్క శాసన వ్యవస్థకే మాత్రమే ఉందని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నాయని.. అయినా.. ఆచరణా సాధ్యం కానీ తీర్పును హైకోర్టు ఇచ్చిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. మరోసారి సీఎం స్పష్టం చేశారు. మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో మాటలన్నింటికీ తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. నెలరోజుల్లో లక్ష కోట్ల రూపాయలతో రాజధాని కట్టేయాలని కోర్టులు ఎలా డిక్టేట్ చేస్తాయి? అని జగన్ అన్నారు.
'అభివృద్ధి వికేంద్రీకరణకే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. రాజ్యాంగం సూచించిన మూడు వ్యవస్థల పరిధి దేనికదే ఉంది. రాష్ట్ర హైకోర్టు పరిధిని దాటి వ్యవహరించినట్టు అభిప్రాయం వ్యక్తమైంది. వికేంద్రీకరణపై అసెంబ్లీలో కొత్తగా చట్టం చేయకూడదని హైకోర్టు తీర్పులో చెప్పింది. వికేంద్రీకరణపై కేంద్రం కూడా తమ సమ్మతి తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. వికేంద్రీకణ అనేది పూర్తిగా రాష్ట్రం పరిధిలోని అంశమని కేంద్రంగా స్పష్టంగా తెలిపింది. పెరిగిన ధరలను పరిశీలనకు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి 40 ఏళ్లు పడుతుంది.' అని సీఎం జగన్ చెప్పారు.
అన్ని వ్యవస్థలు వాటి పరిధిలో ఉండాలని ఈ సందర్భంగా సీఎం జగన్ చెప్పారు. లేకపోతే.. సిస్టమ్ మొత్తం కుప్పకూలి పోయే ప్రమాదం ఉందని చెప్పారు. గుంటూరు, విజయవాడ కాకుండా.. తమకు బినామీలు ఉన్నచోట.. పెట్టుకున్నారని తెలిపారు. వైసీపీని గెలిపించేందుకు.. గత ప్రభుత్వ నిర్ణయాలే కారణమన్నారు. వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని శివరామకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పిందన్నారు.
మాస్టర్ ప్లాన్ కాలపరిమితి 20 ఏళ్ల అని అప్పటి ప్రభుత్వం చెప్పిందని.. ప్రతీ ఐదేళ్లకొకసారి సమీక్షించాలని కూడా రాశారని.. కాసీ అది ఆచరణ సాధ్యం కాదన్నారు. లక్ష కోట్లు అనేది ఇరవై ఏళ్లకు 15 నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు అవుతుందన్నారు. ఈ ప్రాంతం మీద తనకు ప్రేమ ఉందని.. అందుకే ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. తమకు హైకోర్టుపై గౌరవం ఉందని చెప్పారు. దాంతోపాటుఅసెంబ్లీ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తమకు ఉందని జగన్ స్పష్టం చేశారు. రాజధానితోపాటుగా రాష్ట్ర సంక్షేమం కూడా తమకు ముఖ్యమని చెప్పారు. న్యాయ సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్