Revanth Reddy : జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన-revanth reddy participated in the ceremony of land allotment to the journalists mac housing society ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy : జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Revanth Reddy : జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు.. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Basani Shiva Kumar HT Telugu
Sep 08, 2024 05:44 PM IST

Revanth Reddy : రవీంద్ర భారతిలో జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మాక్ హౌసింగ్ సొసైటీకి భూపంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. వారి సంక్షేమం కోరుతూ.. ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవని స్పష్టం చేశారు. జర్నలిస్టుల సమస్యకు తమ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోందని భరోసా ఇచ్చారు.

ఉన్మాద ధోరణితో..

'వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు. అది మనకు మనమే పెంచుకోవాలి. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానం. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే. ఆనాడు రాజకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి' అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

జర్నలిజం అర్థాన్ని మార్చేస్తున్నారు..

'కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు. అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి. ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు' అని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు.

శాశ్వత పరిష్కారం కోసం..

'అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు. నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది. ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం.. మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నా. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం' అని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.

ఎలాంటి పాలసీలు లేవు..

'తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవు. గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవు. మేం మీలో ఒకరమే.. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే. మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10 కోట్లు ఇస్తున్నా. ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు. అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం. ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Whats_app_banner