Telangana Floods : ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం.. ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Telangana Floods : తెలంగాణలో భారీ వర్షాలు అపార ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వారిని ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఆకేరు వాగు వరదతో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శనను సీఎం తిలకించారు. భారీ వర్షాలతో మహబూబాబాద్ జిల్లాలో వాటిల్లిన నష్టాలపై జిల్లా కలెక్టరేట్‌లో రేవంత్ రెడ్డి సమీక్ష చేశారు. రాష్ట్రంలో వరద సహాయక చర్యలకు.. తమ ఒక రోజు మూల వేతనం రూ. 130 కోట్లను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు రేవంత్ రెడ్డికి చెక్ రూపంలో అందజేశారు. సహాయం అందించిన ప్రభుత్వ ఉద్యోగులను ముఖ్యమంత్రి అభినందించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారాంపురం తండాకు వెళ్లారు. భారీ వర్షాలతో ఆకేరు వాగు పొంగి.. యువ శాస్త్రవేత్త అశ్విని, ఆమె తండ్రి మోతీలాల్ మరణించగా.. వారి కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించారు. 'అశ్విని తల్లి, సోదరుడుని పరామర్శించా. అశ్విని యువ శాస్త్రవేత్త. ఆమె మరణం బాధాకరం. ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం. అశ్విని కుటుంబానికి ఇల్లు లేదు. ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. ఆకేరు వాగు పొంగిన ప్రతిసారి.. సీతారాం తండాతో పాటు పక్కన ఉన్న మరో రెండు తండాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మూడు తండాలు కలిపి ఒకే పెద్ద గ్రామంగా మార్చేందుకు.. అందరికీ ఒకే చోట ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని హౌసింగ్ డిపార్టుమెంట్‌ను ఆదేశిస్తున్నా' అని రేవంత్ రెడ్డి వివరించారు.
ఆకేరుపై నూతన వంతెన..
అటు ఆకేరు వాగు పొంగి ఇళ్లలోని పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, సర్టిఫికెట్స్ తడిచిపోయాయి. ఈ విషయం సీఎంకు తెలియగా.. ఒకే ఎఫ్ఐఆర్ దాఖలు చేసి.. అందరికీ నూతన కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆకేరు ప్రవాహం, నీటి నియంత్రణపై శాస్త్రీయంగా అంచనా వేసి.. నూతన వంతెన నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఆక్రమణలపై కీలక వ్యాఖ్యలు..
'రాష్ట్ర వ్యాప్తంగా చెరువులపై స్పెషల్ డ్రైవ్ చేపడతాం. హైడ్రా తరహా వ్యవస్థను జిల్లాలకు కూడా విస్తరిస్తాం. ఆక్రమణలకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందే. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా హైడ్రా ముందుకు వెళ్తుంది. చెరువుల కబ్జాలతోనే ఈ ప్రకృతి వైపరీత్యం. చెరువులు, కుంటల కబ్జాలపై చర్యలు తప్పవు. నాలాల ఆక్రమణలను ఉపేక్షించేదిలేదు. కబ్జాలు చేసేవారు ఎంతటివారైనా వదిలేదిలేదు. పువ్వాడ ఆక్రమణలపై చర్యలకు కలెక్టర్‌ను ఆదేశించాం. చెరువులు, కుంటల ఆక్రమణల జాబితాలు సిద్ధం చేయాలి. కోర్టుల అనుమతి తీసుకుని ఆక్రమణలు తొలగిస్తాం' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హరీష్‌రావుకు రేవంత్ సవాల్..
'పువ్వాడ అక్రమాలను తొలగించడానికి సహకరించాలి. నేనే మీ దగ్గరికి అధికారులను పంపిస్తాను. గతంలో మీరే ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. నా సవాల్‌కు సమాధానం చెప్పిన తర్వాతే.. మా చిత్తశుద్ధిని ప్రశ్నించాలి' అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటు ఖమ్మం జిల్లాలో మాజీమంత్రి పువ్వాడ అజయ్, జగదీష్ రెడ్డిలతో కలిసి హరీష్ రావు పర్యటిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలతో మాట్లాడుతున్నారు.