Rythu Runa Mafi: రేవంత్ రెడ్డిని క్షమించమని యాదగిరీశుడిని వేడుకున్నా: హరీష్ రావు-harish rao interesting comments on revanth reddy about rythu runa mafi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Rythu Runa Mafi: రేవంత్ రెడ్డిని క్షమించమని యాదగిరీశుడిని వేడుకున్నా: హరీష్ రావు

Rythu Runa Mafi: రేవంత్ రెడ్డిని క్షమించమని యాదగిరీశుడిని వేడుకున్నా: హరీష్ రావు

HT Telugu Desk HT Telugu
Aug 22, 2024 04:03 PM IST

Rythu Runa Mafi: ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. రాష్ట్ర ప్రజలను అడ్డంగా మోసం చేస్తోందని.. మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రైతు రుణ మాఫీ దానికి ఉదాహరణ అని విమర్శించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తోంది.

యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు
యాదాద్రిలో మీడియాతో మాట్లాడుతున్న హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీమంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రజాపాలన అని.. పోలీస్ రాజ్యం నడుతున్నారని విమర్శించారు. రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే.. బలవంతంగా అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల పైన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారన్న హరీష్.. సీఎం రేవంత్ రెడ్డి అడుగడుగునా మోసం చేస్తున్నారని ఆక్షేపించారు. రైతుల రుణం తీరుస్తా అన్నోడు.. ఇవ్వాళ రైతులతో రణం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

రుణమాఫీ కాలేదని అడిగితే కేసులు పెడుతున్నారు.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా రుణమాఫీ 100 శాతం చేసేదాక పోరాటం చేస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలని హితవు పలికారు. ఆరు గ్యారంటీలతో మొట్ట మొదటి మోసం చేశారని.. పార్లమెంట్ ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్టు పెట్టి 100 శాతం రుణమాఫీ చేస్తా అన్నారని.. కానీ ఇవ్వాళ మాట తప్పారని విమర్శలు గుప్పించారు.

మాట తప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి వారిని క్షమించండి అని.. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసినట్టు హరీష్ రావు వివరించారు. సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిపై ఒట్టేసి పచ్చి మోసం చేశారని ఫైర్ అయ్యారు. రేవంత్ లాంటి వ్యక్తి ని ఇప్పటివరకు చూడలేదన్నారు. మంత్రులు ఒక మాట, సీఎం ఒక మాట మాట్లాడుతున్నారు.. ఏది నిజం.. ఏది అబద్ధం ..తేల్చాలి అని డిమాండ్ చేశారు. 54 శాతం రుణమాఫీ కాలేదని.. దీన్ని బట్టి ఎవ్వరు రాజీనామా చేయాలో చెప్పాలని నిలదీశారు .

రేవంత్ బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అయిన రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రైతుల పాపం రేవంత్ రెడ్డికి తగులుతుందన్నారు. యాదాద్రి ఆలయం నుంచే తమ యాత్ర మొదలుపెట్టామన్న హరీష్.. సీఎం ఒట్టు వేసిన అన్ని ఆలయాలకు వెళతామని స్పష్టం చేశారు.

( రిపోర్టింగ్- క్రాంతి పద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి )

Whats_app_banner