Regional Ring Road : ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం భూసేకరణను ప్రారంభించండి - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు-cm revanth reddy review at the secretariat on the regional ring road ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Regional Ring Road : ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం భూసేకరణను ప్రారంభించండి - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Regional Ring Road : ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం భూసేకరణను ప్రారంభించండి - సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 21, 2024 04:24 PM IST

రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్షించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ దక్షిణభాగం భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. ప్రగతిపై రోజువారీ సమీక్ష చేయాలని... భవిష్యత్‌ అవసరాలకు తగినట్లుగా అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని దిశానిర్దేశం చేశారు. భూసేకరణలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

ఆర్ఆర్ఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఆర్ఆర్ఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రీజిన‌ల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్‌) ప్ర‌గ‌తిపై క‌లెక్ట‌ర్లు ఏం చేస్తున్నారు... ప‌నుల‌ పురోగ‌తి ఏమిట‌నే దానిపై రోజువారీ స‌మీక్ష చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. భూ సేక‌ర‌ణ‌, ఇత‌ర విష‌యాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ స‌మాచారం త‌న‌కు అంద‌జేయాల‌న్నారు. ఆర్ఆర్ఆర్ ప్ర‌గతిపై రాష్ట్ర స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగంలో భూ సేక‌ర‌ణ‌, ప‌నుల‌కు సంబంధించిన వివ‌రాల‌ను అధికారులు ముఖ్య‌మంత్రికి తెలియ‌జేశారు. భూ సేక‌ర‌ణ వేగం పెర‌గాల‌ని సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ ఉత్త‌ర భాగంలోని క‌లెక్ట‌ర్లు ఈ ర‌హ‌దారి విష‌యంలో రోజు వారీగా ఏం చేశారు... ఏం పురోగతి సాధించారు, ద‌క్షిణ భాగంలో భూ సేక‌ర‌ణ ప్ర‌క్రియ ప్రారంభం, ఇత‌ర అంశాల‌పై ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ప్ర‌తి రోజు సాయంత్రానికి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శికి వివ‌రాలు అంద‌జేయాల‌న్నారు. భూ సేక‌ర‌ణ‌లోనూ పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు.

సీఎస్‌తో పాటు మౌలిక వ‌స‌తులు, ప్రాజెక్టుల స‌ల‌హాదారు శ్రీ‌నివాస‌రాజు, ముఖ్య‌మంత్రి ఓఎస్డీ షాన‌వాజ్ ఖాసీం, ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు, ఆర్ అండ్ బీ ఉన్న‌తాధికారుల‌తో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలని సీఎం సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ప‌నుల పురోగ‌తిని అందులో అప్‌డేట్ చేయాల‌ని సూచించారు. ఒక స‌మీక్ష స‌మావేశానికి మ‌రో స‌మీక్ష స‌మావేశానికి మ‌ధ్య కాలంలో పురోగ‌తి త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఆదేశించారు.

ఆర్ఆర్ఆర్ ద‌క్షిణ భాగం సంగారెడ్డి-ఆమ‌న్‌గ‌ల్‌-షాద్ న‌గ‌ర్‌-చౌటుప్ప‌ల్ (189.20 కి.మీ.) మార్గానికి సంబంధించి భూ సేక‌ర‌ణ ప్రారంభించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉత్త‌ర భాగంలో ఇప్ప‌టికే భూ సేక‌ర‌ణ చాలా వ‌ర‌కు పూర్త‌యినందున, ద‌క్షిణ భాగంలోనూ ప్రారంభించాల‌న్నారు. ఈ రోడ్డు విష‌యంలో ఏవైనా సాంకేతిక‌, ఇత‌ర స‌మ‌స్య‌లుంటే కేంద్ర ప్ర‌భుత్వంతో చ‌ర్చించాల‌ని, అదే స‌మ‌యంలో ప‌నుల విష‌యంలో ముందుకు సాగాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు.

ఆర్ఆర్ఆర్ మొత్తం మ్యాప్‌ను గూగుల్ మ్యాప్ లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌రిశీలించారు. ద‌క్షిణ భాగం ప్ర‌తిపాదిత అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పుచేర్పుల‌ను ముఖ్య‌మంత్రి సూచించారు. భ‌విష్య‌త్ అవ‌స‌రాలే ప్రాతిప‌దిక‌గా అలైన్‌మెంట్ ఉండాల‌ని, ఈ విష‌యంలో పార‌ద‌ర్శ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. తాను సూచించిన మార్పుల‌కు సంబంధించి క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి స‌మ‌గ్ర నివేదిక‌ను త్వ‌ర‌గా అంద‌జేయాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు.

ఫ్యూచ‌ర్ సిటీకి సంబంధించి రేడియ‌ల్ రోడ్ల నిర్మాణంపైనా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ర‌హ‌దారుల నిర్మాణానికి ముందే ఎక్క‌డెక్క‌డ అవి ప్ర‌ధాన రోడ్ల‌కు అనుసంధానం కావాలి... సిగ్న‌ల్‌, ఇత‌ర స‌మ‌స్య‌లు లేకుండా సాఫీగా ప్ర‌యాణం సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌న్నారు.

రేడియ‌ల్ రోడ్లు, ఓఆర్ఆర్‌, ఆర్ఆర్ఆర్ ల అనుసంధానానికి అనువుగా ఉండాల‌ని, ఫ్యూచ‌ర్ సిటీలో ఏర్పాటుకానున్న వివిధ ర‌కాల ప‌రిశ్ర‌మ‌లు, సంస్థ‌ల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా చూడాల‌ని ముఖ్య‌మంత్రి అన్నారు.

మొత్తం 342 కి.మీటర్లు…

హైదరాబాద్‌కు చుట్టూ 60 - 70 కిలోమీటర్ల అవతల తెలంగాణలోని పలు ప్రధాన జిల్లాల మీదుగా రీజనల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇందులో ఉత్తర భాగానికి కేంద్రం ఇప్పటికే అనుమతి ఇవ్వడంతోపాటు భూసేకరణ, ఇతర ప్రాథమిక ప్రక్రియలు మొదలయ్యాయి.మొత్తంగా 342 కిలోమీటర్ల పొడవుతో రింగ్‌ రోడ్డు ఉంటుంది. ఉత్తర భాగం 160 కిలోమీటర్ల మేర.. దక్షిణ భాగం 182 కిలోమీటర్ల మేర ఉంటుందనేది ప్రాథమిక అంచనా. ఉత్తర భాగం…. సంగారెడ్డి నుంచి మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్‌పూర్, భువనగిరి, యాదాద్రి మీదుగా చౌటుప్పల్‌ వరకు.. సుమారు 160 కిలోమీటర్లు ఉంటుంది. 

దక్షిణ భాగం చూస్తే…. సంగారెడ్డి నుంచి కంది,నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, సంస్థాన్‌ నారాయణపూర్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు దాదాపు 182 కిలోమీటర్ల పొడవు విస్తరించి ఉండనుంది. అయితే దక్షిణ భాగంలోనూ భూసేకరణ ప్రక్రియను ప్రారంభించాలని తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ ప్రక్రియ కూడా పట్టాలెక్కనుంది.