Speaker Notices: కేసీఆర్, హరీష్ రావు సహా మరికొందరికి కోర్టు నోటీసులు, భూపాలపల్లి న్యాయస్థానంలో హాజరవ్వాలని ఆదేశాలు-court notices to kcr harish rao and others orders to appear in bhupalappalli court ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Speaker Notices: కేసీఆర్, హరీష్ రావు సహా మరికొందరికి కోర్టు నోటీసులు, భూపాలపల్లి న్యాయస్థానంలో హాజరవ్వాలని ఆదేశాలు

Speaker Notices: కేసీఆర్, హరీష్ రావు సహా మరికొందరికి కోర్టు నోటీసులు, భూపాలపల్లి న్యాయస్థానంలో హాజరవ్వాలని ఆదేశాలు

HT Telugu Desk HT Telugu
Aug 06, 2024 08:34 AM IST

Speaker Notices: దాదాపు లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై తగిన విచారణ జరపాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు గత సీఎం కేసీఆర్, అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహ మరికొందరిని నోటీసులు జారీ అయ్యాయి.

మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు
మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు

Speaker Notices: తెలంగాణలో లక్ష కోట్ల నిధులతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై తగిన విచారణ జరపాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో దాఖలైన పిటిషన్ మేరకు గత సీఎం కేసీఆర్, అప్పటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు సహ మరికొందరిని నోటీసులు జారీ అయ్యాయి.

వారిద్దరితో పాటు ఇరిగేషన్ శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ యాజమాన్యాలకు కూడా నోటీసులు ఇష్యూ అయ్యాయి. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు విషయం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం వల్ల రూ.వేల కోట్ల ప్రజాధనం వృథా అయ్యిందని, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో అవినీతి, అక్రమాల వల్లే ఈ పరిస్థితి ఎదురైందని, దీనిపై తగిన విచారణ జరపాల్సిందిగా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి జిల్లా కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టు అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ఇంజినీర్ ఇన్ చీఫ్ హరిరాం, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ‘మేఘా’ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ చీఫ్ ఇంజినీర్లు నోటీసులు జారీ చేసింది. వారందరినీ సెప్టెంబర్ 5న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

గతేడాదే ఫిర్యాదు..

గతేడాది అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన విషయం తెలిసిందే. దీంతో అక్టోబర్ 25వ తేదీన జయశంకర్ భూపాలపల్లికి చెందిన నాగవెళ్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తగిన విచారణ జరిపి మాజీ సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు, కాంట్రాక్టు, నిర్మాణ సంస్థ, ఇంజినీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. కానీ ఈ ఫిర్యాదును పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా వదిలేశారు.

దీంతో రాజలింగమూర్తి మాత్రం అంతటితో వదిలేయకుండా భూపాలపల్లి ఎస్పీ తో పాటు హైదరాబాద్ లో ఉన్న డీజీపీ ఆఫీస్ లో కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. కేసు నమోదు చేయకుండా పోలీస్ అధికారులు లైట్ తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో రాజ లింగమూర్తి చివరకు భూపాలపల్లి జిల్లా కోర్టును ఆశ్రయించాడు. కానీ సరైన ఆధారాలు లేవన్న కారణంతో కోర్టు కూడా పిటిషన్ ను కొట్టేసింది.

హై కోర్టు సూచనల మేరకు రివిజన్ పిటిషన్

జిల్లా కోర్టులో కూడా సరైన చర్యలు లేవన్న ఉద్దేశంతో రాజ లింగమూర్తి చివరకు హై కోర్టును ఆశ్రయించాడు. అనంతరం హై కోర్టు సూచనల మేరకు భూపాలపల్లి జిల్లా కోర్టులో మార్చి 2వ తేదీన సరైన ఆధారాలతో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, ఐపీసీ 1860 ప్రకారం ఐపీసీ 120బీ, 420, 406, 409 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, తగిన విచారణ జరిపించడంతో పాటుగా ప్రతివాదులపై తగిన చర్యలు తీసుకోవాలని రివిజన్ పిటిషన్ వేశారు.

ఈ మేరకు వచ్చే నెల (సెప్టెంబర్) 5వ తేదీన విచారణకు హాజరు కావాల్సిందిగా జిల్లా కోర్టుల కేసీఆర్, హరీష్ రావు సహా మిగతా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 1 ఈ విచారణకు వాళ్లంతా హాజరు అవుతారా లేదా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)