AP Cyclone Rains : ఏపీకి తుపాను గండం, రేపటి నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు-పోర్టుల్లో 1వ ప్రమాద హెచ్చరిక జారీ
AP Cyclone Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం రేపటికి తుపానుగా బలపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను ప్రభావంతో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రేపటికి(బుధవారం) తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తదుపరి 2 రోజులలో తుపాను శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను ప్రభావంతో బుధవారం కోస్తాంధ్ర,రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురు, శుక్ర,శని వారాల్లో(28 నుంచి 30 తేదీ వరకు) కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని సూచించారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. తీవ్రవాయుగుండం ట్రింకోమలికి ఆగ్నేయంగా 280 కిలోమీటర్ల దూరంలో, నాగపట్నానికి 570 కి.మీ, పుదుచ్చేరికి 680 కి.మీ, చెన్నైకు 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావంతో రానున్న రోజుల్లో రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే రానున్న 48 గంటల్లో అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో, ఈనెల 30 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 45 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించారు. ఏపీలోని అన్ని పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
రైతులకు అలర్ట్
దక్షిణ కోస్తా తీరం వెంబడి రేపు సాయంత్రం నుంచి గంటకు 50-70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంట పొలాల్లో అదనపు నీటిని బయటకు పోయేలా ఏర్పాట్లు చేయాలన్నారు. పండించిన ధాన్యాన్ని సురక్షిత ప్రదేశాల్లో ఉంచాలని, ఉద్యానవన పంట మొక్కలు, చెట్లు పడిపోకుండా నిలబడేందుకు కర్రలు సపోర్ట్ పెట్టాలని సూచించారు.
ఏపీలో రానున్న నాలుగు రోజుల వాతావరణం ఇలా
నవంబర్ 27, బుధవారం :
నెల్లూరు, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 28, గరువారం :
కాకినాడ, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి, అనకాపల్లి, తూర్పూగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 29, శుక్రవారం :
నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్యమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
నవంబర్ 30, శనివారం :
నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సంబంధిత కథనం