TGPSC Group 1 Results : మొదలైన మూల్యాంకనం - ఆలోపే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలు..!
TGPSC Group 1 Results : గ్రూప్ 1 ఫలితాల ప్రకటనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కసరత్తు చేస్తోంది. ఇటీవలనే మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… మూల్యాంకనం మొదలుపెట్టింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి ఫలితాలను ప్రకటించాలని యోచిస్తోంది.
గ్రూప్ 1 ఫలితాలపై టీజీపీఎస్సీ ఫోకస్ పెట్టింది. ఇటీవలనే మెయిన్స్ పరీక్షలు పూర్తి కాగా… జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ప్రారంభించింది. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం పూర్తి కాగానే… మెరిట్ జాబితాను సిద్ధం చేయనుంది. ఒక్క పోస్టుకు ఇద్దరిని ఎంపిక చేసి వారి ధ్రువపత్రాలను పరిశీలించనుంది.
ఇదంతా కూడా పూర్తి చేసేందుకు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనుంది. తుది ఫలితాలను ఫిబ్రవరి మాసంలో ప్రకటించాలని టీజీపీఎస్సీ యోచిస్తోంది. ఇందుకు ఫిబ్రవరి 20వ తేదీలోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…. పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ కు మరికొన్ని పోస్టులను జత చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 563 పోస్టులకు 2024 ఫిబ్రవరి 19న ప్రకటన జారీ చేసింది. 4,03,645 మంది అప్లికేషన్లు చేసుకోగా… జూన్ 9న ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగింది. మెయిన్స్ పరీక్షలకు 31,382 మంది అభ్యర్థులు ఎంపిక కాగా… వీరిలో 21,093 మంది మెయిన్స్ పేపర్లు రాశారు.
మెయిన్స్ జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల రెండో వారం నుంచి ప్రారంభమైంది. క్షుణ్ణంగా పరిశీలించి… మార్కులను కేటాయిస్తారు. ఆ తర్వాత మెరిట్ జాబితాను ప్రకటించనున్నారు. మొత్తంగా నోటిఫికేషన్ ఇచ్చిన నాటి నుంచి ఏడాది లోపే మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని టీజీపీఎస్సీ భావిస్తోంది.
గ్రూప్ 2 పరీక్షల షెడ్యూల్ విడుదల:
గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. 2024, డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. హాల్ టికెట్లను డిసెంబర్ 9వ తేదీ నుంచి అందుబాటులో ఉంచుతామని.. టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు సూచించింది.
డిసెంబర్ 15, 16వ తేదీల్లో రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన హాల్ టికెట్ డౌన్ లోడ్ సమయంలో సమస్యలు తలెత్తితే సంబంధింత అధికారులను సంప్రదించాలని సూచించింది.
పరీక్షలు ఇలా..
- డిసెంబర్ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
- డిసెంబర్ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-2
- డిసెంబర్ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
- డిసెంబర్ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్-4
మొత్తం 783 పోస్టులతో టీఎస్‌పీఎస్సీ గతేడాది గ్రూప్ 2 ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16వరకు దరఖాస్తులు స్వీకరించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.