CM Revanth Reddy : వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన-khammam cm revanth reddy announces 10k compensation for flood affected people ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Revanth Reddy : వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

CM Revanth Reddy : వరద బాధితులకు తక్షణ సాయంగా రూ.10 వేలు, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునిగిన వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

వరద బాధితులకు రూ.10 వేలు తక్షణ సాయం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

CM Revanth Reddy : ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. వరదలతో రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునిగి నష్టపోయిన బాధితులకు రూ.10 వేలు చొప్పున తక్షణ సాయం అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు. అలాగే ప్రతీ కుటుంబానికి నిత్యవసరాలు అందించాలని ఆదేశించారు. సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లారు. వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా ఖమ్మం వెళ్లే మార్గమధ్యలో దెబ్బతిన్న పాలేరు లెఫ్ట్ కెనాల్, దెబ్బ తిన్న పంట పొలాలను పరిశీలించారు.

అన్ని విధాలా ఆదుకుంటాం

వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో సూర్యాపేట జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాను. ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు తెలుసుకుని తక్షణ సహాయం కోసం జిల్లాకు రూ.5 కోట్ల నిధులు విడుదల చేశారు. ప్రాణనష్టం జరిగిన కుటుంబాలకు రూ.5 లక్షలు, పశువులు చనిపోతే రూ.50 వేలు, పంట నష్టం జరిగితే ఎకరాకు రూ.10 వేల పరిహారం అందించాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రజలు ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్నీ విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఖమ్మం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... వరద ప్రజల బతుకుల్లో విషాదాన్ని నింపాయన్నారు. బాధితులను ఆదుకునేందుకు మంత్రులు, అధికారులు నిరంతరం కష్టపడుతున్నారన్నారు. గత 60, 70 ఏళ్లలో ఇంత భారీ వర్షం చూడలేదని చెబుతున్నారు. వరదలో రాజీవ్‌ గృహకల్పలో నివసిస్తున్న వందల కుటుంబాలు నష్టపోయాయని ఆవేదన చెందారు. కష్టపడి సంపాదించుకున్నవన్నీ వరద నీటిలో మునగడంతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. తమ పిల్లల సర్టిఫికెట్లు వరద నీటిలో నానిపోయాయని ప్రజలు వాపోతున్నారన్నారు. బాధితులకు తక్షణమే నిత్యవసరాలు అందించాలని కలెక్టర్ ను ఆదేశించారు.

రూ.10 వేలు తక్షణ సాయం

రాజీవ్ గృహకల్పలో ఇళ్లు నీట మునిగిన వారిని తక్షణమే రూ.10 వేలు ఆర్థిక సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రమాదవశాత్తు ప్రాణనష్టం జరిగితే రూ.5 లక్షలు, పశువులు చనిపోతే రూ.50 వేలు, గొర్రెలు, మేకలు చనిపోతే రూ.5 వేలు చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు. ఇల్లు దెబ్బతిన్న వారిని గుర్తించి పీఎం ఆవాస్‌ యోజన కింద ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదలతో సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి కుటుంబానికి సాయం అందిస్తామన్నారు. రెవెన్యూ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఎంత నష్టపోయారో అంచనా వేస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

వరదల్లో బురద రాజకీయాలు వద్దు

"అమెరికాలో ఉండి ఒకాయన ట్విట్టర్ లో పెడుతున్నాడు. ఒకాయన ఫాంహౌస్ లో ఉన్నాడు. వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు. బెయిల్ కోసం 20 మంది ఎమ్మెల్యేలతో దిల్లీ వెళతారు కానీ, వరద బాధితులను పరామర్శించరు. మంత్రులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా నేను సమీక్ష చేస్తున్నా. వరదల సమయంలో కేంద్రం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్.డి.ఆర్.ఎఫ్ ను ఏర్పాటు చేసుకుంది. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాని మోదీని రాష్ట్రానికి ఆహ్వానించాం"- సీఎం రేవంత్ రెడ్డి

సంబంధిత కథనం