Puvvada Vs Vaddiraju: ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ తీరుపై ఎంపీ వద్దిరాజు విమర్శలు-mp vadirajus indirect criticism of former minister puvwada ajay ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Puvvada Vs Vaddiraju: ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ తీరుపై ఎంపీ వద్దిరాజు విమర్శలు

Puvvada Vs Vaddiraju: ఖమ్మంలో మాజీ మంత్రి పువ్వాడ తీరుపై ఎంపీ వద్దిరాజు విమర్శలు

HT Telugu Desk HT Telugu
Jan 10, 2024 08:18 AM IST

Puvvada Vs Vaddiraju: చెట్టు కొమ్మలు నరుక్కుని ఏకంగా చెట్టును కూలిపోయేలా చేశామంటూ మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఎంపీ వద్దిరాజు విమర్శలు గుప్పించారు.

ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

Puvvada Vs Vaddiraju: "గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడిని గ్రహించ లేక పోయామని, చెట్టు కొమ్మలను మనమే నరుక్కుని అసలు చెట్టే కూలిపోయేలా చేశాము.." ఖమ్మం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర విమర్శించారు.

ఎంతో సౌమ్యుడిగా ఉంటూ ఆచితూచి మాట్లాడతారని పేరున్న రవిచంద్ర ఇంతలా ఆవేశానికి లోనై మాట్లాడటం ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన పార్లమెంటరీ పార్టీ స్థాయి సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది.

గడిచిన ఎన్నికల్లో వద్దిరాజుకు ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. పార్టీకి అత్యంత విస్వాసపాత్రుడిగా, విధేయుడిగా ఉండే ఆయన ఆ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు తీవ్రంగానే శ్రమించారు. అయినా ఆ రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు సాధ్యపడకపోవడంతో నిరాశ చెందారు.

తాజాగా రవిచంద్ర చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న ఆధిపత్య ధోరణులను బహిర్గతం చేస్తున్నాయన్న చర్చ జరుగుతోంది.

మాజీ మంత్రి అజయ్ పై బాణాలు..

అధికారంలో ఉన్నంత సేపు ఒకలా.. అధికారం కోల్పోయాక మరొకలా అన్న రీతిలో ఇప్పుడు మాజీ మంత్రి అజయ్ కుమార్ పరిస్థితి మారింది. వద్దిరాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు అజయ్ పోకడలకు అద్దం పట్టేలా కనిపిస్తున్నాయి.

"చెట్టు కొమ్మలను మనమే నరుక్కున్నాం.. చివరికి చెట్టే కూలిపోయింది.." అంటూ ఆయన మాట్లాడిన మాటల వెనుక ఎంతో పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఉండ పట్టలేక చేసినవేనని చెబుతున్నారు.

"అంతా తానే.. అన్నీ నేనే.." అన్న చందంగా మంత్రి అజయ్ వ్యవహరించారన్న ఆంతర్యం రవిచంద్ర మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో గెలుపు కోసం ఆయన తీవ్రంగా కష్టపడటంతో పాటు కాంగ్రెస్ లో మాజీమంత్రి, సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్ వంటి కీలక నేతను బీఆర్ఎస్ లోకి తీసుకురావడం ద్వారా వద్దిరాజుకు పార్టీ పట్ల ఉన్న చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.

పార్టీలో కీలకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన నేతలు చెట్టు కొమ్మలను నరికేశారన్న ఆవేదనను ఆయన వ్యక్తం చేయడం ఆసక్తిని రేపుతున్నాయి. అలాగే మధిర నియోజకవర్గ అభ్యర్థి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు విషయంలో జరిగిన అన్యాయం కూడా సమావేశంలో చర్చకు రావడం మాజీ మంత్రి అజయ్ వ్యవహరించిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయన్న చర్చ పార్టీలో మొదలైంది.

తడి గుడ్డతో కమల్ రాజు గొంతు కోశారని ఆ నియోజకవర్గ నాయకులు వ్యాఖ్యానించడం మాజీ మంత్రి పైకే వేళ్ళను చూపిస్తున్నాయి. ఏదిఏమైనా "నేనొక్కడినే" అన్నట్లు ఆయన వ్యవరించిన తీరుతో గత ఎన్నికల్లో తీవ్రంగా నష్టం జరిగిందని, ఇదే వైఖరి అవలంభిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం నష్టపోతామన్న ఆవేదనను నేతలు వ్యక్తం చేయడం గమనార్హం.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.