TG Rythu Runa Mafi : తెలంగాణ రైతులకు శుభవార్త - ఇవాళ మరో 3 లక్షల మందికి రుణమాఫీ..!-another 3 lakh people will get loan waiver in telangana today key details read here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Rythu Runa Mafi : తెలంగాణ రైతులకు శుభవార్త - ఇవాళ మరో 3 లక్షల మందికి రుణమాఫీ..!

TG Rythu Runa Mafi : తెలంగాణ రైతులకు శుభవార్త - ఇవాళ మరో 3 లక్షల మందికి రుణమాఫీ..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Nov 30, 2024 10:35 AM IST

Telangana Crop Loan Waiver Scheme: నాల్గో విడత రుణమాఫీ నిధుల విడుదలకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇవాళ మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు కావాల్సిన రూ. 3వేల కోట్లను సిద్ధం చేసినట్లు సమాచారం. సీఎం ప్రకటన వెంటనే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి.

నేడు మరో 3 లక్షల మందికి రుణమాఫీ
నేడు మరో 3 లక్షల మందికి రుణమాఫీ

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. ‘రైతు పండగ’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రైతులతో భారీ సభను ఏర్పాటు చేయగా… ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది.

సీఎం రేవంత్ ప్రకటన…!

ప్రధానంగా రైతు రుణమాఫీపై సీఎం ప్రకటన ఉండనుందని తెలిసింది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా… నాల్గో విడతలో మరో 3 లక్షల మందికి రుణమాఫీ స్కీమ్ ను వర్తింపజేయనున్నారు. వీరంతా కూడా రుణమాఫీ కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. అయితే పలు సాంకేతిక కారణాల రీత్యా వీరికి రుణమాఫీ కాలేదు. కుటుంబ నిర్ధారణ ప్రక్రియ పూర్తి కావటంతో… వీరికి కూడా మాఫీ చేయాలని సర్కార్ సిద్ధమైంది. ఇటీవలే షాద్ నగర్ లో మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల… పాలమూరు రైతన్న సభలో రుణమాఫీ నిధులను విడుదల చేస్తామని చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. మరోవైపు రూ. 3 లక్షల మందికి మాఫీ చేసేందుకు రూ. 3వేల కోట్లను సిద్ధం చేసినట్లు తెలిసింది.

రైతన్న సభకు అన్ని జిల్లాల నుంచి భారీగా రైతులు తరలిరానున్నారు. ఇందుకోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. రుణమాఫీనే కాకుండా… రైతుభరోసాపై కూడా ప్రకటన ఉండే అవకాశం ఉంది. రుణమాఫీపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన వెంటనే… రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ కానున్నాయి.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్…  రూ.2 లక్షల పంట రుణాల మాఫీ పథకాన్ని పట్టాలెక్కించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 22,22,067 మంది రైతులకు రూ.17,869.22 కోట్లను మాఫీ చేసింది. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసింది.

అయితే కొన్ని సాంకేతిక కారణాలతో అధిక సంఖ్యలో రైతులకు రుణమాఫీ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం.. వారి వివరాలను సేకరించింది. కుటుంబ నిర్ధారణ చేసేందుకు మూడు నెలలపాటు సమయం తీసుకుంది. ఈ ప్రక్రియ పూర్తి కావటంతో రుణమాఫీ కాని వారికి స్కీమ్ ను వర్తింపజేయనుంది. ఇందుకోసం నిధులను కూడా సిద్ధం చేసింది. సీఎం ప్రకటన చేయగానే వీటిని నేరుగా ఆయా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు.

ప్రజాపాలన విజయోత్సవాలు:

డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు రాష్ట్రమంతా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.  అన్ని వర్గాల ప్రజల భాగస్వామ్యంతో విజయోత్సవాల నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. 

డిసెంబర్ 4 వ తేదీన పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభ జరపనుంది. ఈ వేదికగా గ్రూప్ 4 తో పాటు వివిధ రిక్రూట్‌మెంట్ల ద్వారా ఎంపికైన 9 వేల మందికి నియామక పత్రాలు అందించనుంది. 

డిసెంబర్ 1 వ తేదీ నుంచి శాఖల వారీగా నిర్దేశించిన మేరకు వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం వెల్లివిరిసేలా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. ఈ విజయోత్సవాల్లో భాగంగానే ఇవాళ పాలమూరులో రైతన్న సభను నిర్వహిస్తున్నారు.

 

Whats_app_banner