ISKCON prayers : బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణకు ప్రపంచవ్యాప్తంగా ఇస్కాన్ ‘ప్రార్థనలు’!
ISKCON prayers : బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణకు ప్రపంచవ్యాప్తంగా ప్రార్థనలు చేపట్టాలని ఇస్కాన్ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న అందరు తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చింది.
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న సంఘటన నేపథ్యంలో ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కైన్సైన్స్) కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌లోని మతపరమైన మైనారిటీలు, మరీ ముఖ్యంగా హిందువుల భద్రత కోసం డిసెంబర్ 1న “ప్రే అండ్ ఛాంట్” పేరుతో ప్రార్థనలను నిర్వహించనుంది.
"150కి పైగా దేశాలు, లెక్కలేనన్ని నగరాలు, పట్టణాల్లోని లక్షలాది మంది ఇస్కాన్ భక్తులు ఈ ఆదివారం, డిసెంబర్ 1వ తేదీన.. బంగ్లాదేశీ మైనారిటీల భద్రత కోసం ప్రార్థనలు, మంత్రోచ్ఛారణలు చేయనున్నారు. దయచేసి మీ స్థానిక #ISKCON ఆలయం లేదా సభలో చేరండి, అని ఇస్కాన్ కోల్‌కతా ప్రతినిధి రాధారామ్ దాస్ సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ చేశారు.
ఇస్కాన్ మాజీ సభ్యుడు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని దేశద్రోహం కేసులో అరెస్టు చేసిన తర్వాత బంగ్లాదేశ్‌లో విస్తృతంగా నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆయనకు బెయిల్ కూడా నిరాకరించారు. ఈ పరిణామాల మధ్య ఇస్కాన్ ఈ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఢాకా, ఛటోగ్రామ్ సహా బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్రధానంగా హిందూ కమ్యూనిటీ సభ్యులు.. చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్ట్‌కి వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు.
ఛటోగ్రామ్‌లోని న్యూ మార్కెట్ ప్రాంతంలో జరిగిన హిందూ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ పతాకాన్ని అవమానించారని ఆరోపిస్తూ దాస్ సహా 19 మందిపై అక్టోబర్ 30న కొత్వాలి పోలీస్ స్టేషన్లో దేశద్రోహం కేసు నమోదైంది.
ఇస్కాన్ మాజీ సభ్యుడిపై రాజద్రోహం అభియోగాలు మోపడంతో నిరసనలు, అశాంతికి వేదికగా మారిన బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో శుక్రవారం మూడు హిందూ దేవాలయాలపై ఒక గుంపు దాడి చేసింది. నగరంలోని హరీష్ చంద్ర మున్సెఫ్ లేన్‌లో మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని, అక్కడ శాంతనేశ్వరి మాత్రి ఆలయం, సమీపంలోని షోని ఆలయం, శంతనేశ్వరి కలిబరి ఆలయం లక్ష్యంగా చేసుకున్నారని స్థానిక మీడియా సంస్థ తెలిపింది.
వందలాది మంది నినాదాలు చేస్తూ ఆలయాలపై ఇటుకలు విసిరారని, షోనీ ఆలయంతో పాటు ఇతర రెండు దేవాలయాల ద్వారాలను ధ్వంసం చేశారని ఆలయ అధికారులు తెలిపారు.
కొత్వాలి పోలీస్ స్టేషన్ చీఫ్ అబ్దుల్ కరీం ఈ దాడిని ధృవీకరించారు. దుండగులు దేవాలయాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు.
ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై ఒకరు ఇటుకలు విసురుకున్నారని, కానీ నష్టం చాలా తక్కువగా ఉందని పోలీసులు నివేదించారు.
శాంతినేశ్వరి ప్రధాన ఆలయ నిర్వహణ కమిటీ శాశ్వత సభ్యుడు తపన్ దాస్ BDNews24.com తో మాట్లాడుతూ.. “జుమా ప్రార్థనల తర్వాత వందలాది మందితో కూడిన ఊరేగింపు వచ్చింది. హిందూ వ్యతిరేక, ఇస్కాన్ వ్యతిరేక నినాదాలు చేయడం ప్రారంభించారు,” అని పేర్కొన్నారు. దాడి చేసిన వారిని తాము అడ్డుకోలేదన్నారు. పరిస్థితి విషమించడంతో సైన్యాన్ని పిలిచాం, వారు త్వరగా వచ్చి శాంతిని పునరుద్ధరించడానికి సహాయపడ్డారుని వివరించారు. మధ్యాహ్నానికి ముందే ఆలయ ద్వారాలన్నీ మూసివేశామని, దుండగులు అకారణంగా వచ్చి దాడికి పాల్పడ్డారని BDNews24.com కి తెలిపారు.
సంబంధిత కథనం