High Protein Dosa Recipe: దోశలు ఇలా చేసుకొని తింటే శరీరానికి పుష్కలంగా ప్రోటీన్.. తయారీ ఇలా
High Protein Dosa Recipe: దోశలను ఆరోగ్యానికి మేలు చేసే విధంగా కూడా చేసుకోవచ్చు. శరీరానికి ప్రోటీన్ పుష్కలంగా అందేలా దోశ తయారు చేయవచ్చు. రుచితో పాటు హెల్దీగానూ ఉంటుంది. ఈ హై ప్రోటీన్ దోశను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
దోశలు చాలా మందికి ఫేవరెట్ బ్రేక్‍ఫాస్ట్‌గా ఉంటుంది. ప్రతీ రోజు దోశలు తినమన్నా.. ఇష్టంగా తినేస్తారు. దోశల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయి. అయితే, ఆరోగ్యానికి మేలు చేసేలా.. ప్రోటీన్ పుష్కలంగా ఉండేలా కూడా దోశలు చేసుకోవచ్చు. వివిధ రకాల చిరుధాన్యాలను కలిపి చేసే ఈ దోశలు హెల్దీగా ఉంటాయి. ఈ హైప్రోటీన్ దోశలను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
హైప్రోటీన్ దోశకు కావాల్సిన పదార్థాలు
- 2 కప్పుల బియ్యం (రేషన్ బియ్యం మేలు)
- ఓ కప్పు రాగులు
- ఓ కప్పు జొన్నలు
- ఒ కప్పు మినప్పప్పు
- ఓ కప్పు పెసలు
- అర టీస్పూన్ మెంతులు
- ఓ టీస్పూన్ జీలకర్ర
- దోశ కాల్చుకునేందుకు నూనె
- తగినంత ఉప్పు
హైప్రోటీన్ దోశ తయారీ విధానం
- బియ్యం, రాగులు, జొన్నలు, మినప్పప్పు, పెసలు, మెంతులను నీటితో బాగా కడగాలి. సుమారు నాలుగుసార్లు వరకు వీటిని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వీటిని నీటిలో సుమారు 8 నుంచి 10 గంటల వరకు నానబెట్టాలి.
- ఆ ధాన్యాలు బాగా నానిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి.
- మెత్తగా గ్రైండ్ చేసుకున్న దోశ పిండిని మూతమూసి సుమారు 6 నుంచి 8 గంటలు పక్కన పెట్టి పులినియ్యాలి.
- పులిసిన తర్వాత పిండిలో తగినంత ఉప్పు, జీలకర్ర కాస్త నలిపి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి.
- ఆ తర్వాత పిండిని బాగా వేడెక్కిన పెనంపై దోశలా రుద్దాలి.
- దోశ కాస్త కాలుతున్నప్పుడు అంచుల వెంట, మధ్యలో కాస్త నూనె వేయాలి. దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చాలి. అవసరమైతే రెండో వైపు తిప్పి కాల్చాలి. ఆ తర్వాత ప్లేట్‍లోకి తీసుకోవాలి. అంతే ప్రోటీన్ పుష్కలంగా ఉండే దోశ రెడీ అవుతుంది.
ఈ హైప్రోటీన్ దోశను కొబ్బరి చట్నీ, అల్లం చట్నీలతో తినొచ్చు. రుచికరంగానూ, ఆరోగ్యకరంగానూ ఈ దోశ ఉంటుంది. ఈ చిరు ధాన్యాల్లో ప్రోటీన్ మెండుగా ఉంటుంది. పిల్లలకు ప్రోటీన్ ఎక్కువగా ఇవ్వాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. ఇలా చిరుధాన్యాలతో దోశ చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ దోశలు చాలా మేలు చేస్తాయి. వెయిట్ లాస్‍కు ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవడం ముఖ్యం.
ప్రోటీన్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
ప్రోటీన్ తీసుకోవడం వల్ల కండరాలకు మేలు జరుగుతుంది. కండలు పుష్టిగా ఉండేలా ప్రోటీన్ తోడ్పడుతుంది. ఎముకల దృఢత్వం కూడా పెరుగుతుంది. జీవిక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది. బ్లడ్ ప్రెజర్ నియంత్రణలో ఉండడంలోనూ తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ప్రోటీన్ చాలా ముఖ్యం. ఇది ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే తరచూ ఆకలి కాకుండా ఉంటుంది. క్యాలరీలు తక్కువగా తీసుకునేందుకు ఉపకరిస్తుంది. మజిల్ లాస్ కాకుండా చేయగలదు. ఎనర్జీని మెరుగ్గా ఉందిస్తుంది. అందుకే ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఈ దోశలను తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.