Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!-ttd decides to ban political and hate speeches in tirumala ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!

Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు!

Basani Shiva Kumar HT Telugu
Nov 30, 2024 11:12 AM IST

Tirumala : తిరుమల.. అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి చోట కొందరు రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరికొందరు రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి ప్రసంగాల పట్ల భక్తులు ఆగ్రహం, ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల
తిరుమల

తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రత, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల కొండపై రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ నిర్ణయించింది. కొంతకాలంగా కొందరు రాజకీయ నాయకులు తిరుమల కొండపై ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేస్తున్నారు. దీంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

రాజకీయ ప్రసంగాలతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు తీర్మానించింది. దీన్ని తాజాగా అమలులోకి తీసుకువచ్చింది. ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.

ఫొటో షూట్..

ఈ మధ్య తిరుమలలో ఫొటో షూట్ వివాదాస్పదంగా మారింది. శ్రీవారి ఆలయం ముందు నలుగురు కెమెరామెన్లు హల్ చల్ చేశారు. ఆలయ మహా ద్వారం ముందు, గొల్ల మండపం ఎదురుగా కెమెరాలతో ఫోటో షూట్ చేశారు. ఈ ఫొటో షూట్ చేయించుకుంది కడప జిల్లాకు చెందిన వ్యాపారి వంశీధర్ రెడ్డిగా గుర్తించారు. అక్కడ ఫొటో షూట్ జరుగుతున్నా.. టీటీడీ విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదు.

శ్రీవారి ఆలయం ఎదుట వంశీధర్‌ రెడ్డి హంగామాపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిగత సిబ్బంది మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. గతంలో ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై విజిలెన్స్, పోలీసులు కేసులు పెట్టారు. ఈ ఘటనలో మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

చలి పంజా..

తిరుమల కొండపై చలి తీవ్రత పెరిగింది. కమ్ముకున్న మంచుతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు చిరు జల్లులు పడుతున్నాయి. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. రూ.300 టికెట్ల కలిగిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది.

Whats_app_banner