Bapatla Crime : బాపట్ల జిల్లాలో ఘోరం.. మూడేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
Bapatla Crime : బాపట్ల జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై వరుసకు తాత అయ్యే అరవై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని ఒక గ్రామంలో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చినగంజాం ఎస్ఐ శీలం రమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భార్య భర్తలు హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ అక్కడే జీవిస్తున్నారు. వీరికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఈనెల 25న బంధువల పెళ్లి కోసం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో 26న ఉదయం ఇంటి వద్దే బాలిక ఆడుకుంటుంది. ఆ సమయంలో బాలికను వరుసకు తాత అయ్యే చాట్ల అంజయ్య ఉపాధి పనులకు వెళ్తూ.. తనతో పాటు తీసుకెళ్లాడు.
తన మనవరాలిని అంజయ్య తీసుకెళ్లడం బాలిక సొంత తాత చూశాడు. అంజయ్య ఉపాధి పనులకు వెళ్తున్న మార్గమధ్యలోని ఊరికి సమీపంలోని జొన్న చేను మధ్యలోకి ఆ చిన్నారిని తీసుకెళ్లాడు. తాకకూడని ప్రదేశంలో తాకుతూ అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక ఏడుస్తూ కేకలు పెట్టింది. ఆ సమయంలో పనుల నిమిత్తం పొలానికి వెళ్తున్న కొందరు యువకులు పరిగెత్తుకెళ్లారు. యువకులను చూడగానే.. తన వల్ల తప్పు జరిగిందని, క్షమించండని చెప్పి అంజయ్య అక్కడి నుంచి పారిపోయాడు.
ఆ యువకులు బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో అంతా సర్ధుమణిగింది. ఆ వృద్ధుడు అత్యాచారానికి యత్నించిన ఘటన గురించి కుటుంబ సభ్యలకు తెలియదు. బాలిక చెప్పలేదు. కుటుంబ సభ్యలకు బాలికను అప్పగించిన ఆ యువకులు కూడా చెప్పలేదు. కానీ.. రెండు రోజులు గడిచిన తరువాత పాప తల్లికి ఈ విషం స్నేహితురాలి ద్వారా తెలిసింది. అదే రోజు సాయంత్రం కొందరు వెళ్లి అంజయ్యను పట్టుకొని చితకబాదారు.
జరిగిన విషయాన్ని 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. పోలీసులు గురువారం రాత్రి గ్రామానికి వెళ్లి విచారించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అంజయ్యపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు.. చినగంజాం ఎస్ఐ శీలం రమేష్ వెల్లడించారు. ఈ కేసును డీఎస్పీ విచారణ చేస్తారని చెప్పారు. బాలిక కుటుంబ సభ్యుల దాడిలో గాయపడ్డ అంజయ్యను వారి కుటుంబ సభ్యులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయనకు వైద్యం చేయిస్తున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)