Cyclone Fengal : ఫెంగల్​ తుపానుతో టెన్షన్​- టెన్షన్​! భారీ వర్షాలతో అల్లకల్లోలం..-cyclone fengal to make landfall today tamil nadu puducherry schools closed ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cyclone Fengal : ఫెంగల్​ తుపానుతో టెన్షన్​- టెన్షన్​! భారీ వర్షాలతో అల్లకల్లోలం..

Cyclone Fengal : ఫెంగల్​ తుపానుతో టెన్షన్​- టెన్షన్​! భారీ వర్షాలతో అల్లకల్లోలం..

Sharath Chitturi HT Telugu
Nov 30, 2024 10:38 AM IST

Cyclone Fengal : ఫెంగల్​ తుపాను నేపథ్యంలో తమిళనాడులో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాను శనివారం మధ్యాహ్నం- సాయంత్రం మధ్యలో తీరం దాటనుంది.

ఫెంగల్​ తుపాను నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉన్నారు.
ఫెంగల్​ తుపాను నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉన్నారు. (PTI)

ఫెంగల్​ తుపాను వణికిస్తోంది! పుదుచ్చెరికి సమీపంలో తమిళనాడు తీరం వెంబడి ఈ తుపాను శనివారం మధ్యాహ్నం- సాయంత్రానికి తీరం దాటనుంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ)

తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్, కేరళ, ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఈ తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనించి పుదుచ్చేరి సమీపంలోని కరైకల్, మహాబలిపురం మధ్య ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల్లో తీరందాటుతుందని ఆ సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనాలు ఉన్నాయి.

ఫెంగల్ తుపాను- ముఖ్యమైన పాయింట్స్​..

శనివారం ఉదయం నాటికి ఈ ఫెంగల్​ తుపాను తమిళనాడు తీరానికి 300-350 కిలోమీటర్ల దూరంలో ఉందని ఐఎండీ సైక్లోన్ డివిజన్ హెడ్ ఆనంద దాస్ తెలిపారు. ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్​లోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, నవంబర్ 30న ఇంటీరియర్ తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

నవంబర్ 30న తమిళనాడులోని లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. తమిళనాడు నుంచి కేరళ, ఇంటీరియర్ కర్ణాటక వరకు డిసెంబర్ 1 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. భారీ వర్షాల దృష్ట్యా రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఫెంగల్​ తుపాను నేపథ్యంలో తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించినట్లు జిల్లా యంత్రాంగాన్ని ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

తుపాను ప్రభావం చెన్నైలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా రవాణా స్తంభించింది. విమాన సేవలకు సైతం అంతరాయం ఏర్పడింది. తమిళనాడులో ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య ఇండిగో ఎయిర్​లైన్స్​ ఒక అడ్వైజరీని జారీ చేసింది. "ప్రస్తుత వాతావరణ పరిస్థితులు #Chennai, #Tiruchirappalli, #Tuticorin, #Madurai విమానాలపై ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు #Tirupati, #Vishakhapatnam కూడా ప్రభావితమయ్యాయి. ప్రయాణికులు అలర్ట్​గా ఉండాలి," అని స్పష్టం చేసింది.

రానున్న 24 గంటల్లో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ తెలిపారు. తుపాను మరింత బలపడి వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని వెల్లడించారు.

ఫెంగల్​ తుపాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నాగపట్నం, మైలాడుదురై, తిరువారూర్, కడలూరు, తంజావూరు, చెంగల్పట్టు, చెన్నై సహా ప్రభావిత జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్, రాష్ట్ర బృందాలను మోహరించారు. బోట్లు, జనరేటర్లు, మోటారు పంపులు, ఇతర అవసరమైన పరికరాలను సిద్ధం చేశారు. జిల్లా అధికారులతో పర్యవేక్షించడానికి, సమన్వయం చేసుకోవడానికి సీనియర్ అధికారులను నియమించి, సమర్థవంతమైన విపత్తు నిర్వహణ కోసం ఆయా జిల్లాల్లో వారిని మోహరించారు.

పాఠశాలలు, కళాశాలలకు సెలవు..

ఫెంగల్ తుపాను సమీపిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని పుదుచ్చెరి మత్స్యశాఖ సూచించింది. దెబ్బతినకుండా తమ పడవలు, సామగ్రిని ఎత్తైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. పుదుచ్చెరిలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు శనివారం సెలవు ప్రకటించారు.

విపత్తు కాల్స్ కోసం టోల్ ఫ్రీ నంబర్లు 112, 1077, 9488981070 వాట్సాప్ హెల్ప్​లైన్​ని ఏర్పాటు చేసింది రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ.

పుదుచ్చెరి సమీపంలో ఫెంగల్ తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నందున ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం