Warangal : కంచే చేను మేస్తోంది.. పోలీస్ కానిస్టేబుల్ ఇంట్లో గంజాయి.. ఊహించని ట్విస్ట్ ఇది!
Warangal : గంజాయి రవాణాపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. పోలీసులు గట్టి నిఘాపెట్టి గంజాయి స్మగ్లర్లను పట్టుకుంటున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా పట్టుకున్న గంజాయి ఎక్కడికి పోతుందో మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా పోలీసులు పట్టుకున్న గంజాయి స్టేషన్ నుంచి ఓ కానిస్టేబుల్ ఇంటికి చేరుతోంది.
తెలంగాణలో ఇటీవల గంజాయి గుప్పుమంటోంది. ఎక్కడి నుంచి వస్తుందో ఏమోగానీ.. యువతను చిత్తు చేస్తోంది. దీంతో రేవంత్ సర్కారు సీరియస్‌గా గంజాయి నిర్మూలనపై ఫోకస్ పెట్టింది. పోలీసు శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పోలీసులు కూడా పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని.. గంజాయి స్మగ్లర్ల ఆటకట్టిస్తున్నారు. క్వింటాళ్ల కొద్ది గంజాయిని స్వాధీనం చేసుకుంటున్నారు.
అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చేస్తున్న ఈ పని బాగానే ఉంది. కానీ.. కంచే చేను మేసింది. అవును.. గంజాయి నిర్మూలన కోసం పని చేయాల్సిన పోలీసు ఇంట్లోనే గంజాయి దొరికింది. ఈ ఘటన వరంగల్ కమిషనరేట్ పరిధిలో సంచలనంగా మారింది. కాజీపేట పోలీసు డివిజన్ కరీంనగర్ రోడ్డులోని పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ జోరుగా గంజాయి దందా సాగిస్తున్నారు.
నర్సంపేటకు చెందిన ఈ కానిస్టేబుల్ ఇంట్లో.. ప్రత్యేక విభాగం పోలీసులు గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సంచలన విషయాలు తెలిసినట్టు సమాచారం. ఆ కానిస్టేబుల్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. దాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.
అయితే.. అదే ఠాణాలో పనిచేస్తున్న ఈ కానిస్టేబుల్ దృష్టి ఆ గంజాయిపై పడింది. దీంతో ఎవ్వరికీ తెలియకుండా కొంచెం కొంచెం నొక్కేయడం ప్రారంభించాడు. దాన్ని తన ఇంట్లో దాచి.. తనకు బాగా తెలిసిన వారి ద్వారా విక్రయించడం ప్రారంభించాడు. ఇక్కడిదాకా దందా సాఫీగా సాగింది. కానీ.. పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు.
ఆ కానిస్టేబుల్ ఎప్పటిలాగే తనకు తెలిసిన వారికి గంజాయి అమ్మడానికి ఇచ్చాడు. వారు వరంగల్ నుంచి నర్సంపేట వైపు బైక్‌పై వస్తున్నారు. అదే సమయంలో నర్సంపేట డివిజన్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అయితే.. పోలీసులను చూసి గంజాయి తీసుకొస్తున్నవారు పారిపోయేందుకు ప్రయత్నించారు.
అనుమానం వచ్చి పోలీసులు వారిని వెంబడించారు. గంజాయి తీసుకొస్తున్న ఇద్దరిలో ఒకరు పోలీసులకు చిక్కాడు. అతని వద్ద ఎండు గంజాయిని పోలీసులు ఆశ్చర్యపోయారు. తమస్టైల్‌లో విచారించగా.. అసలు విషయం చెప్పేశాడు. కానిస్టేబుల్ నుంచి తీసుకొని వచ్చి విక్రయిస్తున్నట్లు చెప్పాడు. దీంతో గంజాయి కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నట్టు సమాచారం.